కూతురు కోసం సిట్టింగ్ ఎమ్మెల్యేకు KCR షాక్.. Kavitha పోటీ అక్కడి నుంచేనా?

by Nagaya |   ( Updated:2022-11-30 13:12:27.0  )
కూతురు కోసం సిట్టింగ్ ఎమ్మెల్యేకు KCR షాక్.. Kavitha పోటీ అక్కడి నుంచేనా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాలు భగభగ మంటున్నాయి. ఓ వైపు రాష్ట్రంలో కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు.. మరో వైపు కేంద్రంతో సీఎం కేసీఆర్ నేరుగా ఢీ అంటే ఢీ అనడంతో తెలంగాణ పొలిటికల్ దంగల్ మరింత రసవత్తరంగా మారుతోంది. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య పోరు రోజు రోజుకు తీవ్రతరం అవుతుంటే కాంగ్రెస్ తో సహా మిగతా పార్టీలు రాబోయే ఎన్నికలకు కసరత్తును ప్రారంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు టీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పార్టీ పరిస్థితిపై అంచనాలు వేసుకుంటున్నట్టు చర్చ జరుగుతోంది. అయితే రాబోయే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తానని కేసీఆర్ ప్రకటించడంతో టీఆర్ఎస్ పార్టీలోని ఆశావాహుల పరిస్థితి అయోమయంగా మారింది. ఇదిలా ఉంటే కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత విషయంలో టీఆర్ఎస్ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతునట్టు ప్రచారం జరగడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

అసెంబ్లీ సీటుపై కన్నేసిన కవిత?

2014లో నిజామాబాద్ లోక్ సభకు ఎన్నికైన కవిత అనంతరం జరిగిన 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కొంత కాలం పొలిటికల్ గా సైలెంట్ అయిన కవితకు కేసీఆర్ ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వడంతో తిరిగి యాక్టివ్ గా మారారనే టాక్ ఉంది. అయితే ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయంగా కవిత స్పీడ్ పెంచడం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ సారి ఎక్కడి నుంచి పోటీ చేసినా నిన్ను నేనే ఓడిస్తా అని అర్వింద్ ను ఉద్దేశించి కవిత ఇటీవల చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. దీంతో ఈ ఇద్దరి మధ్య పొలిటికల్ ఫైట్ తారా స్థాయికి చేరినట్టైంది. ఇదిలా ఉంటే ఓ ఇంట్రెస్టింగ్ టాక్ ప్రచారంలోకి వస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో కవిత ఆలోచన మరోలా ఉందని, ఆమె లోక్ సభకు కాకుండా అసెంబ్లీ దిశగా అడుగులు వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్.. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. అదే తండ్రి వారసత్వంగా రాజకీయ ప్రవేశం చేసిన కవిత నిజామాబాద్ లో ఓటమి పాలవడంతో ఎమ్మెల్సీగా కాలం నెట్టుకురావాల్సి వస్తోంది. అయితే ఈ సారి అసెంబ్లీకి పోటీ చేసి తాను కూడా ఎలాగైన మంత్రి వర్గంలో చోటు సంపాదించాలనే పట్టుదలతో కవిత ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

కవిత కోసం త్యాగం చేసేదెవరూ?

శాసనసభకు కవిత పోటీ చేస్తారనే మాట వినడానికి బాగానే ఉన్నా ఆమె పోటీ చేయాలంటే ఎవరో ఒకరు తమ సీటును త్యాగం చేయాల్సి ఉంటుంది. ముఖ్యమంగా కవిత నిజామాబాద్ అర్బన్, బోధన్ లేదా ఆర్మూర్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక్కడ కుదరకుంటే జగిత్యాల స్థానం నుంచైనా పోటీ చేసేందుకు ఆమె ఆసక్తి కనపరుచుతున్నారనే ఊహాగానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కవిత నిజామాబాద్ నగరంపై ఇటీవల ప్రత్యేక దృష్టి సారించారని, మరో వైపు జగిత్యాల నియోజకవర్గంలో తరచూ కవిత పర్యటనల వెనుక రీజన్ ఇదే అయి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే కవిత అసెంబ్లీ బరిలో నిలుస్తుందన్న ప్రచారంతో ఆమె కోసం తమ టికెట్ ను త్యాగం చేయబోయేది ఎవరూ అనేదానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కవిత ఎక్కడ పోటీ చేసినా ఆమె కోసం అసెంబ్లీ స్థానాన్ని వెకెట్ చేయబోయే వారిని లోక్ సభ పంపడం లేదా రాజ్యసభ, ఎమ్మెల్సీ హామీ ఇస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

అసెంబ్లీ ఆలోచన వెనకు వ్యూహం ఇదే?:

గతంలో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసిన కవిత ఈ సారి శాసనసభ వైపు ఆలోచనలు సాగించడం వెనుక భారీ వ్యూహం ఉన్నట్టు తెలుస్తోంది. నిజానికి పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ అంశాలే ప్రధాన ఎజెండాగా మారుతాయి. అందువల్ల అక్కడ బీజేపీకి ఫేవర్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. గతంలో పసుపు రైతుల ఎఫెక్ట్ తో పాటు జాతీయ అంశాలే ఆమె ఓటమికి కారణం అనే వాదనలు ఉన్నాయి. ఈ సారి కవితను బీజేపీ కచ్చితంగా టార్గెట్ చేయబోతుందనేది ఎంపీ అర్వింద్ మాటలను బట్టి అర్థం అవుతోంది. అదే అసెంబ్లీకి వచ్చే సరికి కేసీఆర్ ముందస్తుకు ఛాన్స్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పైగా అసెంబ్లీకి పోటీ చేస్తే రాష్ట్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తనకు కలిసి రావొచ్చనే అభిప్రాయంతోనైనా కవిత పార్లమెంట్ నుంచి అసెంబ్లీ దిశగా ఆలోచనలో ఉండి ఉంటారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. మరి జరుగుతున్న ప్రచారం ప్రకారం కవిత నిజంగానే అసెంబ్లీ బరిలోకి దిగబోతున్నారా లేక అర్వింద్ కు ఛాలెంజ్ చేసిన విధంగా ఆయనపై పోటీ చేసి ఓడించే ప్రయత్నం చేస్తారా అనేది కాలమే నిర్ణయించనుంది.

ఇవి కూడా చదవండి : CM కేసీఆర్‌కు ఆ నిధులపై చర్చించే దమ్ముందా..? MP బండి సంజయ్ సవాల్

Advertisement

Next Story