Kaushik Reddy: ‘నన్ను డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది’

by karthikeya |   ( Updated:2024-10-30 07:17:28.0  )
Kaushik Reddy: ‘నన్ను డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది’
X

దిశ, వెబ్‌డెస్క్: తనని డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు కాంగ్రెస్ (Congress) ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. తన ఫోన్ ట్యాప్ చేసి మరీ కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. కొద్ది రోజులుగా తెలంగాణలో కేటీఆర్ (KTR) బావమరిది రాజ్‌ పాకాల (Raj Pakala) ఫాంహౌస్‌లో జరిగిన రేవ్ పార్టీ వ్యవహారం దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతలు కొంతమంది.. కేటీఆర్ కూడా డ్రగ్స్ తీసుకుంటారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో బీఆర్ఎస్ (BRS) కూడా కౌంటర్ ఎటాక్‌కు దిగింది.

ఈ నేపథ్యంలోనే ఈ రోజు (బుధవారం) తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కౌశిక్ రెడ్డి (Kaushik Reddy).. ఈ మధ్య తనని కూడా ఇలాగే డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు ప్రయత్నించారంటూ ఆరోపించారు. తన ఫ్రెండ్ సర్‌ప్రైజ్ బర్త్‌డే పార్టీకి వెళ్తుంటే పోలీసులు తన ఫోన్‌ను ట్యాప్ చేసి విషయం తెలుసుకున్న పోలీసులు.. దాదాపు 100 సిబ్బందితో పాటు ఇద్దరు ఏసీపీలు, ఐదుగురు సీఐలు పార్టీ జరుగుతున్న ప్లేస్‌కు వచ్చి తనని, అక్కడున్న వారందరినీ సోదాలు చేశారన్నారు. తామంతా వ్యతిరేకించేసరికి ఏమీ దొరకలేదని వెళ్లిపోయారని చెప్పారు.

తనని డ్రగ్స్ (Drugs) కేసులో ఇరికించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతలా ప్రయత్నిస్తుందే ఈ సంఘటనతో తెలుస్తోందని, ఒకవేళ తన మాటలు అబద్ధమైతే ఇంటల్లిజెన్స్ ఐజీ ప్రెస్‌మీట్ పెట్టి ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

ఇప్పుడు తమ పార్టీ ఎమ్మెల్యేలంతా బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా ఉంటే చెప్పాలని సవాల్ విసిరారు. ఏ ఆస్పత్రికైనా అందరం కలిసి వెళ్దామని, అక్కడే టెస్ట్‌లు చేయించుకుందామని ఛాలెంజ్ చేశారు. రాజకీయ కక్షతో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇలాంటి కుట్రలు చేస్తే సహించేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు.

Advertisement

Next Story