Kodandaram : తెలంగాణలో అభివృద్ధికి పైసలు లేవు

by Sridhar Babu |
Kodandaram : తెలంగాణలో అభివృద్ధికి పైసలు లేవు
X

దిశ, హుజురాబాద్ రూరల్ : తెలంగాణలో అభివృద్ధికి పైసలు లేవని, బీఆర్​ఎస్​ పాలనలో అభివృద్ధి పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని, ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణానికి విధి విధానాలు రూపొందిస్తున్నామని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. ఆదివారం హుజురాబాద్ లోని సిటీ సెంటర్ హాల్ లో ఏర్పాటు చేసిన పౌర సమాజంతో మాటముచ్చట కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏ ఒక్కరితో జరగలేదని, తెలంగాణ ప్రజల అందరి సహకారంతోనే రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని అన్నారు. బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో పోరాడే గుణం మర్చిపోయామని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమస్యలపై పోరాడితే నాటి ముఖ్యమంత్రి నిర్బంధాలకు గురి చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలు వినేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు పోరాటాలు ఎందుకని ఆయన అన్నారు. గత పది సంవత్సరాల కాలంలో తెలంగాణలో అభివృద్ధి కంటే అప్పులు ఎక్కువ అయ్యాయని, తెలంగాణను అభివృద్ధి చేయాలంటే నిధుల కొరత ఉందని, ప్రతినెలా అప్పులు కట్టడానికి ఇబ్బందిగా ఉందన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐదు నుంచి ఆరు లక్షల కోట్ల అప్పులు చేసి అభివృద్ధి మాత్రం చేయలేదన్నారు. విద్య, వైద్యరంగంలో రాష్ట్రం పూర్తిగా పది సంవత్సరాల కాలంలో వెనుకబడిందని, దానిని దారిలో పెట్టాల్సిన అవసరం ఏర్పడిందని, త్వరలోనే విద్య, వైద్యంపై పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసి వాటి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. గడిచిన ఐదు సంవత్సరాల్లో కాలేశ్వరం నుంచి కనీసం 50 వేల ఎకరాలకు కూడా నీళ్లు పారలేదని, కాలేశ్వరం కట్టడానికి మాత్రం రూ. లక్ష కోట్లు ఖర్చయిందని అన్నారు. మిషన్ భగీరథలో కూడా రూ.50 వేల కోట్లు ఖర్చు చేశారని అన్నారు. డిస్కం, ట్రాన్స్కో , జెన్కోలు కూడా పూర్తిగా అస్తవ్యస్తంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 26 లక్షల కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అవసరం ఉంటే రెండు లక్షలు మాత్రమే కట్టి వదిలేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని విభాగాల్లో ఎమర్జెన్సీ ఏర్పడిందని వాటి పునరుద్ధరణ సమయం ఆసన్నమైందన్నారు.

తెలంగాణ కోసం ప్రజలంతా ఏకమై పోరాడారని ,త్యాగాల తెలంగాణ ప్రజలకు భోగాలు కాదుకదా కనీస సౌకర్యాలైన కల్పించేలా బీఆర్ఎస్ ప్రభుత్వం చూడలేదని అన్నారు. తాను ఎమ్మెల్సీగా పదవీబాధ్యతలు తీసుకున్న తర్వాత పని ఎక్కువగానే చేస్తున్నానని, పబ్లిసిటీ అవసరం లేదని అందుకే మీడియా ముందుకు రావడం లేదన్నారు. హుజురాబాద్ లోని అంబేద్కర్ భవన నిర్మాణంతో పాటు పీవీ జిల్లా సాధనకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల స్పష్టమైన వైఖరితో ఉందని వారికి కొన్ని రోజుల క్రితమే ముఖ్యమంత్రి జాబ్ క్యాలెండర్ ను విడుదల చేశారని, వాటి అమలుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారన్నారు. తెలంగాణ జన సమితి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి ముక్కెర రాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్, ప్రజాసంఘాల నాయకులు వేల్పుల రత్నం, పలకల ఈశ్వర్ రెడ్డి, వేల్పుల ప్రభాకర్ పాల్గొన్నారు.

Advertisement

Next Story