కరీంనగర్ ను అద్భుత నగరంగా తీర్చిదిద్దుతాం: మంత్రి గంగుల కమలాకర్

by Shiva |
కరీంనగర్ ను అద్భుత నగరంగా తీర్చిదిద్దుతాం: మంత్రి గంగుల కమలాకర్
X

దిశ, కరీంనగర్ టౌన్: రానున్న రోజుల్లో కరీంనగర్ పట్టణాన్ని అద్భుత నగరంగా తీర్చదిద్దుతామని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం నగర పాలక సంస్థ 14, 59వ డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు మేయర్ సునీల్ రావుతో కలసి మంత్రి గంగుల భూమి పూజ చేశారు. 59 వ డివిజన్ లో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు పనులకు, వెంకటేశ్వర ఆలయ తోరణం నిర్మాణ పనులకు, 14 వ డివిజన్ లో రూ.19 లక్షలతో సీసీ రోడ్డు, రూ.10 లక్షలతో రెడ్డి సంఘభవన నిర్మాణానికి భూమి పూజ చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు కరీంనగర్ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందన్నారు. ప్రజల సహకారంతో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత పట్టణంలో శరవేగంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని అన్నారు. ముఖ్యంగా సీఎం సహకారంతో రహదారులను తీర్చిదిద్దామని అన్నారు. ఐదేళ్ల కాలంలో కరీంనగర్ రూపురేఖలు మరిపోయాయని అన్నారు. ఇప్పటికే కేబుల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయిందని, మానేరు రివర్ ఫ్రంట్ పూర్తి అయితే కరీంనగర్ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందన్నారు.

వచ్చే నెలలో టీటీడీ సహకారంతో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులను ప్రారంభిస్తామని తెలిపారు. అనంతరం 14 డివిజన్లో సప్తగిరి కాలనీలో రెడ్డి సంఘ భవన నిర్మణానికి భూమి పూజలో పాల్గొన్నారు. రెడ్డి సంక్షేమానికి ఇప్పటికే రూ.10 లక్షలు కేటాయించామని అవసరమైతే మరిన్ని నిధులు కేటాయించి భవన నిర్మాణ పనులు చేపడతామని తెలిపారు. 14 వ డివిజన్ లోని గౌడ సంఘం, కాపు సంఘం, మహిళ సంఘం, రజక సంఘ భవనాలకు ప్రభుత్వ భూమితో పాటు, వాటి నిర్మాణాలకు ఒక్కో భవనానికి రూ.10 లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దిండిగాల మహేష్, గందే మాధవి-మహేష్ , బోనాల శ్రీకాంత్, రాజేందర్ రావు, ఐలేందర్ యాదవ్, రెడ్డి సంక్షేమ సంఘం శ్రీనగర్, సప్తగిరి కాలని అధ్యక్షుడు చెన్నాడి రాజేశ్వర్ రెడ్డి, ఎడబోయిన శ్రీనివాసరెడ్డి, గడ్డం జగత్పాల్ రెడ్డి, గడ్డం ప్రశాంత్ రెడ్డి, కోట భాస్కర్ రెడ్డి, మొగుసాల వెంకటేశ్వరరెడ్డి, ముసుకుల రామకృష్ణారెడ్డి, పోరెడ్డి శ్రీహరి రెడ్డి, చొల్లేటి పాపిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed