క్రీడలు సరే.. క్రీడా ప్రాంగణాల పరిస్థితేంటి?

by samatah |
క్రీడలు సరే.. క్రీడా ప్రాంగణాల పరిస్థితేంటి?
X

ప్రభుత్వం ఏంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు అలంకార ప్రాయంగా మారాయి. గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు క్రీడల పట్ల ఆసక్తి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎంతో ఖర్చుతో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసింది. పేరుకు ప్రాంగణాలను ఏర్పాటు చేసినప్పటికీ ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించలేదు. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. అయితే వాటిని కొన్నిచోట్ల ఊరికి దూరంగా, మరికొన్ని చోట్ల శ్మశాన వాటికల పక్కనే ఏర్పాటు చేశారు. ఇంకా కొన్ని గ్రామాల్లో చెట్లు, గుట్టల మధ్య ఏర్పాటు చేశారు. క్రీడా ప్రాంగణాల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో గ్రామీణ యువతకు ఆటలపై అసక్తి కలుగక పోగా, కనీసం అటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. అయితే ఈ నెల 15నుంచి సీఎం కప్ క్రీడలు నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తుండడంతో క్రీడా ప్రాంగణా ప్రాముఖ్యత సంతరించుకుంది. కాగా, ఏ గ్రామంలోని క్రీడా ప్రాంగణంలో కూడా కనీస సౌకర్యాలు, వసతులు కనిపించడం లేదు. ఈ క్రమంలో సీఎం కప్​ క్రీడలు నిర్వహించడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దిశ, కరీంనగర్​ బ్యూరో : రాష్ర్ట ప్రభుత్వం గ్రామాల్లో గతేడాది ఏర్పాటు చేసిన క్రీడా మైదానాలు అలంకార ప్రాయంగా మారాయి. ఉపాధిహమీ పథకం నిధులతో రాష్ర్ట ప్రభుత్వం ప్రతి పంచాయతీ పరిధిలో క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 20గుంటల స్థలంలో కబడ్డీ, ఖోఖో, షెటిల్​ కోర్టు, వాలీబాల్​ కోర్టు వంటివి ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లోని యువతీ, యువకులకు ఆటలు నేర్చుకునే ఉద్దేశంతో క్రీడా మైదానాలు ఏర్పాటు చేశారు. క్రీడా ప్రాంగణాల బోర్డు కోసం రూ.30వేలు ఖర్చు చేశారు. మొరం కోసం రూ.50వేలు, చుట్టూ ఫెన్సింగ్​ వంటి మొత్తం పనుల కోసం సుమారు రూ.5లక్షలకు వరకు ఖర్చు చేయాలని నిర్ణయించి పనులు పూర్తి చేసే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తీసుకొచ్చింది. హడావిడిగా ఏర్పాటు చేసిన క్రీడా మైదానాల నిర్వహణను ఎవ్వరు పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం గ్రామాల్లో ఏర్పాటు చేసిన క్రీడా మైదానాలు అలంకార ప్రాయంగా మారాయి. అంతేకాక క్రీడ మైదానాలు ఊరికి దూరంగా, శ్మశాసన వాటికల పక్కన, పొలాల మధ్య ఏర్పాటు చేశారు. పలు చోట్ల బురదమయంగా ఉండడం వల్ల లక్షలు ఖర్చు చేసిన మైదానాలు ఎందుకు పనికిరాకుండా పోయాయి. పనులు నిర్వహించిన సర్పంచ్​లకు బిల్లులు రాక, ఏర్పాటు చేసినవి ప్రజలకు ఉపయోగపడకపోవడంతో క్రీడా మైదానాలు ఎందుకు ఏర్పాటు చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈనెల 15నుంచి సీఎం కప్​..

గ్రామీణ క్రీడాకారులను ప్రోత్రహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నెల 15నుంచి సీఎం కప్​ పోటీలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మే 15నుంచి మే 17వరకు మండలస్థాయి, మే 22నుంచి 24వరకు జిల్లాస్థాయి పోటీలు నిర్వహించాలని నిర్ణయించగా మే 28నుంచి 31వరకు రాష్ర్టస్థాయి క్రీడా పోటీలు నిర్వహించాలని నిర్ణయించారు. 15ఏళ్ల వయస్సు నుంచి 36ఏళ్ల వయస్సు ఉన్న యువకులు క్రీడల్లో పాల్గొనవచ్చునని ప్రకటించారు. మండల స్థాయిలో అథ్లెటిక్స్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, ఫుట్ బాల్, స్విమింగ్​, బ్యాడ్మింటన్​, బాస్కెట్​ బాల్​, బాక్సింగ్​, వెయిట్​ లిఫ్టింగ్​, హ్యాండ్​ బాల్​, అథ్లెటిక్స్​ వంటి పోటీలు మండలస్థాయిలో నిర్వహించి వారిని జిల్లాస్థాయికి, జిల్లాస్థాయి నుంచి రాష్ర్టస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు.

క్రీడల్లో రాణించేది ఏట్లా..?

రాష్ర్ట ప్రభుత్వం నిర్వహించే సీఎం కప్​ పోటీల్లో గ్రామీణ క్రీడాకారులు రాణించాలంటే గ్రామాల్లో ఉన్న క్రీడా ప్రాంగణాల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో శిక్షణ ఇవ్వడానికి కోచ్​లు లేక గ్రామీణ యువత రాష్ర్టస్థాయి వరకు ఏలా రాణిస్తారనేది ప్రశ్నగా మారింది. గ్రామాల్లో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాల్లో కనీస సౌకర్యాలు లేకుండా సీఎం కప్​ క్రీడాల్లో గ్రామీణ క్రీడాకారులు రాణించేది ఏట్లా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని గ్రామీణ క్రీడా ప్రాంగాణాల్లో కనీస వసతులు కల్పించి యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకునే విధంగా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Next Story