Mid Manair Dam : ఎల్ఎండి‌కి పెరుగుతున్న వరద.. హెచ్చరిక జారీ చేసిన అధికారులు

by Mahesh |   ( Updated:2023-07-27 06:30:27.0  )
Mid Manair Dam : ఎల్ఎండి‌కి పెరుగుతున్న వరద.. హెచ్చరిక జారీ చేసిన అధికారులు
X

దిశ, తిమ్మాపూర్: తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండి జలాశయంలో క్రమంగా వరద నీటి ఉధృతి పెరుగుతోంది. గంట, గంటకు ప్రాజెక్ట్‌లోకి వచ్చే వరద ఉదృతి పెరుగుతుండడం తో ఎస్సార్ ఎస్పీ అధికారులు గేట్ల ద్వారా నీటిని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎడతెరిపి లేకుండా గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి వరద ఉదృతి పెరుగుతూ ఉంది. బుధవారం సాయంత్రం 6 గంటలకు 6 వెల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా గంట,గంటకు పెరుగుతూ గురువారం ఉదయం 9 గంటలకు 63,000 క్యూసెక్కులకు పెరిగింది. ప్రస్తుతం 15 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారిక లెక్కల ద్వారా తెలుస్తుంది.

అయితే బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు 63 వేల క్యూసెక్కుల (దాదాపు 6 టీఎంసిలు)వరద వచ్చి చేరుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇన్ ఫ్లో భారీగా ఉండటంతో గురువారం సాయంత్రం వరకు ప్రాజెక్టులో నీటి నిల్వ 20 టీఎంసీలు దాటే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇన్‌ఫ్లో ఇలాగే కొనసాగితే మరికొన్ని గంటల్లోనే ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నిండే పరిస్థితి ఉంటుంది. దీంతో ఎల్ఎండి గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఏ క్షణంలో అయినా గేట్లు ఎత్తే పరిస్థితి ఉందని లోతట్టు ప్రాంత ప్రజలు, నది పరివాహక ప్రాంత ప్రజలు అలెర్ట్‌గా ఉండాలని ఇరిగేషన్ సర్కిల్ -2 ఎస్ఈ శివ కుమార్ సూచనలు జారీ చేశారు.

Read More: వరదల్లో చిక్కుకున్న మోరంచపల్లి.. సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు

Advertisement

Next Story

Most Viewed