- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిలిచేది మేమే.. గెలిచేది మేమే..!
- కాంగ్రెస్ నేతల్లో జోష్ నింపిన కర్ణాటక ఫలితాలు
- తెలంగాణలో అధికారంలోకి వచ్చేది తామేనంటూ విశ్వాసం
- ఓరుగల్లును మళ్లీ కాంగ్రెస్ కంచుకోటగా మారుస్తామంటూ వెల్లడి
- దిశతో నేతల మనోగతం.. తెలంగాణలో వేవ్ మొదలైందన్న సీతక్క!
- ఓరుగల్లులో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం: నాయిని రాజేందర్ రెడ్డి
దిశ, వరంగల్ బ్యూరో: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి మంచి బూస్ట్ ఇచ్చాయి. కర్ణాటక ఎన్నికల్లో అఖండ విజయం సాధించడంతో శ్రేణుల్లో ఆనందం తొణికిసలాడుతోంది. కర్ణాటక పీపుల్స్ పల్స్‌కు తెలంగాణ ప్రజానాడికి చాలా సామీప్యత ఉంటుందని కూడా సీనియర్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఓరుగల్లుకు పూర్వ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సమీప భవిష్యత్‌లో జరగబోయే తెలంగాణ ఎన్నికల సమరంలో బీఆర్ ఎస్ పార్టీని మట్టి కరిపించి మెజార్టీ సీట్లను సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక ఎన్నికల విజయంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. జిల్లా, మండల పార్టీల కార్యాలయాల వద్ద బాణా సంచా కాల్చుతూ నృత్యాలు చేశారు. ఈసందర్భంగా స్వీట్లు పంచుకున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు... తెలంగాణపై ప్రభావం, కాంగ్రెస్ పార్టీకి అనుకూలతలు అనే అంశంపై దిశకు వారి మనోగతాన్ని వెల్లడించారు.
తెలంగాణలో కాంగ్రెస్ వేవ్ మొదలైంది: ములుగు ఎమ్మెల్యే సీతక్క
భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ ప్రజల్లోకి వెళ్లాక పార్టీలో బలోపేతం స్పష్టంగా కనిపించింది. ఆయన యాత్ర మొదలయ్యాక హిమాచల్ ప్రదేశ్‌లో అధికారంలోకి రావడం జరిగింది. అలాగే ఇప్పుడు కర్ణాటకలో అతిపెద్ద విజయం ఇది. ఈ రెండు రాష్ట్రాల్లోనే కాక ఆయా రాష్ట్రాల్లో జరిగిన స్థానిక, అక్కడక్కడ జరిగిన బై ఎలక్షల్లోనూ కాంగ్రెస్‌కు అనుకూల ఫలితాలు వచ్చాయి. రాహుల్ గాంధీపై శ్రేణులకు విశ్వాసం, ప్రేమ కలిగాయి. కర్ణాటకలో 21 రోజుల పాటు సాగిన రాహుల్ పాదయాత్ర చాలా ప్రభావం చూపిందని అనుకుంటున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ విజయంలో టీం వర్క్ కనిపిస్తోంది. నేను కూడా కొద్దిరోజులు పనిచేశాను. కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణలో ఖచ్చితంగా ప్రభావం చూపుతాయి. పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై, నియంతృత్వ విధానాలపై ప్రజలు అంసతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ వైపు ప్రజలు చూస్తున్నారు. రాహుల్, ప్రియాంక సభలు పార్టీ బలోపేతానికి దోహదం చేస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకు రాగలమన్న విశ్వాసం నేతల్లో కనిపిస్తోంది. ఇప్పటికే శ్రేణుల్లో ఆ జోష్ వచ్చింది.
ఓరుగల్లులో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం వస్తుంది
-నాయిని రాజేందర్ రెడ్డి, హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు
కాంగ్రెస్ పార్టీ పురోగమనానికి కర్ణాటక ఎన్నికల ఫలితాలు శుభ సూచికలాంటివి. రాబోయే తెలంగాణ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అప్రతిహితమైన విజయాన్ని నమోదు చేస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయి. గడాఫీకి పట్టిన గతి కేసీఆర్‌కు, ఆయన కుటుంబానికి తప్పకుండా దాపురిస్తుంది. 40శాతం కమీషన్ తీసుకున్న కర్ణాటక బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. ఇక్కడ అంతకు మించిన పర్సంటేజీలు తీసుకుంటున్న ప్రజాప్రతినిధులకు కూడా చెప్పపెట్టులాంటి తీర్పు ఇవ్వబోతున్నారనడంలో సందేహం లేదు. అవినీతి, అక్రమాలు, మతతత్వ రాజకీయాలను ప్రజలు ఈసడించుకుంటున్నారు. ఓరుగల్లులో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం రాబోతోంది.
ప్రజలు కాంగ్రెస్‌ను కోరుకుంటున్నారు
- జనగామ మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి, టీపీసీసీ నాయకుడు
కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం ఖచ్చితంగా తెలంగాణపై ఉంటుంది. అవినీతి, అహంకార ధోరణి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. తెలంగాణలో కూడా అదే తరహా పాలన ఉంది. ఖచ్చితంగా ఇక్కడ కూడా ప్రజలు బ్యాలెట్‌తో కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ది చెబుతారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గతమైన నిర్ణయాలు సక్రమంగా తీసుకుంటే అధికారంలోకి రావడం ఖాయం.
కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో అచంచల విశ్వాసం
- నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత దొంతి మాధవరెడ్డి
తెలంగాణలోనూ కర్ణాటక ఫలితాలు రిపీట్ అవుతాయి. కాంగ్రెస్ పార్టీ మూలాలు చాలా బలంగా ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ సేవలను, అభివృద్ధి, సంక్షేమ పాలనను కర్ణాటక ప్రజలు గుర్తు చేసుకుని పార్టీ అండగా నిలిచారు. తెలంగాణలో సాగుతున్న అరాచక, నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా, ఈ దేశాన్ని ఖచ్చితమైన అభివృద్ధి దిశగా మళ్లించిన కాంగ్రెస్ వైపు, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ వైపు తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం.
బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే
- ఇనుగాల వెంకట్రామిరెడ్డి, టీపీసీసీ నాయకుడు
కర్ణాటక ప్రజలు చరిత్రాత్మకమైన తీర్పునిచ్చారు. త్వరలోనే తెలంగాణలో కూడా ఇదే రకమైన నమోదవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎజెండాను నిరుద్యోగులు, రైతులు, ఉద్యోగులు గమనిస్తున్నారు. స్డూడెంట్ డిక్లరేషన్ తర్వాత నిరుద్యోగులు,యువత పార్టీపై విశ్వాసం చూపుతున్నారు. కేసీఆర్ కుటుంబ పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ల మధ్య అవగాహన రాజకీయం జరుగుతోంది. వ్యూహాత్మకంగానే బీజేపీయే ప్రత్యామ్నాయమంటూ ప్రచారం చేసుకున్నా.. చెక్కు చెదరని కాంగ్రెస్ పునాదులు పార్టీ బలాన్ని ఎన్నికల ఫలితాల్లో చూపెట్టబోతున్నాయి. కాంగ్రెస్సే తెలంగాణ ప్రజలకు ప్రత్యామ్నాయం. ఇందులో ఎలాంటి సందేహానికి తావు లేదు.
బీఆర్‌ఎస్ నియంతృత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారు
-నెహ్రూనాయక్, డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ నేత
కర్ణాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఆనందపరిచాయి. అవినీతి ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తూ కర్ణాటక ప్రజలు తీర్పు ఇచ్చారు. తెలంగాణలో నిరుద్యోగులను, రైతులను, పేద, మధ్య తరగతి ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నా కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు నిలవబోతున్నారు.