అన్నదాతలకు అన్నం పెట్టడం పూర్వజన్మ సుకృతం : మంత్రి గంగుల

by Sumithra |
అన్నదాతలకు అన్నం పెట్టడం పూర్వజన్మ సుకృతం : మంత్రి గంగుల
X

దిశ, కరీంనగర్ టౌన్ : లోకానికే అన్నం పెట్టే అన్నదాతకు అన్నం పెట్టడం పూర్వజన్మ సుకృతమని, ఇలాంటి కార్యక్రమంలో భాగస్వామిని కావడం ఆనందంగా ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. వర్షాకాలం ధాన్యాన్ని విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు వచ్చే అన్నదాతలు ఆకలితో పస్తు ఉండొద్దనే ఉద్దేశ్యంతో... కరీంనగర్ ఏఎంసీ పాలకవర్గం మంత్రి గంగుల కమలాకర్ సొంత డబ్బులతో రైతులకు మధ్యాహ్న భోజన పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రతి రోజు మధ్యాహ్నం వేళ రుచికరమైన భోజనాన్ని అందిస్తూ... రైతుల సేవలో తరిస్తుంది. ఈ మధ్యాహ్న భోజనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్యఅతిథిగా హాజరై.. మధ్యాహ్న భోజనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతులకు తానే స్వయంగా వడ్డించి, భోజనం ఎలా ఉందంటూ అడిగి తెలుసుకున్నారు.

ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించేందుకు కరీంనగర్ ఏఎంసీకి వచ్చే రైతులకు మధ్యాహ్నం భోజనం పెడుతున్న ఏఎంసీ చైర్మన్ రెడ్డవేణి మధుతో పాటు పాలకవర్గాన్ని మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లోకానికే అన్నం పెట్టే అన్నదాతలకు అన్నం పెట్టాలని మార్కెట్ కమిటీ పాలకవర్గం తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి గంగుల స్వాగతించారు. తెలంగాణ రాకముందు వ్యవసాయం చేసేందుకు అరిగోసపడ్డ రోజులుండేవని గుర్తు చేసుకున్నారు. ఐదెకరాల భూమి ఉంటే రెండున్నర ఎకరాల భూమిని సాగుచేసేందుకు కూడా ఇబ్బందులు పడ్డ పరిస్థితులుండేవన్నారు. పక్కనే గోదారిపారుతున్న చుక్క నీరు రాక సాగునీటి కోసం మొగులు చూసి దుక్కి దున్నిన రోజులుండేవన్నారు. సాగు నీరు లేక, కరెంట్ రాక, ఎరువులు దొరక్క చివరకు రైతుల డొక్కలు మాడిన పరిస్థితిలుండేవన్నారు.

నాణ్యమైన కరెంట్ రాక కాలిపోయిన ట్రాన్స్ పార్మర్ ప్లేస్ లో కొత్తది కావాలని ధర్నాలు చేసి, కాలు విరగొట్టుకున్న రోజుందంటూ ఆవేదనవ్యక్తం చేశారు. కానీ స్వయంపాలనలో సీఎంగా కేసీఆర్ గద్దెనెక్కిన తర్వాత పరిస్థితులు మారాయని, కాళేశ్వరం జలాలను తీసుకువచ్చి మండుటెండల్లో మత్తడి దూకించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఇప్పుడు కరెంట్ బిల్లు లేదు, నీటి పన్ను లేదని సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలతో బీడుపడ్డ భూములన్ని సాగులోకి వచ్చాయని, భూమికి బరువయ్యే పంటలు పండుతున్నాయన్నారు. గతంలో రైతు పండించిన పంటను అమ్ముకోవాలంటే కిలోమీటర్ల మేర ధాన్యాన్ని తీసుకువెళ్ళాల్సిన పరిస్థితులుండేవని అన్నారు. స్వయంపాలనలో గ్రామగ్రామాన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తున్నామన్నారు.

క్యాష్ కట్టింగ్ పేరుతో డబ్బుల్లో కోత లేకుండా, కొనుగోలు చేసిన వారం రోజుల్లోపే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామన్నారు. తెలంగాణ పచ్చగా ఉండడం, ఇక్కడి రైతులు సంతోషంగా ఉండడాన్ని చూడలేని ఢిల్లీ పార్టీలు విషం చిమ్ముతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ గద్దలు ఇక్కడి నీటిని, బొగ్గును, కరెంట్ ను దోచుకుపోయి మళ్ళీ తెలంగాణను గుడ్డిదీపం చేసేందుకు కుట్రలు పన్నుతుంటే, తెలంగాణ రక్షకుడిగా సీఎం కేసీఆర్ వారిపై యుద్దం చేస్తున్నారన్నారు. సర్వలోక కళ్యాణార్థం దేవతలు యాగాలు, యజ్ఞాలు చేస్తే, రాక్షసులు అందులో రక్తం పోసేవారని పురాణాలు చెబుతున్నాయని, ఇప్పుడు ఢిల్లీ పాలకులు కూడా పురాణాలను రీపిట్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రక్షకుడు కేసీఆర్ మాత్రమేనని, మన సీఎం కేసీఆర్ కు మనం అండగా ఉండి, మన తెలంగాణను కాపాడుకుందామన్నారు.

Advertisement

Next Story