Nandi Pump House : నంది మేడారం నంది పంప్ హౌస్ నుంచి నీటి విడుదల..

by Sumithra |
Nandi Pump House : నంది మేడారం నంది పంప్ హౌస్ నుంచి నీటి విడుదల..
X

దిశ, ధర్మారం : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉత్తర తెలంగాణలోని పలు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గోదారమ్మ ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తుంది. ఎగువన ఉన్న నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తుండటంతో, ప్రాజెక్టు 14 నెంబర్ గేటును ఐదు ఫీట్ల ఎత్తుకు ఎత్తి, దిగువకు 7126 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చి దిగువకు ప్రవహిస్తూ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టులోని వరద నీరు వచ్చి చేరుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లోకి సాయంత్రం వరకు 12 వేల క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చి చేరి, ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంది.

ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, సాయంత్రం వరకు 17.3969 టీఎంసీలకు చేరింది. మరింత వరద నీరు వచ్చే అవకాశం ఉండటంతో, అక్కడి అధికారులు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని నంది పంప్ హౌజ్ కు సొరంగ మార్గాల ద్వారా నీటిని తరలిస్తున్నారు. నంది పంప్ హౌజ్ లోని 4, 5, 6, 7 బాహుబలి మోటార్ల ద్వారా 12.600 క్యూసెక్కుల నీటిని నంది రిజర్వాయర్ లోకి ఎత్తిపోస్తున్నారు. దీంతో నంది రిజర్వాయర్ లోకి భారీగా నీరు వచ్చి చేరి, జల శోభను సంతరించుకుంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరుకు పంపుల ద్వారా నీటి తరలింపు ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు చెప్తున్నారు. ఓ వైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, మరోవైపు ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో గోదారమ్మ పరవళ్లు తొక్కుతూ దిగువకు ప్రవహిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed