- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తిరుమల తరహాలో భద్రాద్రి

దిశ, భద్రాచలం: దక్షిణ అయోధ్య గా పేరుగాంచిన భద్రాద్రి రామాలయం నూతన శోభ సంతరించుకోనుంది. శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణం సమీపిస్తున్న వేళ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో కాంగ్రెస్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. భద్రాద్రి రామాలయం అభివృద్ధికి పూనుకుంది. ఆలయ అభివృద్ధి పనులకు ఆటంకం గా ఉన్న భూ సేకరణకు కాంగ్రెస్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భూ సేకరణ సమస్యను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యుద్ధ ప్రాతిపదికన భూసేకరణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రూ 34 కోట్లు నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో శ్రీరామనవమి నాడు రామాలయం అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. గత ప్రభుత్వం భద్రాద్రిని నిర్లక్ష్యం చేసింది. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ రామాలయం అభివృద్ధికి రూ. 100 కోట్లు ప్రకటించి ఒక్క రూపాయి నిధులు కూడా విడుదల చేయలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం భద్రాద్రిని టెంపుల్ సిటీ చేసి తిరుమల తరహాలో అభివృద్ధి చేసేందుకు ఆలోచన చేస్తుంది. ఈ మేరకు ఎన్ని నిధులైన వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది.
అడిగిందే తడవుగా...
ఆదివారం రోజున ఆలయ ఈఓ, వేద పండితులు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి భద్రాచల సీతారామచంద్ర స్వామి కళ్యాణ వేడుకకు ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల గతంలో భద్రాద్రి ఆలయ అభివృద్ధికి రూపొందించిన మాస్టర్ ప్లాన్ ను సీఎం కు వివరించారు. అభివృద్ధి పనులకు భూసేకరణ అడ్డంకిగా మారిందని తుమ్మల సీఎంకు తెలిపారు. భూసేకరణ పనులు పూర్తి చేస్తే భద్రాద్రి ఆలయ అభివృద్ధికి ఎలాంటి ఆటంకం ఉండదని భద్రాద్రి ఆలయం భక్తులతో మరింత శోభిల్లుతోందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. మంత్రి తుమ్మల చొరవతో సీఎం రేవంత్ రెడ్డి భూసేకరణకు కావలసిన నిధులను మరుసటి రోజు విడుదల చేసి ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. శ్రీరామనవమి నాడు స్వామి వారికి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అదే రోజు ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. భద్రాద్రి ఆలయ అభివృద్ధికి నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మంత్రి తుమ్మల కృతజ్ఞతలు తెలిపారు.
నవ భద్రాద్రి...
భారత దేశానికి తలమానికంగా దక్షిణ అయోధ్య గా పేరుగాంచిన భద్రాద్రి అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. అనేక ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న భూసేకరణ సమస్యకు ఎట్టకేలకు మంత్రి తుమ్మల పరిష్కారం చూపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో నవ భద్రాద్రి దిశగా తుమ్మల కృషి చేస్తున్నారు. భూ సేకరణ తర్వాత అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. దక్షిణ అయోధ్య గా భద్రాద్రి ఆలయ కీర్తి ధ్వనించేలా అభివృద్ధి చేయనున్నారు.
నమూనాలు సిద్ధం...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యవేక్షణలో భద్రాద్రి ఆలయం నూతన శోభ సంతరించుకోనుంది. ఆగమ పండితులు రూపొందించిన నమూనాలు, సూచనల ప్రకారం అభివృద్ధి పనులను ప్రారంభించాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. శరవేగంగా భూసేకరణ పనులు పూర్తి చేయాలని సూచించారు. యుద్ధ ప్రాతిపదికన షాపులు, ఇల్లు షిఫ్టింగ్ చేసేలా ఆదేశాలు జారీ చేశారు. శ్రీరామనవమి వేడుకలు అనంతరం నమూనాల ప్రకారం అత్యద్భుతంగా భద్రాద్రి ఆలయ పునర్నిర్మాణానికి అడుగులు పడనున్నాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా భద్రాద్రి ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. దీంతో శ్రీరామ భక్తుల కల సాకారం కానుంది.