కేసీఆర్ పుట్టినరోజున జరిగిన ఆ దారుణానికి రెండేళ్లు

by S Gopi |
కేసీఆర్ పుట్టినరోజున జరిగిన ఆ దారుణానికి రెండేళ్లు
X

దిశ, రామగిరి: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని కల్వచర్ల వద్ద దారుణం జరిగి నేటికి రెండేళ్లు పూర్తి అయ్యింది. రెండేళ్ల క్రితం సీఎం కేసీఆర్ పుట్టినరోజున జరిగిన హైకోర్టు న్యాయవాది గట్టు నాగమణి వామన్ రావు దంపతుల హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. గట్టు దంపతులు 2021 ఫిబ్రవరి 17న మంథనిలో ఓ కేసు నిమిత్తం కోర్టుకు హాజరై హైదరాబాద్ వెళ్తుండగా మంథని పెద్దపల్లి ప్రధాన రహదారిపై కల్వచర్ల వద్ద అడ్డగించి వేట కోడవళ్లతో దారుణంగా హతమార్చారు. అయితే నడిరోడ్డుపై హత్య చేసి పారిపోతుండడంతో ప్రయాణికులు తీసిన వీడియో బయటికి రావడంతో బండారం బట్టబయలు అయ్యింది. ఈ కేసులో పోలిసులు విచారణ అనంతరం అప్పటి టీఆర్ఎస్ మంథని మండల అధ్యక్షుడు కుంట శ్రీనివాస్, పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను, సహా మరో అయిదుగురిని అరెస్టు చేశారు. ఇందులో ముగ్గురు బెయిల్ పై విడుదల కాగా, మరో నలుగురు ఇంకా జైలులోనే ఉన్నారు.

ఇప్పటికీ హత్యపై అనుమానాలు

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లాయర్ దంపతుల హత్య కేసుపై నేటికి పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న తులిసేగారి శ్రీనివాస్ అలియాస్ బిట్టు శ్రీను మంథని మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత జడ్పీ చైర్మన్ పుట్టమధుకు మేనల్లుడు కావడంతో అనుమానాలకు బలం చేకూరింది. పుట్ట మధు అక్రమంగా ఆస్తులు కూడబెట్టాడని, దీనిపై సీబీఐ ఎంక్వైరీ చేయించాలని గత ఎన్నికల ముందు కోర్టులో గట్టు దంపతులు పిటిషన్ దాఖలు చేశారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో పుట్ట మధు ఓడిపోవడంతో అప్పటినుండి వీరిమధ్య వైరం మరింత ముదిరిందని చర్చించుకుంటున్నారు. దీంతో ఈ హత్య వెనుక పుట్ట మధు హస్తం ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. అనంతరం పోలీసులు పుట్ట మధును విచారించి ఆయన పాత్ర లేదని తెలిపారు. అయితే పోలీసులు విచారణ సరిగ్గా జరపట్లేదని, అసలు నిందితులు బయట దర్జాగా తిరుగుతున్నారని వామన్ రావు తండ్రి పలుమార్లు ఆరోపించారు. అనంతరం ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ గతేడాది సుప్రీంకోర్టు ను సైతం ఆశ్రయించారు.

Advertisement

Next Story

Most Viewed