రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్ళు పూర్తి చేయాలి.. మంత్రి గంగుల

by Sumithra |
రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్ళు పూర్తి చేయాలి.. మంత్రి గంగుల
X

దిశ, కరీంనగర్ టౌన్ : రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రణాళికాబద్ధంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తిచేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి మంత్రి గంగుల కమలాకర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు, సీఎంఆర్ రైస్ అంశం పై జిల్లా కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం కొనుగోలు అంశంలో జిల్లా కలెక్టర్లు, అధికారులు తీసుకున్న చర్యల కారణంగా గత సంవత్సరం కంటే అధికంగా ధాన్యం కొనుగోలు చేశామని, అయినప్పటికీ క్షేత్రస్థాయిలో తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. ఈ సంవత్సరం మే 23 నాటికి 6.4 లక్షల రైతుల నుంచి 38 లక్షల 50 వేల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేశామని, గత సంవత్సరం కంటే అధికంగా 450 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని మంత్రి తెలిపారు. జిల్లాలో కురిసిన అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని సైతం రైతులు నష్టపోవద్దనే ఉద్దేశంతో కొనుగోలు చేశామని తెలిపారు.

రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని గోడౌన్లో భద్రపరచాలని, జిల్లాలో గోడౌన్లను గుర్తించాలని మంత్రి ఆదేశించారు. రైస్ మిల్లుల వద్ద లోడింగ్, అన్ లోడింగ్ సమస్య రాకుండా అధిక సంఖ్యలో హమాలీలు ఏర్పాటు చేసుకోవాలని, జిల్లాల వారీగా అవసరమైతే లారీల సంఖ్యను పెంచాలని రైతుల వద్ద చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయాలని మంత్రి తెలిపారు.

జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ మాట్లాడుతూ జిల్లాలో మే 23 వరకు 2లక్షల 837 మెట్రిక్ టన్నుల ధాన్యం రూ.413.73 కోట్ల విలువగల ధాన్యం 31,865 మంది రైతుల నుండి కొనుగోలు చేశామని, ఇప్పటివరకు 119.64 కోట్ల రూపాయలను 10,735 మంది రైతులకు చెల్లించారని కలెక్టర్ తెలిపారు. రైస్ మిల్లుల వద్ద ధాన్యం దిగుబడి సమస్య రాకుండా అలాట్ చేసిన రైస్ మిల్లులు తప్పనిసరిగా ధాన్యం దిగుమతి చేసుకునేలా ప్రత్యేక అధికారులను నియమించి పర్యవేక్షిస్తున్నామని, రైస్ మిల్లుల వద్ద స్థల సమస్య ఉంటే ప్రత్యామ్నాయ స్థలాల ఎంపిక చేపడుతామని తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హైదరాబాద్ నుండి రాష్ట్రపౌర సరఫరాల శాఖ చైర్ పర్సన్ సర్దార్ రవీందర్ సింగ్, కమిషనర్ అనిల్ కుమార్, జిల్లా నుండి శిక్షణ జాయింట్ కలెక్టర్ నవీన్ నికోలస్, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారి సురేష్, డీఆర్డీఓ శ్రీలత జిల్లా రైస్ మిల్లుల అసోసియేషన్ అధ్యక్షులు నరసింగరావు, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధ్యక్షులు పెద్ది రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story