నిరుపయోగంగా సీటీ స్కాన్.. అత్యవసర పరిస్థితుల్లోనూ ఆమడ దూరం వెళ్లాల్సిందే!

by Anjali |
నిరుపయోగంగా సీటీ స్కాన్.. అత్యవసర పరిస్థితుల్లోనూ ఆమడ దూరం వెళ్లాల్సిందే!
X

దిశ, వేములవాడ : ఎంతో హంగు ఆర్భాటాలతో వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ యంత్రం సేవలు సామాన్య రోగులకు అందని ద్రాక్షగా మారినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే... ఆస్పత్రికి వచ్చే పేద రోగుల సౌకర్యార్థం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సాహకారంతో రెండేళ్ల కింద ఆస్పత్రిలో సిటీ స్కాన్ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే దాని నిర్వహణను మాత్రం గాలికి వదిలేశారు. దీంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఈ మధ్యకాలంలో మనిషికి ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా సిటీ స్కాన్ తీయడం అనేది సర్వ సాధారణంగా మారింది.

ముఖ్యంగా ఏవైనా రోడ్డు, ఇతర ప్రమాదాలు జరిగినప్పుడు గాయం తీవ్రతను తెలుసుకుని వైద్యం చేసేందుకు సిటీ స్కాన్ తీయడం అనేది తప్పనిసరి అని డాక్టర్లు సూచిస్తున్నారు. దీంతో అత్యవసర సమయాల్లో ఆస్పత్రికి వచ్చిన వారు తీవ్ర గాయాలతోనే సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి లేదా సమీపంలోని ఏదైనా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఈ పరిణామం పేద ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపడమే కాకుండా అత్యవసర పరిస్థితుల్లో ఆమడ దూరం వెళ్తూ ప్రాణాల మీదకు తెచ్చుకునే దుస్థితి ఏర్పడుతోంది.

అందుబాటులో లేని రేడియాలజిస్ట్...

ఇక సిటీ స్కాన్ యంత్రం పనితీరు అలా ఉంటే. అసలు ఆస్పత్రిలో సిటీ స్కాన్ నివేదికను చూడాల్సిన రేడియాలజిస్ట్ అందుబాటులో లేడనే విషయం వెలుగులోకి రావడం ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో ఆస్పత్రి నిర్వహణపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆస్పత్రి మొదలైనప్పటినుంచి రేడియాలజిస్ట్ అందుబాటులో లేడని, ఈ నేపథ్యంలో ఆస్పత్రికి వచ్చే రోగులు సిటీ స్కాన్ కోసం తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తోందని తెలుస్తోంది.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం..

సిటీ స్కాన్ యంత్రానికి సంబంధించి రూ.23లక్షలు విలువ చేసే కంప్రెహెన్సివ్ మెయింటనెన్స్ స్క్వేర్ (సీఎంసీ) వారంటీ ముగిసింది. ఈ సమయంలో యంత్రాన్ని వాడితే అందులోని రూ.80లక్షల విలువ చేసే ట్యూబ్ పాడయ్యే అవకాశం ఉంది. దీంతో జాగ్రత్తగా యంత్రాన్ని వినియోగించే పరిస్థితి నెలకొన్నది. ఇక్కడ రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, యంత్రం పని చేయని విషయాన్ని గత 6నెలల కిందటే ఉన్నతాధికారులతోపాటు స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాం.

- డాక్టర్ మహేష్ రావు, ఆస్పత్రి సూపరింటెండెంట్

Advertisement

Next Story

Most Viewed