బీఆర్ఎస్‌ను మళ్లీ టీఆర్ఎస్‌గా మార్చడంపై KCR సంచలన ప్రకటన

by Satheesh |
బీఆర్ఎస్‌ను మళ్లీ టీఆర్ఎస్‌గా మార్చడంపై KCR సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించి టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన కేసీఆర్‌కు గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్‌గా పార్టీ పేరు మార్చిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లోనే గులాబీ పార్టీ ఓటమి పాలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి అనేక కారణాలు ఉన్నప్పటికీ.. పార్టీ పేరు నుండి తెలంగాణ అనే పదం తొలగించడం కూడా ఒక కారణమంటూ సొంత పార్టీ లీడర్ల నుండే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. తెలంగాణ ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ పేరు ప్రజల్లో బలంగా వెళ్లిందని.. అలాంటిది పార్టీ నుండి తెలంగాణ పేరును తొలగించడం కూడా ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపిందని బీఆర్ఎస్ నేతల అభిప్రాయం. బీఆర్ఎస్ పేరుతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి మూటగట్టుకోవడంతో.. బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చాలని ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి.

స్వయంగా గులాబీ పార్టీ కీలక నేతలు సైతం బీఆర్ఎస్‌ను మళ్లీ టీఆర్ఎస్‌గా మార్చడంపై ఆలోచన చేస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో బీఆర్ఎస్‌ను మళ్లీ టీఆర్ఎస్‌గా మార్చే అంశంపై పార్టీ అధినేత కేసీఆర్ స్పందించారు. మంగళవారం ఆయన ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్ డిబేట్‌లో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ పేరు మార్పు టాపిక్‌పై రియాక్ట్ అయ్యారు. బీఆర్ఎస్‌ను మళ్లీ టీఆర్ఎస్‌గా మార్చే ఉద్దేశం లేదని కేసీఆర్ కుండబద్దలు కొట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత నేతల పార్టీ మార్పు వ్యవహారంపైన ఆయన స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ ఒక మహా సముద్రమని.. ఇద్దరు, ముగ్గురు పోతే పార్టీకి ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు వెళ్లిన నేతలు తిరిగి వస్తే కాళ్లు మొక్కినా మళ్లీ చేర్చుకోనని తేల్చి చెప్పారు. అయితే, మాజీ మంత్రి ఎర్రబెల్లి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తదితర నేతలు బీఆర్ఎస్‌ను మళ్లీ టీఆర్ఎస్‌గా మార్చడంపై ఆలోచన చేస్తున్నామని చెప్పగా.. కేసీఆర్ మాత్రం పార్టీ పేరు మార్చే ఉద్దేశం లేదని తేల్చి చెప్పడంతో గులాబీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed