- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sardar Sarvai Papanna Goud :సర్వాయి పాపన్న స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం..
దిశ, సైదాపూర్ : చరిత్ర సృష్టించిన ధీరోదాత్తులు ఎందరో చరిత్ర పుటల్లో కనుమరుగయ్యారు. కానీ వారి గురించి చారిత్రక ఆధారాలు సజీవంగానే కనబడుతున్నాయి. అయినా తగిన గుర్తింపునకు నోచుకోలేదు. 16వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్య మలిదశలో మొఘల్ చక్రవర్తుల దురాగతాలను ఎదుర్కోవడానికి బడుగు, బలహీన వర్గాలతో సొంతంగా సైన్యాన్ని సమీకరించి క్రీ.శ. 1675లో కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని సర్వాయీపేటలో అసామాన్యమైన కోటను నిర్మించి గెరిల్లా సైన్యంతో మొఘల్ సామ్రాజ్యంపై దండెత్తి క్రీ.శ.1708లో వరంగల్ కోటను, 1709లో గోల్కొండ కోటను జయించాడు. తెలంగాణ ప్రాంతంలో జమీన్ దారులు, జాగీరుదారులు, పెత్తందారులు భూస్వామ్య ధనిక వర్గాలపై తిరుగుబాటు బావుటను ఎగురవేసిన తొలి విప్లవ వీరుడు షాహిద్ సర్దార్ సర్వాయి పాపన్న.
జీవిత చరిత్ర..
ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ తాలూకాలోని బెల్గాంలో 1650 ఆగస్టు 18న సర్వాయి పాపన్న జన్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. పాపన్న తల్లి సర్వమ్మ అని అతని తండ్రి చిన్నప్పుడే మరణించాడని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. తెలంగాణ ప్రాంతంలో జమీందారులు, జాగీరుదారులు, పెత్తందారుల దురావతాలను భరించలేక సహచరునైనా జక్కుల పెరుమాళ్ళు, దూదేకుల ఫీర్ అహమ్మద్, కొత్వాల్, మీరా సాహెబ్ లు, కుమ్మరి గోవింద్, మంగలి మాసన్న, చాకలి సర్వన్నలను చేరదీసి సామాన్య ప్రజలకు శిక్షణ ఇచ్చి దండును తయారు చేసి స్వరాజ్యస్థాపనే లక్ష్యంగా పోరాటం చేశారు. కుతుబ్ షాహీల తర్వాత మొఘలాయిలు చేస్తున్న దురాగతాలను నిలువరించి దొరల, జమీను దారుల గడీలను కొల్లగొట్టి పేద ప్రజలకు పంచిపెట్టాడు. ఇవి సహించని దొరలు, సర్వాయిపాపన్నను అంతమొందించేందుకు యత్నించగా పాపన్న మకాంను ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రస్తుత జగిత్యాల జిల్లా చల్ గల్ గడికి మార్చాడు.
పాపన్న చరిత్రకు ఆధారాలు
పాపన్న తల్లి సర్వమ్మ పేరు మీద క్రీ.శ.1675లో కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం పెరుకపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సర్వాయిపేట ప్రస్తుత శివరాంపల్లి గ్రామపంచాయతీ నుంచి రాజ్యస్థాపనకు పూనుకొని విస్తీర్ణ కొనసాగించాడు. గడీలను కొల్లగొట్టిన ధనంతో సర్వాయిపేటలో సుమారుగా 12 ఎకరాల విస్తీర్ణంలో కోట నిర్మాణం చేపట్టారు. 30 అడుగుల ఎత్తున ముఖద్వారంతో నాలుగు వైపులా 80 అడుగుల ఎత్తైన బురుజులను ఏర్పాటు చేసి కోటను నిర్మించాడు. కోట నుంచి సమీపంలో సర్వన్న గుట్టలపై సొరంగ మార్గాన్ని ఏర్పాటుచేసి కోటగిరి గట్లు, భూషణ గట్లు, ఇనుప రాతి గుట్టలు, పెద్దగట్లపై కోటలను నిర్మించాడు. కోట చుట్టూ సుమారు కిలోమీటర్ దూరంలో వెయ్యి గజాల విస్తీర్ణంతో కందకాన్ని తవ్వించి శత్రువుల దాడి నుంచి తిప్పి కొట్టడానికి కందకంలోని నీటిలో మొసళ్లను వదిలేవాడని ఈ ప్రాంత ప్రజలు ఇప్పటికీ చరిత్రగా చెప్పుకుంటారు. కోటలో విలువైన సంపద ఉన్నట్లు ఈ ప్రాంతంలోని వృద్ధులు చెబుతున్నారు. ఇప్పటికీ కోటగిరి గట్ల పై పాత ఖిల్లా, కొత్త ఖిల్లా, పాపన్న నిత్యం ఆధరించే ఆరాధ్య దైవమైన బయ్యన్న గుండుపై గల భైరవుని ప్రతిమ, సర్వన్న చెరువు, శివాలయం, హనుమాన్ ఆలయం, ఖిల్లా ఫై పెద్ద పెరడు, కోనేరు, కొత్త ఖిల్లా కమాన్, విశ్రాంతి తీసుకోవడానికి అనువైన గదులు, పచ్చీసుల బండ, ధనంగుండు, ఖిల్లాపై పాపన్న ప్రియురాలు బుచ్చమ్మ గది కూడా ఉంది. గౌడ కులానికి చెందిన పాపన్న ప్రసిద్ధమైన హుస్నాబాద్ ఎల్లమ్మ గుడిని కట్టించాడని ప్రజలు చెప్పుకుంటారు.
సర్వాయి పాపన్న స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం
సర్వాయి పాపన్న స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం ప్రారంభించామని, తెలంగాణ రాష్ట్ర ఏర్పడితే సర్వాయిపేట గుట్టలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని సీఎం కేసీఆర్ 2001లో ఉద్యమ సమయంలో సైదాపూర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చెప్పారు. అంతే కాదు సభకు ఎదురుగా ఉన్న సర్వాయి పాపన్న కొండలను చూపిస్తూ సైదాపూర్ మండల ప్రజలకు హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇన్ని ఏండ్లు గడుస్తున్నా కానీ పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయలేదు.
రేపు పాపన్న జయంతి
సర్వాయిపేట ప్రాంతంలోని పాపన్న గుట్టల శ్రేణుల్లో కొమ్ముగుట్టపై సర్వాయి పాపన్న ప్రతిమను జిల్లా గౌడ కుల సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరించనున్నారు. దీనికి ఆధారం సర్వాయి పాపన్న ఉనికిని తెలిపే చిత్రపటం లండన్ లోని విక్టోరియా మహల్ లోని మ్యూజియంలో నేటికీ భద్రపరిచి ఉంది. రేపు పాపన్న 373వ జయంతి సందర్భంగా చారిత్రక ఆధారాలకు నిలయమైన తెలంగాణ సాయుధ పోరాటానికి తెలంగాణ రాష్ట్ర సాధన తొలి మలి దశ ఉద్యమాలకు ప్రేరణగా నిలిచిన పోరాట యోధుని జీవిత చరిత్రను తరతరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. పాపన్న గుట్టల పై క్వారీల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వద్దని ఈ ప్రాంత ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
- Tags
- Sarvai Papanna