TRS : టీఆర్ఎస్‌లో వన్ మ్యాన్ ఆర్మీ.. అంతుచిక్కని అధిష్టానం తీరు!

by samatah |   ( Updated:2022-08-25 05:28:19.0  )
TRS : టీఆర్ఎస్‌లో వన్ మ్యాన్ ఆర్మీ.. అంతుచిక్కని అధిష్టానం తీరు!
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : జిల్లా అధ్యక్షుల నియామక ప్రక్రియ పూర్తయి 8 నెలలు గడుస్తున్నా పూర్తిస్థాయి కమిటీలు వేయడంపై మాత్రం అధిష్టానం దృష్టి సారించడం లేదు. దీంతో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు వన్ మెన్ ఆర్మీలుగా వ్యవహరించాల్సిన పరిస్థితి నెలకొంది. అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోవడం వల్లే పూర్తి స్థాయి కమిటీలు వేసే విషయం పక్కన పెట్టేశారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఏడాది జనవరి 26న రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులను నియమిస్తూ అధినేత కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏక కాలంలో 33 జిల్లాల ప్రెసిడెంట్ల పేర్లను ప్రకటించి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లాకు జీవీ రామకృష్ణారావు, సిరిసిల్లకు తోట ఆగయ్య, జగిత్యాలకు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, పెద్దపల్లికి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ లను జిల్లా అధ్యక్షులుగా నియమించారు. దీంతో ఒక్కసారిగా టీఆరెఎస్ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపించింది.

జిల్లా అధ్యక్ష్య బాధ్యతలు అప్పగించినందున జిల్లా కమిటీల ఏర్పాటుతో తమకు ప్రాధాన్యత లభిస్తుందని, తమకు కూడా ఓ పదవి వరించబోతుందని భావించారంత. కానీ అనూహ్యంగా గులాబీ బాస్ మాత్రం జిల్లా అధ్యక్షుల నియామక ప్రక్రియతోనే సరిపెట్టడంతో నిరాశకు లోనవుతున్నాయి పార్టీ శ్రేణులు. 8 నెలలు గడిచిపోయినా జిల్లా కమిటీలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయకపోవడంతో పార్టీ బాధ్యతలతో అయినా సరిపెట్టుకుందామని కలలు కంటున్న క్యాడర్ లో నిరుత్సాహం పెరుగుతోంది. జిల్లా కమిటీల ఏర్పాటు విషయంలో అధిష్టానం మీనామేషాలు ఎందుకు లెక్కిస్తుందోనన్నదే అంతుచిక్కకుండా పోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో కమిటీలను వేయడం వల్ల పార్టీ నిర్మాణంపై బాధ్యులు నజర్ వేసే అవకాశం ఉంటుందని దీనివల్ల గులాబీ జెండాతో మమేకం అయిన వారిలో కొత్త ఉత్సాహం వస్తుందని అంటున్నవారూ లేకపోలేదు. కానీ అధిష్టానం మాత్రం కమిటీల ఏర్పాటుపై సీరియస్ గా దృష్టి సారించకపోవడం పార్టీలోనూ చర్చనీయాంశంగా మారింది. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కమిటీలు ముఖ్య భూమిక పోషిస్తాయన్న విషయం తెలిసి కమిటీలను విస్తరించే విషయాన్ని ఎందుకు విస్మరిస్తున్నారన్నదే అంతుచిక్కకుండా పోయిందని పార్టీ వర్గాలు తర్జనభర్జన పడుతున్నాయి.

వన్ మెన్ ఆర్మీలుగా..

8 నెలలుగా జిల్లా కమిటీల అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన వారంతా వన్ మెన్ ఆర్మీలుగా వ్యవహరించాల్సి వస్తోందన్నది వాస్తవం. కమిటీల్లో బాధ్యతలు అప్పగించిన వారు లేకపోవడంతో అధ్యక్షులుగా అన్ని తామై వ్యవహరిస్తున్నారు. సంబంధింత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి పార్టీ కార్యకలాపాలు నిర్వహించాల్సిన పరిస్థితి తయారైంది. కమిటీలు వేసినట్టయితే పార్టీ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్నా... షెడ్యూల్ ప్రకారం అయినా వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ పార్టీ నిర్మాణంపై సీరియస్ గా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పార్టీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. ఎన్నికల నాటికే అన్ని విభాగాల్లోనూ పార్టీ పరంగా బలోపేతం చేయాల్నిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అంటున్నారు. కమిటీల కూర్పు చేసేందుకు చొరవ చూపిస్తే బావుంటుందన్న మాటే మెజార్టీ పార్టీ శ్రేణుల నుంచి వ్యక్తం అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed