రెచ్చిపోతున్న మట్టిమాఫియా.. పొద్దంతా కంపెనీ బండ్లు రాత్రంతా మాఫియా బండ్లు

by Anjali |   ( Updated:2024-08-27 02:21:51.0  )
రెచ్చిపోతున్న మట్టిమాఫియా.. పొద్దంతా కంపెనీ బండ్లు రాత్రంతా మాఫియా బండ్లు
X

దిశ, హుజూరాబాద్: హుజూరాబాద్‌లో మట్టిమాఫియా చెలరేగి పోతోంది. సీపీగా అభిషేక్ మహంతి వచ్చిన కొత్తలో కొన్ని రోజులపాటు అన్ని దందాలను ఆపేసిన అక్రమార్కులు మళ్లీ జూలు విదిల్చారు. తమను అడ్డుకునే వారు లేరన్న రీతిలో తమ వ్యాపారాన్ని మళ్లీ మొదలు పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే హుజూరాబాద్ ప్రాంతంలోని ఇసుక, మట్టిమాఫియాపై కన్నేసి చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ఇచ్చిన పిలుపు మేరకు పోలీసులు బంద్ చేయించారు. కానీ ఈ మధ్యకాలంలో మళ్లీ మట్టిమాఫియాకు రెక్కలు వచ్చాయి. హుజూరాబాద్ ప్రాంతం గుండా పోతున్న నేషనల్ హైవే వీరికి వరంగా మారింది. నేషనల్ హైవేకు హుజూరాబాద్‌లోని పాండవుల గుట్ట, రంగాపూర్‌తోపాటు మరో రెండు చోట్ల మైనింగ్ అధికారులు మట్టి తీసుకోవడానికి అనుమతులు ఇచ్చారు.

మైనింగ్ అధికారులు ఇచ్చిన అలైన్‌మెంట్‌లో మట్టి తీసుకోవడానికి డీబీఎల్‌తోపాటుగా సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిన బెరుండా, సీఎస్‌కే కంపెనీలకు అనుమతి ఇచ్చారు. దీంతో వీరు హుజూరాబాద్ నుంచి పోతున్న ఎన్‌హెచ్ 563 జాతీయ రహదారికి మట్టిని నిత్యం వందల లారీల్లో సరఫరా చేస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకున్న లోకల్ మట్టిమాఫియా వీరిని బెదిరించి అలైన్‌మెంట్‌లో జేసీబీలు పెట్టి మట్టిని తీసి జమ్మికుంట, శంకటపట్నం, హుజూరాబాద్‌కు సరఫరా చేస్తున్నారు. అడ్డుకున్న కంపెనీ ప్రతినిధులను బెదిరించడంతో వారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఉద్యోగులు కావడంతో కిమ్మనకుండా ఉంటున్నట్లు సమాచారం. కొందరు ధైర్యం చేసి పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.

బెరుండా సిబ్బందితో లోడింగ్...

నేషనల్ హైవే 563లో సబ్ కాంట్రాక్ట్ చేస్తున్న బేరుండ కంపెనీ ప్రతినిధులను లోకల్ మాఫియా నయాన్నో, భయాన్నో దారికి తెచ్చుకున్నట్లు సమాచారం. దీంతో ఆ కంపెనీ సిబ్బంది లోకల్ మాఫియా తెచ్చుకున్న ఒక్కో లారీకి రూ.200నుంచి రూ.300 తీసుకుని లోడింగ్ చేస్తున్నట్లు సమాచారం. దీన్ని మట్టి మాఫియాకు చెందిన వ్యక్తులు దూరాన్ని బట్టి రూ.2వేల నుంచి రూ.3వేల వరకు మట్టిని విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఇలా రోజుకు 200 లారీల వరకు మట్టిని చుట్టు పక్కల ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం.

మట్టిమాఫియా సిండికేట్‌..

లోకల్‌గా ఉన్న మాఫియా సిండికేట్‌గా ఏర్పడినట్లు తెలుస్తోంది. దీంతో వీరికి ఎదురు మాట్లాడినా, ఫిర్యాదు చేసినా దాడులకు కూడా సిద్దపడుతున్నట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయం రంగపూర్‌లో డీబీఎల్‌కు ఇచ్చిన అలైన్ మెంట్‌లో మట్టిని తీస్తూ జమ్మికుంటలోని అయ్యప్పటెంపుల్ వద్దకు ఉదయం 9గంటల వరకు దాదాపుగా 40లారీలతో సప్లై చేసినట్లు తెలుస్తుంది. కాగా, ఈ విషయమై డీబీఎల్ కంపెనీ వాచ్ మెన్ వెళ్లి ఆపాలని ప్రయత్నిస్తే అతడిని బెదిరించి పంపినట్లు సమాచారం.

పొద్దంతా కంపెనీ బండ్లు.. రాత్రంతా మాఫియా బండ్లు..

మట్టిని తీయడానికి పొద్దంతా హైవే పనుల కోసం కంపెనీ లారీలు, రాత్రంతా మట్టిమాఫియా లారీలతో రోడ్లన్నీ ఛిద్రం అవుతున్నాయి. వారిని ఆపే వారు లేక మాఫియా ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు.

పట్టించుకోని పోలీసులు..

హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాలకు మట్టిమాఫియా నిరంతరం వందల కొద్ది లారీల్లో మట్టి సరఫరా చేస్తుంటే పోలీసులు ఏమి చేస్తున్నారని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాత్రివేళల్లో పెట్రోలింగ్‌కు వెళ్తే మామూళ్లు ఎక్కువ మొత్తంలో వస్తాయని పోలీసులు పెట్రోలింగ్ డ్యూటీపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని ఆరోపిస్తున్నారు. నూతనంగా వచ్చిన సీఐకి ఈ విషయాలపై ఇంకా అవగాహన లేకపోవడంతో వీరు ఈ విషయాలను ఆయన దృష్టికి రాకుండా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం.

పరిమితికి మించి తవ్వకాలు..

మట్టి తవ్వకాలకు ఇచ్చిన పరిమితి కంటే ఎక్కువ లోతులో మట్టిని డిబీల్ కంపెనీ తీస్తున్నట్లు అక్కడికి వెళ్తే అర్థమవుతుంది. ఒక్కో చోట తాటి చెట్టు కన్న ఎక్కువ లోతులో మట్టిని తీస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు.

పరిమితికి మించే తవ్వితే చర్యలు..

డీబీఎల్ కంపెనీకి ఇచ్చిన పరిమితికి మించి మట్టిని తీస్తే చర్యలు తీసుకుంటాం. మంగళవారం ఆ ప్రాంతాన్ని పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటాం.

- రామ్ నర్సింగ్, ఏడీ, మైనింగ్

Advertisement

Next Story

Most Viewed