తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్

by Sridhar Babu |
తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్
X

దిశ, గంగాధర : సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం నడుస్తోందని, దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి మహిళలతో కలిసి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతులకు వ్యవసాయానికి పెట్టుబడి సాయంగా ప్రతి ఎకరానికి రూ. 12 వేలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని, రాష్ట్రంలో భూమిలేని కూలీలకు కూడా రూ.12వేలు ఇవ్వాలని సీఎం ప్రకటించారని తెలిపారు. జనవరి 26వ తేదీ నుండి ఈ పథకం పూర్తిస్థాయిలో అమలు అవుతుందని, గత పదేళ్లు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ రాష్ట్రాన్ని మరింతగా దివాలా తీయించారని ఆరోపించారు.

గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. జనవరి 26వ తేదీ నుండి రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందజేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కండ్లలో నిప్పులు పోసుకుంటున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో గంగాధర మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు రజిత శ్రీనివాస్ రెడ్డి, గంగాధర సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట కరుణాకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, దుబ్బాసి బుచ్చయ్య, రామిడి రాజిరెడ్డి, చొప్పదండి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఒడ్నాల యగ్నేష్, బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు తోట సంధ్య, కాంగ్రెస్ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story