- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Cyber crime : రెచ్చిపోతున్న ఆన్‌లైన్ దొంగలు.. పరేషానవుతున్న ప్రజలు..
దిశ, కోరుట్ల రూరల్ : ఆన్‌లైన్ దొంగలు రెచ్చిపోతున్నారు.. నెట్టింట చొరబడి నచ్చినంత దోచేస్తున్నారు. రోజూ వేల సంఖ్యలో బాధితులు లక్షల్లో డబ్బులు కోల్పోతున్నారు. ఖతర్నాక్ దొంగల కారణంగా అమాయక ప్రజల ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. అవగాహన కలిగించే ప్రచారాలు ఎన్ని నిర్వహిస్తున్నా ప్రజలు మోసపోతూనే ఉన్నారు. ప్రమాదకర లింకులను క్లిక్ చేస్తూ దొంగల చేతికి తాళం చెవి అప్పగిస్తూ ఆపై లబోదిబోమంటున్నారు. వివరాల్లోకి వెళితే.. పెరుగుతున్న సైబర్ నేరాలు ఇటీవల జిల్లా వ్యాప్తంగా సైబర్ మోసాల సంఖ్య భారీగా పెరిగిపోయింది.
ఆన్‌లైన్ లావాదేవీల క్రమంలో బ్యాంకు వ్యవహారమంతా సెల్ ఫోనుకు చేరిన క్రమంలో ఆ సెల్ ఫోన్ అడ్డంగా పెట్టుకుని సైబర్ దొంగలు దొరికినంత దోచుకుంటున్నారు. లింక్ నొక్కి తలుపు తీసిన మన ఫోన్ లోకి దర్జాగా చొరబడి ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. అధునాతన సాంకేతికత ఉపయోగించి డబ్బులు తిరిగి రాబట్టుకోలేని పరిస్థితులు సృష్టిస్తున్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తి నేరుగా దుకాణానికి వెళ్లి నకిలీ ఫోన్ పే మెసేజ్ ద్వారా 10 వేల రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేసినట్లు చూపి దర్జాగా ఆ నగదు పట్టుకెళ్లిన ఘటనలు ఒక రకం అయితే.. అచ్చం బ్యాంకు నుండి వచ్చినట్లుగా ఉండే నకిలీ కేవైసీ లింకులను పంపి, కావల్సిన సమాచారం రాగానే ఫోన్ తమ ఆధీనంలోకి తీసుకుని ప్రజల జేబులు గుల్ల చేస్తున్నారు.
లక్షల్లో నష్టపోతున్న ప్రజలు..
బుధవారం, గురువారం ఒక్కరోజే పదుల సంఖ్యలో పట్టణ వాసులకు ఈ కేవైసీ లింక్స్ రావడం శోచనీయం. వీరిలో పలువురు వేల మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నారు. వెంటనే సైబర్ శాఖలో ఫిర్యాదు చేశారు. ఇలా ప్రతిరోజూ ఏదో ఒకచోట డబ్బులు నష్టపోతున్న బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. వీరిలో కొందరు ఫిర్యాదు చేస్తే మరి కొంత మంది పరువు పోతుందన్న భయంతో కనీసం ఫిర్యాదు చేయడానికి కూడా ముందుకు రాకపోవడం గమనార్హం. ఈ క్రమంలో లక్షల రూపాయల ప్రజాధనం సైబర్ నేరగాళ్ల ఖాతాలోకి చేరుతున్నది.
పనిచేయని అవగాహన ప్రచారం...
సైబర్ మోసాలను గురించి ప్రభుత్వం, సైబర్, పోలీస్ శాఖలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న ప్రజల్లో దాని ప్రభావం కనిపించడం లేదు. బ్యాంకు నుంచి లింక్ రాగానే, బ్యాంకుకు వెళ్లే పని తప్పుతుందని, ఫోన్ లో వివరాలు ఇస్తే సరిపోతుందని భావిస్తూ ముందూ వెనకా ఆలోచించకుండా లింక్స్ క్లిక్ చేసి అడిగిన వివరాలు ఇస్తూ చేజేతులా కష్టపడి సంపాదించిన సొమ్మును కర్కోటకులైన సైబర్ దొంగల చేతిలో పెడుతున్నారు. ముఖ్యంగా విద్యావంతులు కూడా ఈ జాబితాలో ఉండడం మరింత ఆందోళన కలిగిస్తున్నది.
పరేషాన్ అవుతున్న ప్రజలు..
పెరుగుతున్న సైబర్ నేరాల క్రమంలో ప్రజలు తమ పైసల గురించి పరేషాన్ అవుతున్నారు. ఇంట్లో డబ్బుంటే సురక్షితం కాదని, బ్యాంకులో డబ్బులు వేసి, నిశ్చింతగా ఉన్న ప్రజలు నేడు బ్యాంకులో పైసలకే భద్రత లేకపోవడంతో భయాందోళనలకు గురవుతున్నారు. ఖాతాలో సొమ్ము ఎప్పుడు ఏ రూపంలో నష్టపోతామో తెలియని పరిస్థితిలో భయం భయంగా బతుకు వెళ్లదీస్తున్నారు. మీ పార్సిల్ లో డ్రగ్స్ దొరికాయి, డబ్బులు ఇస్తే కేసు మాఫీ చేస్తామని ఒకడు భయపెడితే, పోలీస్ ఫోటో డీపీగా పెట్టిన వాట్సాప్ నుంచి కాల్ చేసి భయపెట్టి డబ్బులు గుంజేవాడు మరొకడు. బ్యాంక్ నుంచి పంపినట్లుగా నకిలీ కెవైసీ లింక్ పంపి వివరాలు రాబట్టి ఖాతాలు గుల్లజేసే వాడు ఇంకొకడు, ఇలా ప్రజల బలహీనతలు, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ దొంగలు రెచ్చిపోతూనే ఉన్నారు.
టూ స్టెప్ వెరిఫికేషన్ అవసరం..
ఈ క్రమంలో సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి కనీసం పదివేల కంటే ఎక్కువ మొత్తం గల నగదు బదిలీల విషయంలో బ్యాంకులు పకడ్బందీ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. నగదు బదిలీ జరిగే ముందు మరో దఫా ఖాతాదారునికి ఒక కోడ్ పంపడం లేదా వారి సమ్మతి కోరడం వంటి చర్యలు చేపట్టడం ద్వారా కొంత వరకైనా ప్రజలను ఈ మోసాల నుండి, ఆర్థిక నష్టాల నుండి రక్షించవచ్చు. అలాగే గ్రామస్థాయిలో, వార్డు స్థాయిలో ప్రజలకు ఆన్‌లైన్ మోసాల గురించి మరింత అవగాహన కలిగించాల్సిన అవసరం కూడా ఉంది. ముఖ్యంగా టూ స్టెప్ వెరిఫికేషన్ ద్వారా లావాదేవీలను అనుమతిస్తే చాలా వరకు సైబర్ కేటుగాళ్ల దోపిడీకి అడ్డుకట్ట వేయవచ్చు. మరి ఈ దశగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని సైబర్ నేరాలకు చరమ గీతం పాడుతారని ఆశిద్దాం.