ప్రైవేటీకరణ.. బీజేపీ ప్రభుత్వ విధానం: మంత్రి కొప్పుల ఈశ్వర్

by Shiva |
ప్రైవేటీకరణ.. బీజేపీ ప్రభుత్వ విధానం: మంత్రి కొప్పుల ఈశ్వర్
X

దిశ, గోదావరి ఖని: బీజేపీ ప్రభుత్వ విధానమే ప్రైవేటీకరణ విధానమని, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తూ.. ప్రైవేటు పరం చేస్తూ, ప్రధాని మోదీ మిత్రుడైన అదానీకి కట్టబెడుతున్నాడని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నేతృత్వంలో సింగరేణి బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శనివారం గోదావరి ఖని ప్రధాన చౌరస్తాలో జరిగిన యుద్దభేరికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలైన విమానయానం, నౌకాయానం, ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్ ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కటొక్కటిగా అమ్మి వేస్తోందన్నారు. బీజేపీ పాలనలో దేశం నాశనమవుతోందని, అదోగతి పాలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి బొగ్గు గనులు లాభాల్లో నడుస్తున్నాయని, లాభాల్లో నుంచి 30 శాతం లాభాల వాటాను కార్మికులకు పంచుతోందన్నారు. సంస్థలోని బ్లాకులు ప్రైవేటుపరమైతే కొత్త గనులు లేక, కార్మికులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోతారని అన్నారు.

సీఎం ముఖ్యమంత్రి కేసీఆర్ వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించారని, రాబోయే రోజుల్లో బొగ్గు బ్లాకులు ప్రైవేటు పరమైతే తిరిగి వారసత్వ ఉద్యోగ అవకాశాలు రద్దు చేయబడతాయని పేర్కొన్నారు. కార్మికులు వెట్టి చాకిరిలోకి నెట్టివేయబడతారన్నారు. వారికి అందిస్తున్న క్వార్టర్ సౌకర్యం, ఉచిత విద్యుత్, వైద్యం, వారి పిల్లలకు ఉచిత విద్య వంటి సౌకర్యాలు రద్దు చేయబడతాయన్నారు. రాష్ట్రం ఏర్పడిన ఎనమిదేళ్ల కాలంలో సీఎం కేసీఆర్ పరిపాలనలో అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎన్టీపీసీకి 4వేల మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ వచ్చిందని, గనులు ప్రైవేటు పరమైతే దానికి అవసరమైన బొగ్గును ఎక్కడినుండి తెచ్చుకోవాలన్నారు. సింగరేణి బొగ్గు రూ.4,500 టన్ను లభిస్తుంటే, ఇండోనేషియాలోని ప్రధాని మిత్రుడు అదానీ గనుల నుంచి బొగ్గును టన్నుకు రూ.24,500 చొప్పున కొనాలని మోడీ ఒత్తిడి చేస్తున్నారన్నారు. 134 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణిని నేడు ప్రైవేటు వ్యక్తులకు బొగ్గు బ్లాకులను అప్పజెప్పాలని చూస్తే తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు, సింగరేణి కార్మికులు చూస్తూ ఊరుకోరని ఆయన అన్నారు.

రామగుండం వచ్చినప్పుడు బొగ్గు బ్లాకులను ప్రైవేటు వారికి అప్పగించబోమన్న మోదీ, బెంగుళూరు వెళ్లగానే మాట మార్చి టెండర్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారని అన్నారు. సింగరేణి బొగ్గు బ్లాకులను ప్రైవేటు వారికి అప్పగించబోమని ప్రధాని మోదీ సుస్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే కోరుకంటి పిలుపు మేరకు ఎండను సైతం లెక్కచేయకుండా వేలాదిగా తరలివచ్చిన కార్మికులకు, ప్రజలకు మంత్రి కొప్పుల కృతజ్ఞతలు తెలిపారు.

రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ తెలంగాణ కొంగుబంగారమై మన సింగరేణి జోలికొస్తే ఊరుకోబోమని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హెచ్చరించారు. పెనగడప, శ్రావణపల్లి, సత్తుపల్లి నాలుగు బ్లాకుల వేలాన్ని వెంటనే నిలిపివేయాలని రామగుండం ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ఆర్థిక సామాజిక జీవ నాడి సింగరేణి సంస్థ అని కొనియాడారు. అద్భుతమైన ప్రగతి సాధిస్తున్న సింగరేణి సంస్థ లాభాల్లో నడుస్తున్నా.. ప్రైవేటు పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్నారు.

బొగ్గు బ్లాకులను వేలం వెయ్యొద్దని, రాష్ట్ర ప్రభుత్వానికే కేటాయించాలని సీఎం కేసీఆర్ కేంద్రానికి పలుమార్లు లేఖలు రాసినా పెడచెవిన పెట్టిందన్నారు. రాజస్థాన్ లో లిగ్నైట్ గనులు, ఛత్తీస్ ఘడ్, ఝార్ఖండ్ లో ఉన్న గనులను ఆయా ప్రభుత్వాలకే కేటాయించిన కేంద్రం, తెలంగాణలోని బొగ్గు గనులకు టెండర్ల ప్రక్రియ నిర్వహించడం సరి కాదన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ బంగీ అనీల్ కుమార్, టీ.బీ.జీ.కే.ఎస్ నాయకులు మిర్యాల రాజిరెడ్ది, కెంగర్ల మల్లయ్య, బీఆర్ఎస్ నాయకులు మూల విజయారెడ్డి, జడ్పీటీసీ అముల నారాయణ, కార్పొరేటర్లు ఇంజపురి పులిందర్,

పెంట రాజేష్, అడ్డాల స్వరూప రామస్వామి, దొంత శ్రీనివాస్, కొమ్ము వేణుగోపాల్, కన్నూరి సతీష్ కుమార్, అడ్డాల గట్టయ్య, ఎన్.వీ రమణారెడ్డి, శంకర్ నాయక్, కల్వచర్ల కృష్ణావేణి, కవిత సరోజిని, బాదె అంజలి, బాలరాజ్ కుమార్, నీల పద్మగణేష్, వైస్ ఎంపీపీ లక్ష్మి, సర్పంచ్ లు లత, ధరణి రాజేష్, ధర్మాజీ కృష్ణ, టీ.బీ.జీ.కే.ఎస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గండ్ర దామోదర్ రావు, అయులి శ్రీనివాస్, జహిద్ పాషా, వెంకటేష్, నడిపెల్లి మురళీధర్ రావు, తోడేటి శంకర్ గౌడ్, పీటీ స్వామి, పాతపెల్లి ఎల్లయ్య, పర్లపల్లి రవి, గౌతం శంకరయ్య, జే.వీ.రాజు, గంగ శ్రీనివాస్, కాల్వ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed