డాక్టర్లు లేరు.. పేషెంట్ల అరిగోసలు..

by Nagam Mallesh |
డాక్టర్లు లేరు.. పేషెంట్ల అరిగోసలు..
X

దిశ, హుజూరాబాద్ రూరల్: నేను రాను బిడ్డో సర్కార్ దావఖనకు అంటూ... రెండు దశాబ్దాల క్రితం ఓ సీనికవి అన్న పలుకులు ఇక్కడ అక్షర సత్యాలేనని నిరూపిస్తున్నారు హుజురాబాద్ వైద్యులు. స్థానిక ఏరియా ప్రభుత్వ వైద్యశాల సమస్యలకు నిలయంగా మారింది. కోట్లు ఖర్చు చేసి అందమైన భవనాలు కట్టారు గానీ.. అందులో రోగులకు కనీస సౌకర్యాలు కల్పించలేదు. నియోజకవర్గంలోని అతి పెద్ద ఆసుపత్రి ఇది. నియోజకవర్గంతో పాటు ఇతర మండలాల నుండి ఇక్కడికి సుమారు 100 గ్రామాల రోగులు వస్తూ ఉంటారు. రోజుకు 400 నుంచి 500 వరకు ఓపీ ఉంటుంది. ఆసుపత్రిని అన్ని హంగులతో నిర్మించినప్పటికి వాటిని రోగులకు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు.

ఆస్పత్రి దుస్థితి ఇది..

ఇటీవల సాధారణ బదిలీల్లో ఆసుపత్రిలోని వైద్యులు బదిలీ అయ్యారు. అందుకు తగ్గట్టు మళ్లీ రావాల్సిన వైద్యులు రాలేదు. ప్రస్తుతం వైద్యులు సగం మాత్రమే ఉన్నారు. మిగిలిన పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. సిబ్బంది సైతం అరకొరగానే ఉన్నారు. పేషెంట్లు మాత్రం బాగానే వస్తున్నా వాళ్లకు సరిపడా వైద్య సేవలు అందట్లేదు. నిత్యం రద్దీగా ఉండే ఆసుపత్రి అభివృద్ధి కోసం ప్రభుత్వ నిధులతో పాటు నిర్వాహణ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయినప్పటికీ రోగులకు వైద్యం అందించడంలో వైద్యాధికారులు, సిబ్బంది విఫలమవుతున్నారు. వైరల్ ఫీవర్ తో వస్తున్న రోగుల పట్ల ఏఎన్ఎం, స్టాఫ్ నర్సులు కసురుకుంటున్నట్లు బాధితులు వాపోతున్నారు. కనీసం రోగిని అబ్జర్వేషన్ పెట్టి పరీక్షలు నిర్వహించి చికిత్స అందించాల్సిన వైద్యులు,వైద్య సిబ్బంది పట్టించుకున్న పాపాన పోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరంతా మా ప్రాణానికి వస్తున్నారు.. ఇక్కడ ఎవరూ లేరు ఎంజీఎం కి వెళ్ళండి అని కళ్లెర్ర చేస్తున్నట్లు రోగులు వాపోతున్నారు.

గర్భిణుల ప్రాణాలకు విలువలేదు...

వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి అని గర్భిణీలు నమ్మి వస్తే ప్రాణాలు పోయే ప్రమాదం ఉన్నదని పలువురు ఆరోపిస్తున్నారు. కనీసం స్టాఫ్ నర్స్ ,హెడ్ నర్స్, నర్సింగ్ సూపర్డెంట్ కూడా లేబర్ రూమ్ వైపు రావడం లేదు. నెలలు నిండి వస్తే పట్టించుకునే నాధుడే లేడని బాధితులు వాపోతున్నారు.

తమకు బదిలీలు చేస్తే సేవలు బంద్ చేస్తాం..

ఏరియా ఆసుపత్రిలో వైద్యులుగా పనిచేస్తూ స్థానికంగా నర్సింగ్ హోం నడుపుతున్న కొందరు వైద్యులకు ఇటీవల దూరప్రాంతానికి బదిలీ కావడంతో అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు కొందరు డాక్టర్ల బదిలీలు జీర్ణించుకోలేక పోతున్నారు. సదరు వైద్యులు ఏరియా ఆసుపత్రిలో ప్రసవాలు చేయొద్దని ప్రస్తుతం ఉన్న వైద్యులకు సూచించినట్లు ప్రచారం జరుగుతుంది. తమను బదిలీలు చేస్తే సేవలు బంద్ చేసి చూపిస్తాం అని చెప్పకనే చేసి చూపిస్తున్నట్లు అవగతం అవుతుంది. ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకొచ్చేందుకు ప్రస్తుతం ఉన్న వైద్యులు ప్రసవాలపై దృష్టి సారించలేక కేసులను వెళ్ళగొడుతున్నారని ఆరోపణలు లేకపోలేదు. అన్నీ ఉండి అల్లు నోట్లో శని అని చందంగా తయారయింది ఏరియా ఆసుపత్రి పరిస్థితి. వందల సంఖ్యలో ఉద్యోగులను నియామకం చేసిన ప్రసవాల కొరకు వైద్యులను నియామకం చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వానికి ఒక గైనకాలజిస్టు నియామకం చేయడం కష్టమైన పనేం కాదని, కలెక్టర్ కూడా ఇటువైపు తొంగి చూడకపోవడం ఆసుపత్రి నిర్లక్ష్యానికి అడ్డు అదుపు లేకుండా పోతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గైనకాలజిస్ట్ కొరత...

ప్రస్తుతం గైనకాలజిస్ట్ గా ఉన్న డాక్టర్లు నిచ్చల స్వయాన ఓ ప్రముఖ డాక్టర్ సతీమణి కావడం అతనికి పట్టణంలో ప్రైవేట్ నర్సింగ్ ఉండడంతో వైద్యురాలు కేసులను చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నదని బాధితులు ఆరోపిస్తున్నారు. మరో డాక్టర్ నాగ నందిత కాంటాక్ట్ డాక్టర్ అయినప్పటికీ ఆమె ప్రసూతి సెలవులో ఉన్నారు. ఇక డాక్టర్ లావణ్య సస్పెన్షన్ ఎత్తివేయకపోవడంతో ఆమె పోస్టు ఖాళీ చూపడం లేదు. సగం వేతనం పొందుతూ కాలం వెళ్ళదిస్తుందని సమాచారం. ఆమెపై ఉన్న సస్పెన్షన్ ఎత్తేస్తే విధుల్లోకి హాజరైతే ఈ సమస్య తగ్గుముఖం పడుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పట్టించుకునేటోళ్లే లేరు...

నాకు మొన్న శుక్రవారం నెలలు నిండాయి. రెండవ కాన్పు కోసం హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి వస్తే డాక్టర్ అమ్మలు లేరు వెళ్లిపోండి అంటూ వెళ్లగొడుతున్నారు. మా ముందరే ఓ గర్భిణీ తొలిసూరి కాన్పుకు వచ్చింది. పురిటి నొప్పులతో అవస్థపడి ఏడుస్తూ కేకలు వేసినా వైద్య సిబ్బంది వచ్చి చూడలేదు. నాకు ఏడుపొచ్చింది. పేదల పట్ల కరుణ చూపి కలెక్టర్ పట్టించుకోవాలి...

-బత్తుల రమ్య గొల్లగూడెం, సైదాపూర్ మండలం..

Next Story

Most Viewed