వ్యర్థాలకు నిలయం మారిన గోదావరి తీరం..

by Aamani |   ( Updated:2023-11-12 09:09:41.0  )
వ్యర్థాలకు నిలయం మారిన గోదావరి తీరం..
X

దిశ, మంథని : మంథని గోదావరి తీరం వ్యర్థాలకు నిలయంగా మారింది. పుణ్యస్నానాలకు వచ్చే భక్తులు వినియోగించిన పూజా సామాగ్రి తో పాటు, దేవతామూర్తుల చిత్రపటాలను గోదావరి తీరంలోనే పడేస్తున్నారు. పాత దుస్తులు స్నానాలు చేసే చోట వదిలేయడంతో భక్తులకు అసౌకర్యంగా మారుతుంది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన సంఘటనతో అక్కడి నీరంతా కిందికి వదిలేశారు. అలాగే ఎగువన ఉన్న బ్యారేజీలకు ఎత్తిపోతలు పూర్తిగా నిలిచిపోయాయి . దీంతో అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీటిమట్టం అడుగంటి పోయింది. మంథని వద్ద గోదావరి లో నాలుగేళ్ల క్రితం నాటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదిలా ఉంటే అన్నారం బ్యాక్ వాటర్ అధికంగా ఉన్న సమయంలో మంథని పుష్కర ఘాట్ వద్ద గణపతి, దుర్గాదేవి విగ్రహాలను నిమజ్జనం చేశారు.

ఇప్పుడు నీరంతా తగ్గిపోవడంతో విగ్రహాలన్నీ పుష్కరఘాట్ మెట్ల పక్కనే దర్శనమిస్తున్నాయి. అలాగే దేవుళ్ళ చిత్రపటాలు పడేసి ఉన్నాయి. దీంతో అశుభ్రత నెలకొని ఇబ్బందులు పడుతున్నారు. కనీసం చిత్రపటాలన్నీ ఒకే చోట వేసేలా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. మరోవైపు పుష్కర ఘాట్ ను ఆనుకుని ఉన్న మడుగు వద్ద దుర్వాసన వస్తుంది. అక్కడ స్నానం చేయలేని పరిస్థితి నెలకొంది. అయితే మడుగు దాటి వెళ్లడానికి ఇబ్బంది పడే భక్తులు గత్యంతరం లేక అక్కడే స్నానాలు చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో వ్యర్థాల సమస్య తొలగడం లేదు. ఇప్పటికైనా తగు చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.

Advertisement

Next Story