రగులుతున్న ఇథనాల్ చిచ్చు.... పరిశ్రమ పెట్టొద్దంటూ ఇద్దరు రైతుల ఆత్మహత్యాయత్నం

by Shiva |
రగులుతున్న ఇథనాల్ చిచ్చు.... పరిశ్రమ పెట్టొద్దంటూ ఇద్దరు రైతుల ఆత్మహత్యాయత్నం
X

దిశ, వెల్గటూర్: మండలంలో ఇథనాల్ చిచ్చు రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. బుధవారం మరోసారి పరిశ్రమను ఏర్పాటు చేయకూడదంటూ పాషిగాం గ్రామానికి చెందిన గోపతి మల్లన్న లారీకి ఉరేసుకునేందుకు ప్రయత్నించాడు. అదే గ్రామానికి చెందిన నలిమల సత్తవ్వ తన చేతిలో ఉన్న టవల్ తో తనకు తానుగా ఉరేసుకునేందకు యత్నించి సొమ్మసిల్లి పడిపోయింది.

అక్కడే ఉన్న పోలీసులు వారి అడ్డకున్నారు. తమ గ్రామాల్లో ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయకూడదంటున్న.. మళ్లీ పనులు చేపడుతున్నారని ఆరోపించారు. తమకు తెలియకుండా ఫ్యాక్టరీ పనులు చేయాలనుకుంటే సామూహిక ఆత్మహత్యలకు పాల్పడతామని పోలీసులను హెచ్చరించారు. స్థానిక ఎస్సై నరేష్ ప్రజలకు ఎంతగా నచ్చ చెప్పినా వారు పట్టు విడవకుండా నిరసన కొనసాగించారు. పని చేస్తున్న ప్రోక్లైన్లు అక్కడి నుంచి పంపిస్తేనే నిరసన విరమిస్తామని మొండి పట్టు పట్టారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ క్రమంలో ఫ్యాక్టరీ పనులు చేపట్టేందుకు ఓ లారీలో ప్రోక్లైన్లు తీసుకురాగా పరిసర గ్రామాల ప్రజలు దానిని కిందకి దించకుండా లారీ కింద కూర్చొని అడ్డుకున్నారు. సుమారుగా ఐదు గంటల పాటు లారీకి అడ్డంగా కూర్చుని ఎర్రని ఎండలో బాధితులంతా కలిసి నిరసన చేశారు. తమ ఊరి పొలిమేరలు కనిపించే విధంగా హరిత హోటల్ పరిసరాల్లో బిగించిన సీసీ కెమెరాలను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. వీరందరికీ సామాజిక కార్యకర్త మోతె నరేష్ మద్దతుగా నిలిచారు. సీసీ కెమెరాలు తొలగించడంతో పాటు మరో రెండు ప్రోక్లైన్లను కొద్ది రోజుల్లోనే వెనక్కి పంపిస్తామని ప్రజలకు ఎస్సై నరేష్ కుమార్ హామీ ఇవ్వడంతో గ్రామస్థులు నిరసన విరమించారు.

Advertisement

Next Story