తెలంగాణపై కర్ణాటక ఎఫెక్ట్.. కేసీఆర్ తదుపరి వ్యూహమేంటి?

by GSrikanth |   ( Updated:2023-09-01 16:01:32.0  )
తెలంగాణపై కర్ణాటక ఎఫెక్ట్.. కేసీఆర్ తదుపరి వ్యూహమేంటి?
X

దిశ, తెలంగాణ బ్యూరో: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ గ్రాండ్ విక్టరీ సాధించడంతో.. నేషనల్ పాలిటిక్స్‌లో గులాబీ బాస్ ఎలా ముందుకెళ్తారనేది ఉత్కంఠ రేపుతున్నది. ఇప్పటికే యాంటీ బీజేపీ, యాంటీ కాంగ్రెస్ స్టాండ్ తీసుకున్న ఆయన మున్ముందు దానినే కొనసాగిస్తూ మరింత దూకుడుగా వ్యవహరిస్తారా? లేక మరేదైనా వ్యూహాన్ని అమలు చేస్తారా? అనేది సస్పెన్స్‌గా మారింది. కర్ణాటక రిజల్ట్ తెలంగాణలో కాంగ్రెస్‌కు ఏ మేరకు బూస్టింగ్ ఇస్తుంది? దానిని అడ్డుకునేందుకు ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు చర్చ జరుగుతున్నది. కర్ణాటక రిజల్ట్ తర్వాత సీఎం కేసీఆర్ జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో తన వ్యూహాన్ని మార్చే చాన్స్ ఉందని టాక్ వినిపిస్తున్నది. ఆ మార్పు త్వరలో ఆయన నిర్వహించే సభలు, సమావేశాల్లో వెల్లడవుతుందని టాక్. కర్ణాటక ఫలితాలపై ముందు నుంచీ గులాబీ లీడర్లు ఉత్కంఠగా ఎదురుచూశారు. అక్కడ బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో పవర్‌లోకి రావొద్దని, వీలైతే హంగ్ రావాలని ఆకాక్షించారు. బీజేపీ విజయం సాధిస్తే ఇక తెలంగాణపై ఆ పార్టీ నేతలు ఫోకస్ పెడుతారని ఆందోళనకు గురయ్యారు. కానీ కర్నాటకలో కాంగ్రెస్ పవర్‌లోకి రావడంతో బీజేపీ వ్యతిరేకంగా మంత్రులందరు ప్రకటనలు విడుదల చేశారు.

జేడీఎస్‌తో ఫ్రెండ్‌షిప్ కటీఫ్?

బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే పలు కార్యక్రమాలకు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. దీంతో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు జేడీఎస్‌కు కేసీఆర్ పూర్తి స్థాయి సపోర్టు ఇస్తారని ప్రచారం జరిగింది. ఏమైందో తెలియదు గానీ ఎన్నికల టైమ్‌లో బీఆర్ఎస్ లీడర్లు అటువైపే చూడలేదు. జేడీఎస్‌తో స్నేహం చేడిందా? లేక అంతర్గతంగా సపోర్టు చేస్తూ, బహిర్గతంగా మౌనంగా ఉన్నారా? అనే చర్చలు జరిగాయి. ఎన్నికల ఫలితాల తర్వాత జేడీఎస్‌తో కేసీఆర్ తన స్టాండ్‌ను వ్యక్తం చేసే చాన్స్ ఉందన్న ప్రచారం జరుగుతుంది. కానీ అది స్నేహమా? లేక దూరమా? అనేది వచ్చే రోజుల్లో తెలుస్తుంది.

కాంగ్రెస్, బీజేపీ యాంటీ స్టాండ్ కంటిన్యూ చేస్తారా?

సుమారు రెండు నెలల క్రితం బీజేపీని ఎదుర్కునేందుకు దేశంలో ఉన్న పలు రాజకీయ పార్టీలు సమావేశమయ్యాయి. ఆ మీటింగ్‌కు కాంగ్రెస్ నేతలూ హాజరయ్యారు. కానీ బీజేపీని వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్ మాత్రం ఆ మీటింగ్ దూరంగా ఉన్నది. ఇప్పుడు కర్ణాటక రిజల్ట్ తర్వాత దేశ వ్యాప్తంగా ఉన్న బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకమై, కాంగ్రెస్‌తో కలిసి పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లే చాన్స్ ఉన్నది. అలాంటి సమయంలో కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి నెలకొంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లి, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటారా? లేక కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు దూరంగా ఉంటూ సొంత ఎజెండాతోనే ముందుకు వెళ్తారా? అనే చర్చ జరుగుతున్నది.

తెలంగాణపై కర్ణాటక ఎఫెక్ట్

కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణ పాలిటిక్స్‌ పై పడనుంది. ఇప్పటికే అక్కడి ఫలితాలతో టీ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం మొదలైంది. కష్టపడితే ఇక్కడ కూడా అధికారంలోకి రావడం ఈజీ అనే భావన వారిలో నెలకొంది. ప్రధానంగా ఉమ్మడి మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి‌తో పాటు ఖమ్మం జిల్లాల్లోని అన్ని సెగ్మెంట్లలో కర్ణాటక ఫలితాల ప్రభావం ఉంటుందని బీఆర్ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు. ఆ జిల్లాల్లో కాంగ్రెస్‌ను ఎలా ఎదుర్కోవాలి? అక్కడ బీఆర్ఎస్ గ్రాఫ్‌ను మరింతగా పెంచేందుకు ఏం చేయాలి? కాంగ్రెస్ కేడర్‌ను ఢీ కొట్టేందుకు ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి? అనే విషయాలపై ప్రగతిభవన్ వర్గాలు అరా తీస్తున్నట్టు సమాచారం.

Read more:

స్పీడ్ పెంచనున్న కాంగ్రెస్.. తెలంగాణలో ఆ మంత్రం పనిచేస్తుందా?

Advertisement

Next Story