కేసీఆర్ ను ముంచింది రోయ్యల పులుసే!.. కేంద్రమంత్రి బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Ramesh Goud |   ( Updated:2024-07-06 14:52:56.0  )
కేసీఆర్ ను ముంచింది రోయ్యల పులుసే!.. కేంద్రమంత్రి బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేసీఆర్ ను రొయ్యల పులుసు, చేపల పులుసు కొంప ముంచాయని, ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే కాంగ్రెస్ మంత్రుల ఉద్యోగాలు కూడా పోతాయని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో వచ్చేది బీజేపీయేనని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ స్టేట్ ఆఫీస్ లో మీడియా చిట్ చాట్ లో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై పలు విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ ను రొయ్యల పులుసు, చేపల పులుసు కొంప ముంచాయని ఆరోపించారు. విమోచన దినోత్సవం నిర్వహించేందుకు తలలు పగులకొట్టుకున్నామని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదని, ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఢిల్లీ కార్యాలయంలో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. కేంద్రమంత్రి పదవితో నన్ను కట్టి పడేశారని, అయినా రాజకీయ విమర్శలపై నా దూకుడు తగ్గదని అన్నారు.

ఒక పార్టీ గుర్తుపై గెలిచి పార్టీ మారితే రాజీనామా చేయాలని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. కానీ వారు అమలు చేయడం లేదని మండిపడ్డారు. 25 మంది టచ్ లో ఉన్నారని చెబుతున్నారని.. అదే జరిగితే ఆ స్థానాలన్నింటికీ బై ఎలక్షన్ జరగాల్సి ఉంటుందని, అలా జరిగితే ఆ స్థానాలన్ని బీజేపీ గెలుస్తుందని, అప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా బీజేపీకే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు ఉండవు కాబట్టి కే కేశవ్ రావు ఒక్కడే రాజీనామా చేశారని, మరి మిగతా వాళ్ళు ఎందుకు రాజీనామాలు చేయడం లేదని బండి సంజయ్ నిలదీశారు. అలాగే కేసీఆర్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్లనే కాంగ్రెస్ కు పదవులు వచ్చాయని, వీళ్ళు హామీలో ఇచ్చినట్లుగా భర్తీ చేయకుంటే కాంగ్రెస్ మంత్రుల ఉద్యోగాలు పోవడం ఖాయమని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమాలు చేస్తే.. మాపై లాఠీచార్జి చేసారని, రాష్ట్రంలో ఇప్పుడు అదే పరిస్థితి ఉందని, మా నేతల ఇండ్లలోకి వెళ్లి మరీ జుట్టు పట్టి లాగి మరీ కొడుతున్నారని ఆరోపించారు.

ఈడీ కేసులు ఉన్నవారిని బీజేపీలో చేర్చుకోబోమని తేల్చి చెప్పారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో మహిళలు అని కూడా చూడకుండా దాడి చేశారని ఫైర్ అయ్యారు. అలాగే వచ్చేసారి జీహెచ్ఎంసీ సమావేశంలో ఎంఐఎం వర్సెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందని చెప్పారు. ఎంఐఎం పార్టీ గోడమీద కూర్చొని, ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళతో కలుస్తుందని, బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే ఎంఐఎం నేతలు ఇతర ప్రాంతాల్లో తిరగగలరా కేంద్రమంత్రి ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి, ఒవైసీ కుమ్మక్కయ్యారని, వారి వారి బిజినెస్, ఆర్ధిక లావాదేవీల గురించి మాత్రమే వాళ్ళు కలుస్తారని విమర్శలు చేశారు. ఇద్దరు సీఎంల భేటీని మేము స్వాగతిస్తున్నామని, రెండు రాష్ట్రాల ప్రజలకు అన్యాయం జరగకుండా.. న్యాయం జరగాలని కోరుకున్నారు. అలాగే సెంటిమెంట్ రెచ్చగొట్టి మరో ఉద్యమం చేసి లబ్ది పొందాలని, కొందరు గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నారని, అలాంటి పరిస్థితి మళ్ళీ రానివ్వొద్దని ప్రభుత్వానికి సూచించారు. ఇక వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో వచ్చేది బీజేపీయేనని బండి సంజయ్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed