Collector Sandeep Kumar Jha : ప్రత్యేక శ్రద్ధతో నాణ్యమైన విద్యను అందించాలి..

by Sumithra |
Collector Sandeep Kumar Jha : ప్రత్యేక శ్రద్ధతో నాణ్యమైన విద్యను అందించాలి..
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : విద్యార్థుల విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి, నాణ్యమైన విద్యా బోధన చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని గీత నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఇంగ్లీషు , గణితం, భౌతిక శాస్త్రాలను బోధించారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి వారిచ్చిన సమాధానాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు గణితం, ఆంగ్లం సబ్జెక్ట్ లపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ప్రధానోపాధ్యాయురాలని ఆదేశించారు. ఇప్పటి నుండి 10వ తరగతి విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధ చూపి పరీక్షలలో మంచి ఫలితాలు సాధించేలా చర్యలు చేపట్టాలని, 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇప్పటి నుంచి పదవ తరగతి సిలబస్ పై అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.

విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం, తయారీ విధానాన్ని స్టోర్ రూమ్ లను పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం మెనూ ప్రకారం అందించాలని తెలిపారు. పాఠశాల ఆవరణలోని బాలుర టాయిలెట్లను, పరిసరాలను స్వయంగా పరిశీలించి ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచే విధంగా తగుచర్యలు తీసుకోవాలని, ఏవైనా చిన్న చిన్న మరమ్మతులు ఉంటే వాటిని ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు. పాఠశాలలోని ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయుల వివరాలు అడిగి తెలుసుకుని హాజరు పట్టికతో పాటు సాధారణ సెలవు రిజిస్టర్ లను పరిశీలించినారు. ముందస్తు సమాచారం లేకుండా, సెలవు దరఖాస్తు ఇవ్వకుండా గైర్హాజరైన ఉపాధ్యాయుల పై చర్యలు తీసుకోవాలని డీఈఓకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ వెంట ప్రధానోపాధ్యాయురాలు శారద, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed