హరిత(ఆ)హారం..! జీతం ప్రభుత్వానిది.. సేవలు ప్రైవేటుకు?

by Shiva |
హరిత(ఆ)హారం..! జీతం ప్రభుత్వానిది.. సేవలు ప్రైవేటుకు?
X

దిశ బ్యూరో, కరీంనగర్: అంతరిస్తున్న అడవులతో ప్రకృతి సమతుల్యతను కాపాడేందుకు హరితహారం పేరిట గత ప్రభుత్వం మొక్కలు నాటి అడవులను పెంచేందుకు శ్రీకారం చుట్టింది. అందుకు ప్రతి గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలో ప్రత్యేక సిబ్బందిని నియమించి వారితోనే నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు నాటించే కార్యక్రమం చేపట్టింది. ప్రభుత్వం చేపట్టిన పథకం అభినందనీయమే కానీ, హరితహారం పథకాన్ని పాలకులు పట్టించుకోకపోవడంతో పక్కదారి పడుతూ కొంతమంది ఉద్యోగులకు ఆదాయవనరుగా మారింది.

అందుకు కరీంనగర్ నగర పాలక సంస్థ నిర్వహిస్తున్న హరితహారంలో జరుగుతున్న అవినీతి అక్రమాలే ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నాయి. కొంత మంది ఉద్యోగులు పనికి రాకపోయినప్పటికీ వారు పనికి వచ్చినట్లు హాజరు పట్టికలో నమోదు చేస్తూ అందులో నుంచి సగం హాజరు వేసే సూపర్‌వైజర్‌కు... సగం డబ్బు సిబ్బందికి ఇస్తూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథకాన్ని పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. నాటిని మొక్కల సంరక్షణకు వాడాల్సిన వెదురు బొంగులు, జంతువుల బారి నుంచి కాపాడేందుకు ఏర్పాటు చేసిన జాలీలను కొందరు ఉద్యోగులు మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి.

జీతం ప్రభుత్వానిది.. సేవలు ప్రైవేటుకు

ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కరీంనగర్ నగరపాలక సంస్థ సారథ్యంలో సీడీఎంఏ ద్వారా 66 మంది కూలీలను ముగ్గురు సూపర్‌వైజర్లను నియమించారు. ఈ సిబ్బంది కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో 16 నర్సరీలతో పాటు డివిజన్లలో హరితహారం పనులు నిర్వహించాలి. మున్సిపల్ అధికారులు వీరిని మానిటరింగ్ చేస్తుంటారు. అయితే, చెట్లు నాటి హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన అధికారులు దీన్ని ఆదాయ వనరుగా మార్చుకుని సంవత్సరాల తరబడి ప్రభుత్వ ధనాన్ని దోచుకుంటున్నారు.

సీడీఎంఏ ఆధ్వర్యంలో సిబ్బంది ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి పటిష్టంగా హరితహారం కార్యక్రమం చేపడుతున్నప్పటికీ మున్సిపల్ శాఖలో కీరోల్‌గా వ్యవహరించే అధికారులు కింది స్థాయి సిబ్బందితో అందులో లొసుగులను వెతికి వారికి అనుగుణంగా మార్చుకుంటున్నారు. సిబ్బంది హాజరును హరితహారంలో పని చేస్తున్నట్లుగా చూపిస్తూ ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన గార్డెన్‌లలో పనులు చేయిస్తూ వారి వద్ద నుంచి డబ్బు వసూలు చేస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది ఉద్యోగులు పనికి రాకపోయినప్పటికీ.. వారు పనికి వచ్చినట్లుగా హాజరు పట్టికలో నమోదు చేస్తూ అందులో నుంచి సగం హజరు వేసే సూపర్‌వైజర్లకు సగం డబ్బు సిబ్బందికి ఇస్తూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథకాన్ని పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ప్రైవేటు పనులకు ప్రభుత్వ పనిముట్లు

ప్రభుత్వం హరితహారం కార్యక్రమం నిర్వహణ కోసం సిబ్బందిని నియమించడంతో పాటు కొన్ని యంత్రాలను పరికరాలను కూడా సమకూర్చింది. అయితే ప్రభుత్వం చేపట్టిన హరితహారానికి వాడాల్సిన పనిముట్లను సిబ్బంది ప్రైవేటు వ్యక్తులకు కిరాయికి ఇస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. హరితహారం సిబ్బందిని సైతం ప్రైవేటు గార్డెన్‌లలో గ్రాస్ కట్టింగ్ కోసం పంపిస్తూ వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అమ్మకానికి వెదురు బొంగులు.. సంరక్షణ జాలీలు

ప్రభుత్వం హరితహారంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగేందుకు వెదురు బొంగులను పెరిగే చెట్లను ఆవులు, మేకలు తినకుండా ఉండేందుకు జాలీలను సమకూర్చుతోంది. అయితే, ప్రభుత్వం నాటిని మొక్కల సంరక్షణకు వాడాల్సిన వెదురు బొంగుల జంతువుల బారి నుంచి కాపాడేందుకు ఏర్పాటు చేసిన జాలీలను కొందరు ఉద్యోగులు మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి.

థంబింగ్‌లోనూ అక్రమాలు

హరితహారంలో అవకతవకలకు అస్కారం లేకుండా ఉండేందుకు ప్రభుత్వం బయో మెట్రిక్ విధానాన్ని అమలు చేస్తుంది. అయితే, అక్రమాలు చేయడంలో ఆరితేరిన ఉద్యోగులు థంబింగ్‌లో గైర్హజరైనప్పటికీ మ్యానువల్ రికార్డుల్లో హాజరు అయినట్లుగా నమోదు చేస్తూ ఉద్యోగుల జీతాలను ఫుల్ జీతాలు తీసుకుంటూ అందులో నుంచి వాటాలు పంచుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకు కార్మికులు సహకరించడంతో అక్రమాలు ఎక్కడ వెలుగుచూడకుండా ఐదేళ్ల నుంచి నుంచి ఈ దందా సాగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పూర్తి స్థాయి విచారణ చేపట్టినట్లయితే మరిన్ని విషయాలు వెలుగుచూసే అవకాశం లేకపోలేదు.

హరితహారం పర్యవేక్షణ ఎవరి బాధ్యత?

గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం నిర్వహణపై అధికారులు అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. హరితహారం నిర్వహించేందుకు కరీంనగర్ నగర పాలక సంస్థలో ఒక డీఈ స్థాయి అధికారికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పజెప్పినప్పటికీ తామేమి బాధ్యులం కాదన్నట్లుగా వ్యవహస్తున్నారు. హరితహారంలో జరుగుతున్న అక్రమాలు అద్దం పడుతుండగా వివరణ కోరేందుకు మున్సిపల్ డీఈని సంప్రదించగా.. స్పందించిన డీఈ వెంకటేశ్వర్లు ఏ డివిజన్ పరిధిలో ఆ డివిజన్ ఏఈ బాధ్యతలు చూసుకుంటారని సమాధానం చెప్పారు. మరో డీఈ రోడ్డ యాదగిరిని వివరణ కోరగా.. అది తన పరిధి కాదు అంటూ నిర్మొహమాటంగా సమాధానం చెప్పారు. ఇలా నగర పాలక సంస్థలో పనిచేస్తున్న ఇద్దరు డీఈలు నా పరిధికి రాదు అంటే నా పరిధికి రాదు అంటు సమాధానం చెప్పడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనంగా నిలుస్తున్నది. ఇంతకీ హరితహారం పర్యవేక్షణ ఎవరి పరిధిలో ఉందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంపై ఉన్నత స్థాయి అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

Next Story

Most Viewed