కరీంనగర్ ఎన్‌పీడీసీఎల్ కార్యాలయ అధికారుల వింతపోకడ

by Mahesh |
కరీంనగర్ ఎన్‌పీడీసీఎల్ కార్యాలయ అధికారుల వింతపోకడ
X

దిశ బ్యూరో, కరీంనగర్ : ప్రభుత్వ కార్యాలయమే అయినప్పటికీ అధికారుల తీరు మాత్రం ప్రత్యేకం. సంవత్సరాల తరబడి పాతుకుపోయిన ఉద్యోగులు బదిలీల నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. అర్థరాత్రి రూరల్ సర్కిల్‌ను టౌన్ సర్కిల్‌లో విలీనం చేసి పంథం వెగ్గించుకున్నారు. అందుకు యూనియన్ నాయకుల భాగస్వామ్యులను చేస్తూ యూనియన్ ప్రొటెస్ట్ లెటర్స్ తప్పనిసరి నిబంధనలు పెట్టారు. ఆ లెటర్‌కు డిమాండ్ పెరగడంతో ఆ లెటర్స్‌కు వేలం వేసి బదిలీలకు ప్రాధాన్యం ఇవ్వడం వివాదస్పదంగా మారింది. అయితే ఈ పాప పరిహారం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించడం కరీంనగర్ జిల్లా విద్యుత్ శాఖలో కలకలం రేపుతుంది.

వివరాల్లోకి వెళితే... కరీంనగర్ జిల్లా ఎన్‌పీడీసీఎల్ కార్యాలయం వివాదాలకు, వింతపోకడలకు నిలయంగా మారింది. అది ఓ ప్రభుత్వ కార్యాలయం అనే విషయాన్ని మర్చిపోయిన అధికారులు ప్రత్యేక విధానాలు అమలు చేస్తూ వివాదాస్పదంగా మారుతున్నారు. ఏళ్ల తరబడి పాతుకుపోయిన ఉద్యోగులే ఈ పరిస్థితికి ప్రత్యేక కారణం కాగా అక్కడ పనిచేస్తున్న ఆఫీస్ బాస్ కూడా ఆ కోవకు చెందినవాడే కావడం మరింత బలాన్ని చేకూరుస్తుంది. దీంతో అందులో పెద్ద సార్ ఏం చెబితే అదే వేదం అన్నట్లు సిబ్బంది వ్యవహరిస్తున్నారు. ఏళ్ల తరబడి ఒకే చోట పనిచేస్తున్న అధికారులు బదిలీల నుంచి తప్పించుకునేందుకు ప్రత్యేక విధానాలు అవలంభిస్తున్నారు.

అందుకు జిల్లా బాస్ ఓకే అనడంతో కొత్త నిబంధనలు చకచకా అమలవుతున్నాయి. ఏదో సాకు చెప్పి ఉన్నతాధికారులను సైతం బురిడీ కొట్టించడంలో ఆయనకు ఆయనే దిట్ట కావడం కిందిస్థాయి సిబ్బందికి భరోసా కలిగిస్తుండగా తన చెప్పుచేతల్లో ఉండేందుకు చుట్టూ ప్రత్యేక కోటరినే తయారు చేసుకున్నాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన కోటరీలో ఉన్న అధికారులపై ఫిర్యాదులు అందినా, విమర్శలు వెల్లువెత్తిన వాటిని బయటకు రాకుండా తొక్కి పడేస్తూ తన అనుకున్న వారికే తన కార్యాలయంలో పెద్దపీట వేసి అన్ని విషయాల్లో వారితోనే చక్రం తిప్పేస్తారు.

ఆయన అనుకుంటే రూల్స్ పాటించకున్నా పట్టించుకోడు అవసరమైతే ప్రత్యేక రూల్స్ రూపొందించి అమలు చేస్తాడు. ఇప్పుడు తాజాగా తన కోటరిని కాపాడుకునేందుకు బదిలీల్లో కొత్త నిబంధనలు అమలు చేసి రూరల్ సర్కిల్‌ను టౌన్ సర్కిల్లో విలీనం చేసి వివాదాల్లో ఇరుక్కున్నాడు. తాను సంవత్సరాల తరబడి పాతుకుపోవడమే కాక తన అనుయాయులకు కాపాడుకునేందుకు యూనియన్లను సైతం ప్రభావితం చేస్తూ యూనియన్ ప్రోటెస్ట్ లెటర్స్‌ను వేలం పాటలో అమ్మకానికి పెట్టి కొత్త పద్దతికి తెరలేపాడు. తద్వారా బదిలీల్లో రూ.లక్షలు చేతులు మారేందుకు కారణం కాగా, ఆ పాప పరిహారం కోసం ప్రభుత్వ కార్యాలయంలో చండీ హోమం నిర్వహించి చరిత్రకెక్కారు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ నార్తన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ జిల్లా బాస్.

పాతుకుపోయిన ఉద్యోగులు..

గడిచిన నాలుగేళ్లుగా ఇక్కడే జిల్లా బాస్‌గా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్న కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ నార్తన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ జిల్లా బాస్ ప్రభుత్వ నిబంధనలు కాదు ప్రత్యేక పద్ధతులను అమలుచేస్తున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఆయన కనుసన్నల్లో అన్ని పనులు జరిగిపోతుండడం అక్కడ షరా మామూలే’ అన్నట్టు సాగుతుంది. ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్న సదరు బాస్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాడు. ప్రభుత్వ కార్యాలయం మీటింగ్ హాల్ లో చండీ హోమం నిర్వహించి వింత ఆచారాలకు తెరలేపాడు.

వాస్తవంగా అది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం..

ఎందుకంటే ఏ మతానికి సంబంధించిన కార్యకలాపాలు ప్రభుత్వ కార్యాలయాల్లో జరగరాదని ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఉంది. అయినప్పటికీ అధికారిక కార్యక్రమంలా హోమం చేయడం వివాదాస్పదంగా మారి ఇప్పుడు అది విద్యుత్ శాఖలో దుమారం రేపుతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇటువంటి కార్యకలాపాలు నిర్వహించొద్దని తెలిసినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం వివాదాస్పదంగా మారింది. ఈ హోమం కోసం ఉద్యోగుల నుంచి డబ్బు వసూలు చేసి మరీ నిర్వహించడం ఆ అధికారిని చిక్కుల్లో పడేసింది. అయితే ఉద్యోగుల్లో అన్ని మతాలకు చెందిన వారు ఉంటారు. కానీ కేవలం హిందూ మత పండుగలు మాత్రమే నిర్వహిస్తూ ముస్లిం, క్రిస్టియన్ పండుగలను మాత్రం నిర్వహించకపోవడం ఏమిటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బదిలీల్లో ప్రత్యేక విధానం..

ఈ మధ్య కాలంలో ఉద్యోగుల ప్రమోషన్స్, బదిలీల ప్రక్రియకు ప్రభుత్వం స్వీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బదిలీల్లో సైతం చక్రం తిప్పిన బాస్ ప్రత్యేక నిబంధనలు అమలు చేసి ప్రభుత్వానికే పరీక్ష పెట్టాడు. ఏళ్ల తరబడి పాతుకుపోయిన ఉద్యోగులకు వంతపాడుతూ జిల్లా కేంద్రానికి రావాలనే ఉద్యోగుల ప్రయత్నాలకు నో ఎంట్రీ బోర్డు పెట్టేశాడు. అందుకు ప్రత్యేక రూల్స్ విధించగా రూ.లక్షలు చేతులు మారినట్లు ఆ శాఖలో ప్రచారం జోరందుకుంది. అందుకు యూనియన్ నాయకులను సైతం భాగస్వాములను చేశాడంటే ఆయన చతురత ఏ పాటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉద్యోగుల బదిలీల్లో యూనియన్ ప్రొటెస్ట్ లెటర్స్ ఇచ్చిన వారికే ప్రాధాన్యత అనడంతో యూనియన్ లెటర్లకు ప్రాధాన్యత పెరిగి వేలం వేసే స్థాయికి వచ్చిందంటే ఇక్కడ ప్రభుత్వ నిబంధనలు కాదు ప్రత్యేక పద్ధతుల అమలుకు అద్దం పడుతోంది.

ఇదే అదనుగా భావించిన అధికారి తన కార్యాలయానికి ఉద్యోగులను పిలిపించుకొని యాగానికి డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెద్ద సారు అడగడమే ఆలస్యం అసలే బదిలీల సమయం కావడంతో ఎక్కడా అడ్డు వస్తుందోనని ఉద్యోగులు పోటీపడి డబ్బులు అందజేసినట్లు తెలుస్తోంది. కార్యాలయంలో జరిగిన చండీహోమం, ఉద్యోగుల బదిలీల ప్రక్రియలో జరిగిన అక్రమాలన్నింటిపై పూర్తిస్థాయి విచారణ చేపడితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే పలు కారణాలతో బదిలీల ప్రక్రియ పూర్తయినప్పటికీ ఆర్డర్లు ఆగిపోవడంతో పైరవీ చేసుకున్న అధికారుల గుండెల్లో గుబులు మొదలైంది.

Advertisement

Next Story