శాంతి భద్రతల్లో తెలంగాణ పోలీస్ ముందంజ : డీసీపీ వైభవ్ గైక్వాడ్

by Shiva |
శాంతి భద్రతల్లో తెలంగాణ పోలీస్ ముందంజ : డీసీపీ వైభవ్ గైక్వాడ్
X

దిశ, పెద్దపల్లి : శాంతి భద్రతల్లో తెలంగాణ పోలీస్ దేశంలోనే ముందంజలో ఉందని పెద్దపల్లి డీసీపీ వైభవ్ గైక్వాడ్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా సురక్షా దినోత్సవం సందర్భంగా ఆదివారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని మూడు నియోజకవర్గ కేంద్రాల్లోని పోలీస్ స్టేషన్లలో ఓపెన్ హౌజ్ ను ఏర్పాటు చేసి పోలీస్ శాఖ చేసే వివిధ కార్యక్రమాలను, అందించే వివిధ సేవలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌజ్ ను జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సందర్శించారు.

ఓపెన్ హౌజ్ ఆసాంతం ఆసక్తిగా పరిశీలించిన వారు ఆయుధాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఓపెన్ హౌజ్ లో ఏర్పాటు చేసిన ఆయుధాలు, పాస్ పోర్ట్ వెరిఫికేషన్, ఫింగర్ ప్రింట్, సైబర్ క్రైమ్, షీ టీం, కమ్యూనికేషన్, ట్రాఫిక్ పోలీస్, బ్లూ కాల్ట్ మొదలగు స్టాళ్లలో ఏర్పాటు చేసిన సామాగ్రి, ఆయుధాల పనితీరు, అందించే సేవలను ఈ సందర్భంగా డీసీపీ వారికి వివరించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సాధించిన ప్రగతి వివరిస్తూ వీడియోలను ప్రదర్శించారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం పోలీసు శాఖ పరిధిలో వచ్చిన మార్పులు వివరిస్తూ వీడియోను రూపొందించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల కోసం రామగుండం పోలీస్ కమిషనరేట్ ను ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిందన్నారు. ఆధునిక హంగులతో, అత్యాధునిక సాంకేతికత వినియోగించుకునేలా రూ.38.50 కోట్లతో రామగుండం పోలీస్ కమిషనరేట్ భవనాన్ని, 1.50 కోట్లతో అంతర్గాం పోలీస్ స్టేషన్ భవనాన్ని, రూ.3.50 కోట్లతో గోదావరిఖని పోలీస్ స్టేషన్ భవనాన్ని, రూ.3.40 కోట్లతో పోలీసుల అతిథి గృహాన్ని ప్రభుత్వం నిర్మించిందన్నారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పోలీసులకు ఆధునిక వాహనాలను సమకూరుస్తూ, పెట్రోలింగ్ వ్యవస్థను ప్రభుత్వం బలపరిచిందన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులకు నూతనంగా 167 ఫోర్ వీలర్స్, 386 టూ వీలర్స్, 267 పెట్రోలింగ్ వాహనాలను ప్రభుత్వం సమకూర్చిందని తెలిపారు.పెద్దపల్లి జిల్లా పరిధిలో 4,310 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నేరాల నియంత్రణ, మహిళల భద్రత కోసం షీ టీం బృందాలను ఏర్పాటు చేసి జిల్లా పరిధిలో 942 అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు.

సైబర్ నేరాల పట్ల కళా బృందాల సహాయంతో, సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించినట్లు ఆయన తెలిపారు. జిల్లా పరిధిలో 168 సైబర్ కేసులను నమోదు చేసి 1.5 కోట్లను సీజ్ చేసి నేరస్తులను అరెస్ట్ చేశామని తెలిపారు. గోదావరి నదిపై గల బ్రిడ్జి, గ్యారేజీల వద్ద రివర్ పోలీసింగ్ ద్వారా 166 మంది మహిళలు, 137 మంది పురుషులు, 22 మంది పిల్లలను రక్షించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ మమతారెడ్డి, ఎస్సై మహేందర్ యాదవ్, పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story