కౌశిక్ రెడ్డికి పార్టీ నియోజకవర్గ బాధ్యతలు.. గెల్లుకు చెక్!

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-19 05:10:27.0  )
కౌశిక్ రెడ్డికి పార్టీ నియోజకవర్గ బాధ్యతలు.. గెల్లుకు చెక్!
X

దిశ, తెలంగాణ బ్యూరో : గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టాలనుకున్న ఆశలు నిరాశలైనట్లేనా?. ఆయనకు పార్టీ అధిష్టానం కార్పోరేషన్ చైర్మన్ పదవితోనే పుల్ స్టాప్ పెట్టనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. హుజురాబాద్‌లో ఎలాగైనా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించాలని లక్ష్యంతో అధిష్టానం పావులు కదుపుతున్నట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. ఈటలను ఢీకొనాలంటే.. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కరెక్ట్ అనే భావనకు వచ్చి ఆ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించినట్లు స్పష్టమవుతుంది.

మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అయితే ఆ ఎన్నికలను బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను అభ్యర్థిగా బరిలో నిలిపింది. అయితే కీలక వ్యూహాలు రచించినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ కాలేకపోయింది.

ఈటెల రాజేందర్ 30 వేల ఓట్లకు పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు. దీంతో ఎలాగైనా ఆ సీటును దక్కించుకోవాలని పట్టుదలతో బీఆర్ఎస్ అధిష్టానం పావులు కదుపుతుంది. అందులో భాగంగానే కరీంనగర్ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ పదవులతో పాటు నామినేటెడ్ పదవులను సైతం ఆ జిల్లా నేతలకు అప్పగించింది. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం ముమ్మరం చేసింది.

రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు మరో ఐదు నెలలు గడువు ఉండడంతో ఆ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎలాగైనా ఎగరేయాలని పక్క ప్రణాళికలతో ముందుకు సాగుతుంది. అందులో భాగంగానే పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవితో పాటు ప్రభుత్వ విప్ బాధ్యతలను అప్పగించింది. అంతటితో ఆగకుండా ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన శ్రీనివాస్ యాదవ్‌కు టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు అప్పగించింది.

అయితే ఈ నామినేటెడ్ పదవితో గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను ఎమ్మెల్యే టికెట్ రేసు నుంచి తప్పించినట్లు అయిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పాడి కౌశిక్ రెడ్డికి మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని గెలిపించుకోవాలని నియోజకవర్గంలో జరిగిన మీటింగ్‌లో హామీ ఇచ్చారు. గెలిపించుకుంటే మరింత అభివృద్ధి చేస్తామని సభా వేదికపైనే ప్రకటించారు.

అందులో భాగంగానే తాజాగా కౌశిక్ రెడ్డికి పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు అప్పగించినట్లు స్పష్టం అవుతుంది. ఏది ఏమైనా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గ టికెట్ కౌశిక్ రెడ్డికే అని పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అయింది. అయితే పార్టీ ఏ లక్ష్యంతో ముందుకు సాగుతుందో.. ఆ లక్ష్యం నెరవేరుతుందో లేదో.. ఈటెలను ఢీకొనడంలో కౌశిక్ రెడ్డి సక్సెస్ అవుతారో లేదో వేచి చూడాల్సిందే.

Read more:

కౌశిక్ రెడ్డికి ఆ బాధ్యతలు.. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం

Advertisement

Next Story