Kavitha: ఏకంగా ఆ పోస్టుపైనే గురిపెట్టిన కవిత! బీఆర్ఎస్ లో హాట్ టాపిక్ గా కవిత స్ట్రాటజీ

by Prasad Jukanti |
Kavitha: ఏకంగా ఆ పోస్టుపైనే గురిపెట్టిన కవిత! బీఆర్ఎస్ లో హాట్ టాపిక్ గా కవిత స్ట్రాటజీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత (Kavitha) అంశం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలు నుంచి విడుదలయ్యాక కొంత కాలం పాటు సైలెంట్ మోడ్ లోకి వెళ్లిన కవిత గత కొన్ని రోజులుగా జగిత్యాల (Jagityala) అసెంబ్లీ సెగ్మెంట్ పై ఫోకస్ పెట్టారు. దీంతో కవిత దృష్టి అసెంబ్లీపై పడిందనే టాక్ గుప్పుమంటోంది. దీంతో కవిత ఆలోచనల వెనుక పార్టీ ప్లాన్ ఉందా లేక ఆమె తన పొలిటికల్ ఫ్యూచర్ స్ట్రాటజీ ఉపయోగిస్తున్నారా అనేది ఆసక్తిని రేపుతున్నది. ఇప్పటికే కేసీఆర్ ఫ్యామిలీలో ఆధిపత్యపోరు నడుస్తోందనే గుసగుసలు వినిపిస్తున్న వేళ ఇన్నాళ్లు లోక్ సభ, శాసన మండలికే ప్రాతినిధ్యం వహించిన కవిత ఇక శాసనసభపై గురిపెట్టడం వెనుక మతలబు ఏంటనేది ఉత్కంఠను రేపుతున్నది.

సీఎం కుర్చీపైనే గురి!:

రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఆలోచనలో ఉన్న కవిత ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాలపై పట్టు సాధించే దిశగా పావులు కదుపుతున్నారనే చర్చ జరుగుతున్నది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ (BRS) నుంచి గెలిచి కాంగ్రెస్ (Congress) లో చేరిన డాక్టర్ సంజయ్ విషయంలో ఉపఎన్నిక (By Election) వస్తే అక్కడి నుంచి కవిత బరిలోకి దిగబోతున్నారనే టాక్ వినిపిస్తున్నది. నిజానికి 2023లో అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ ఆమె పోటీకి దూరంగా ఉన్నారు. ఆపై జరిగిన పార్లమెంట్ ఎన్నికల సమయంలో అరెస్టు కావడంతో ఆమె పోటీ చేయలేదు. మారిన రాజకీయ సమీకరణాలతో ఆమె తన వ్యూహం మార్చుకున్నారని రాబోయే రోజుల్లో స్టేట్ పాలిటిక్స్ లో చక్రం తిప్పడంతో పాటు ఏకంగా ముఖ్యమంత్రి కుర్చీపైనే టార్గెట్ పెట్టారనే ప్రచారం జరుగుతున్నది. ఈ వ్యూహంలో భాగంగానే కవిత తనకంటూ ఓ అసెంబ్లీ సెగ్మెంట్ ను సిద్ధం చేసుకుంటున్నారని అందులో భాగంగా జగిత్యాలపై నజర్ వేశారనే చర్చ జరుగుతోంది. అక్కడ ఉప ఎన్నిక లేదా సాధారణ ఎన్నికల్లోనైనా పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే కవిత అసెంబ్లీకి పోటీ ఆలోచన వెనుక పార్టీ నిర్ణయం ఉందా లేక ఆమె తన సొంత ఎజెండాతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నదా అనేది తెలియాల్సి ఉంది.

బీఆర్ఎస్ కు భిన్నంగా కవిత:

ఇటీవల జరుగుతున్న పరిణామాలు బీఆర్ఎస్ లో కవిత విషయంలో భిన్నాభిప్రాయాలకు తావిస్తోంది. కవిత బీసీల నినాదంతో ముందుకు వెళ్తున్నారు. బీసీ కులగణన చర్చ విషయంలో శాసనమండలిలో పార్టీ సభ్యులు బాయ్ కాట్ చేసి వెళ్లినా కవిత ఒక్కరే సభలో చర్చకు హాజరయ్యారు. కులగణన సర్వే (Cast Census)కు కేసీఆర్ కుటుంబం దూరంగా ఉంటే కవిత మాత్రం సర్వేలో పాల్గొన్నారు. ఇదే సమయంలో గతంలో కంటే ఇటీవల తన అనుచరులకు మరింత అందుబాటులోకి వస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. దీంతో కవిత నిర్ణయాలు బీఆర్ఎస్ లో ఎలాంటి పరిణామాలకు దారి తీయబోతున్నదనే చర్చ గుప్పుమంటోంది.

Next Story

Most Viewed