‘నిత్యం నరకమే!’.. విద్యార్థుల పాలిట శాపంగా మారిన రైస్ మిల్లు!

by Jakkula Mamatha |
‘నిత్యం నరకమే!’.. విద్యార్థుల పాలిట శాపంగా మారిన రైస్ మిల్లు!
X

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: బాగా చదువుకొని భావిభారత పౌరులుగా ఎదగాల్సిన విద్యార్థుల పాలిట ఓ రైస్ మిల్లు శాపంగా మారింది. రైస్ మిల్లు నుంచి విడుదలయ్యే వ్యర్థాలతో విద్యార్థులు వ్యధను అనుభవిస్తున్నారు. నిత్యం రైస్ మిల్లు నుంచి వచ్చే పొగ, బూడిద, ధూళితో వారు పాట్లు పడుతున్నారు. అంతేకాకుండా చర్మ సంబంధిత వ్యాధులతో పాటు అనారోగ్యానికి గురవుతున్నారు. పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల నిర్లక్ష్యం, ఉన్నతాధికారుల పట్టింపు లేమితో విద్యార్థులు నరకయాతన పడే పరిస్థితులు నెలకొంటున్నాయి. అధికారులు స్పందించి రైస్ మిల్ పై చర్యలు తీసుకోవాలని అటు తల్లిదండ్రులు ఇటు విద్యార్థులు వేడుకుంటున్నారు.

రైస్ మిల్లు వ్యర్థాలతో ఇబ్బందులు

జిల్లాలోని తంగళ్లపల్లి మండలం లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సుమారు 350కి పైగా విద్యార్థినిలు చదువుకుంటున్నారు. పాఠశాల పక్కనే ఒక బాయిలర్ రైస్ మిల్లు ఉంది. ఆ రైస్ మిల్లు నుంచి వెలువడే పొగ, దుమ్ము లాంటి వ్యర్థాలతో పాఠశాల ఆవరణ మొత్తం కాలుష్యమయం గా మారుతోంది. పాఠశాల తరగతి గదులు మొదలుకొని హాస్టల్, డిన్నింగ్ హాల్, ఆట స్థలం ఇలా పాఠశాల మొత్తం రైస్ మిల్లు వ్యర్థాలతో నిండిపోతుంది. చివరకు పిల్లలు తినే అన్నం ప్లేట్లలో కూడా వ్యర్థాలు పడుతున్నాయి. ఇంకా పాఠశాల ఆవరణలో జీవించడానికి ప్రాణవాయువును అందించే మొక్కలు, చెట్లను కూడా వ్యర్ధాలు కమ్మివేశాయి. వీటితోపాటు విద్యార్థునులు పిండి ఆరవేసిన బట్టలను కూడా మిల్లు నుండి వెలువడే పొగ, దుమ్ము, ధూళి ఆవహిస్తాయి. దీంతో విద్యార్థినులు దురద వంటి చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. అంతేకాకుండా కంటి సమస్యలతో పాటు, తరచు అనారోగ్యానికి గురవుతున్నారు.

గతంలోనే కలెక్టర్‌కు ఫిర్యాదు..

కాగా ఈ విషయం పై పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిలు తల్లిదండ్రులలో ఓ వ్యక్తి 2022లో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అప్పటి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అదనపు కలెక్టర్ రైస్ మిల్ యజమానితో మాట్లాడారు. రైస్ మిల్ నుండి వెలువడే వ్యర్థాలు విద్యార్థులు అనారోగ్యానికి గురి అయ్యే అవకాశం ఉందని, రైస్ మిల్లును వెంటనే పాఠశాల దగ్గర నుండి మార్చుకోవాలని ఆదేశించారు. అప్పుడున్న సీజన్ పూర్తవగానే బాయిలర్ రైస్ మిల్లు రా రైస్ మిల్‌గా మారుస్తామని అదనపు కలెక్టర్ తో యజమాని చెప్పినట్లు సమాచారం. కాగా రెండేళ్లు గడుస్తున్న రైస్ మిల్లు యజమాని అదనపు కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు చేస్తూ రైస్ మిల్లును అలాగే కొనసాగిస్తున్నారు. దీంతో పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అనారోగ్యానికి గురి కావడం పరిపాటిగా మారుతుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు కేజీబీవీ పాఠశాల పక్కనే ఉన్న కేంద్రీయ విద్యాలయం కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉంది. సుమారు వెయ్యి మంది విద్యార్థులు ఆ పాఠశాలలో అభ్యసించనున్నారు. ఈ విద్యాలయం విద్యార్థులు కూడా ఇవే సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అధికారులు చర్యలు తీసుకోవాలి. రాజేందర్ ఎస్ఎంసీ మాజీ చైర్మన్ రైస్ మిల్ నుంచి వెలువడే వ్యర్ధాలతో తంగల్లపల్లి కేజీబీవీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సదరు రైస్ మిల్లు పై చర్యలు తీసుకోని, విద్యార్థినిలు అనారోగ్యం బారిన పడకుండా కాపాడాలి.

Advertisement

Next Story