సింగరేణి కార్మికులకు తీపి కబురు!

by S Gopi |   ( Updated:2022-12-09 15:19:16.0  )
సింగరేణి కార్మికులకు తీపి కబురు!
X

దిశ, మందమర్రి: సింగరేణి కాలరీస్ కంపెనీలో రూ. 354 కోట్ల వ్యయంతో 643 క్వార్టర్ల నిర్మాణానికి బోర్డు ఆమోదం తెలిపిందని సింగరేణి చైర్మన్ అండ్ ఎండీ ఎన్. శ్రీధర్ వెల్లడించారు. శుక్రవారం సింగరేణిలో కొత్త గృహాల నిర్మాణానికి బోర్డు ఆమోదం తెలిపినట్లు హైదరాబాద్ ప్రధాన కార్యాలయం నుండి సుదీర్ఘ ప్రకటనను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సింగరేణి ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు విశాలమైన డబుల్ బెడ్ రూమ్ గృహాల నిర్మాణంలో భాగంగా రెండవ దశలో 643 కొత్త క్వాటర్లను నిర్మించేందుకు 354 కోట్ల రూపాయలను వెచ్చించినట్లు తెలిపారు. 2018 ఫిబ్రవరి 27 శ్రీరాంపూర్ లో జరిగిన సింగరేణియుల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సింగరేణి వ్యాప్తంగా పాత క్వాటర్ల స్థానంలో కొత్తవి నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చిన మేరకు కొత్త గృహాల నిర్మాణం చేపట్టామని అన్నారు. ఇప్పటివరకు భూపాలపల్లి, కొత్తగూడెం, ఆర్జీ3 ఏరియా, సత్తుపల్లి ప్రాంతాలలో 1853 క్వాటర్లను నిర్మించి రెండవ దశలో అడుగు పెట్టామని అన్నారు. ప్రస్తుతం 643 క్వాటర్లకు 354 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించబోతున్నామని స్పష్టం చేశారు.


సింగరేణి కంపెనీలో 43 వేల మంది బొగ్గు గని కార్మికులు పనిచేస్తుండగా 49,919 క్వాటర్ల అన్ని వసతులతో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కొత్తగా గనులు విస్తరిస్తున్న ప్రాంతాలలో కాలం చెల్లిన పాత గృహాల స్థానంలో అద్భుతమైన డబుల్ బెడ్ రూమ్ గృహాలను నిర్మిస్తున్నామని వివరించారు. కార్మికుల సంక్షేమం కొరకు ఉచితంగా విద్యుత్తు, సొంతింటి కల నిర్మాణానికి రూ. 10 లక్షల వడ్డీలేని రుణం, ఉచిత వైద్యం, పిల్లల ఉన్నత చదువులకు ఫీజు రియంబర్స్ మెంట్, 10 రెట్లు పెంచి చెల్లిస్తున్న మ్యాచింగ్ గ్రాంట్, ప్రతి ఏటా లాభాలలో వాటా వంటి అనేక పథకాలను అమలు చేస్తున్నది సింగరేణి సంస్థ ఒక్కటేనని శ్రీధర్ కీర్తించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు 2013-14 సంవత్సరంలో ఒక కార్మికుడి సంక్షేమానికి సగటున 90 వేల రూపాయల చొప్పున వెచ్చించగా స్వరాష్ట్రం వచ్చిన తర్వాత వివిధ సంక్షేమ కార్యక్రమాల అమరులో ఇది క్రమేనా పెరిగిందని అన్నారు.


2020-21 సంవత్సరంలో రెండు లక్షల రూపాయలు 2021-22లో దాదాపు 3.10 లక్షలకు పెరిగిందని అన్నారు. కార్మికులకు అత్యాధునిక వైద్య సౌకర్యం కొరకు సగటున 300 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని అన్నారు. కోవిడ్-19 (కరోనా వైరస్) కష్టకాలంలో సింగరేణి పరిశ్రమ రూ. 74 కోట్లతో ముందస్తు వైద్య సేవలు వ్యాక్సినేషన్ చేపట్టామని అన్నారు. ఐదు చోట్ల సొంత ఆక్సిజన్ యూనిట్లను ఏర్పాటు చేశామని చెప్పారు. కార్మికులకు అన్ని సంక్షేమ వసతుల అమలులో సింగరేణి కంపెనీ ముందు వరుసలో ఉందని తేల్చి చెప్పారు. 2022- 23 సంవత్సరంలో 700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ఈ దిశగా ఉద్యోగులందరూ సమిష్టి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Advertisement

Next Story