త్వరలోనే మరో 15 మంది BRS ఎమ్మెల్యేలు జంప్.. బిగ్ బాంబ్ పేల్చిన MP రఘునందన్ రావు

by Satheesh |
త్వరలోనే మరో 15 మంది BRS ఎమ్మెల్యేలు జంప్.. బిగ్ బాంబ్ పేల్చిన MP రఘునందన్ రావు
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ ఫైర్ బ్రాండ్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల చివర్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యే నాటికి మరో 15 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశం ఉందని బిగ్ బాంబ్ పేల్చారు. మరో 15 నెలల వరకు అసలు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా..? అని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక, అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అడుగులు తడబడుతున్నాయని అన్నారు.

అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కాలేదని, కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని రైతుల సమస్యలను వెంటనే పరిష్కారించాలని ఈ సందర్భంగా రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఐదు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించారు. ఈ సమయం మొత్తం రాజకీయాల గురించే తప్ప.. రాష్ట్ర అభివృద్ధికి కోసం ఒక్క క్షణం కూడా ఆలోచించలేదని విమర్శించారు. ఇదిలా ఉంటే, రాష్ట్రంలో పవర్ కోల్పోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆరుగురు గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు.

ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్, కాలే యాదయ్య హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరి కొందరు గులాబీ ఎమ్మెల్యేలు సైతం త్వరలోనే అధికార పార్టీలో జాయిన్ అవుతారని పొలిటికల్ సర్కిల్స్‌లో వార్తలు కోడై కూస్తున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే మరో 15 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంప్ అవుతారంటూ రఘునందన్ రావు అనడం స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. రఘునందన్ రావు చెప్పిన ఆ 15 మంది ఎమ్మెల్యేలు ఎవరు అనేదానిపై చర్చ సాగుతోంది.

Next Story

Most Viewed