మధ్యాహ్నం 2 గంటలకే చీకటి.. దేవుడు లేకుండా గుడి.. తెలంగాణలో వింత గ్రామం

by Sathputhe Rajesh |
మధ్యాహ్నం 2 గంటలకే చీకటి.. దేవుడు లేకుండా గుడి..  తెలంగాణలో వింత గ్రామం
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: శతాబ్దాల చరిత్ర ఉన్న ఆ గ్రామంపై సూర్యుడి కనికరం మాత్రం కాస్త తక్కువే. పచ్చదనంతో కూడిన ఆ ఊరిని గంట ఆలస్యంగా తట్టిలేపే సూర్య భగవానుడు.. రెండు గంటల ముందుగానే బై చెప్పి వెళ్లిపోతాడు. అంటే అన్ని గ్రామాలు నాలుగు జాముల కాలాన్ని అనుభవిస్తే.. సూర్యుడి శీతకన్నుతో ఈ గ్రామస్తులు మాత్రం మూడు జాములతోనే కాలం వెల్లదీస్తున్నారు. ఇంతకీ ఈ గ్రామం ఏంటి? ఈ వైవిద్యానికి కారణమేంటి? తెలుసుకుందాం.

విలేజి స్పెషాలిటీ...

చుట్టూగుట్టలు విస్తరించి ఉన్న పెద్దపల్లి జిల్లా కొదురుపాకకు ప్రకృతితో ప్రత్యేక అనుబంధం ఉంది. శతాబ్దాల క్రితమే వెలిసిన ఈ గ్రామం అత్యంత అరుదైన గ్రామాల సరసన నిలుస్తోంది. పాముబండ గుట్ట, గొల్లగుట్ట, రంగనాయకుల గుట్ట, దేవునిపల్లి గుట్ట అని పిలువబడే నాలుగు గుట్టల నడుమ ఈ ఊరు ఉంది. గ్రామం చుట్టూ విస్తరించిన గుట్టల కారణంగా సూర్యోదయం ఆలస్యంగా జరగడం, సూర్యాస్తమయం తొందరగా ప్రారంభం అవుతోంది. గుట్టల వల్ల సూర్యుడు గంట ఆలస్యంగా వెలుతురునిస్తే, సాయంత్రం రెండు గంటల ముందు అస్తమించినట్టుగా ఉంటుంది. గుట్టల నీడతో గ్రామంలో చీకటి అలుముకున్నట్టుగా ఉంటుంది. సగటున మూడు గంటలకో జాము లెక్కన రోజును 8 జాములుగా విభజించారు. అయితే సూర్యుడు ఉదయించడం నుంచి అస్తమించే వరకు అన్ని ప్రాంతాల వారు నాలుగు జాముల జీవనం కొనసాగిస్తుండగా.. కొదురుపాక గ్రామస్థులు మాత్రం మూడు జాములతోనే సరిపెట్టుకుంటున్నారు. ఈ కారణంగానే ఈ గ్రామానికి మూడు జాముల కొదరుపాక అని పేరు వచ్చింది. శతాబ్దాల కాలంగా ఇదే కొనసాగుతుండడంతో ఇక్కడి ప్రజలు కూడా అలవాటు పడిపోయారు. రంగనాయకుల గుట్టను ఆనుకుని ఉన్న ప్రాంతం వారు దీంతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తుండగా.. మరో ప్రాంతానికి వెళ్లి ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం.

స్థిరమైన భూగర్భజలాలు

ఇక్కడ భూగర్భ జలాలకు ఢోకా లేదని గ్రామస్థులు తెలిపారు. పురాతన కాలంలో గుట్టపై నిర్మించిన కోనేరులో అన్ని కాలాల్లోనూ నీరు ఉంటుందని వివరించారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణలో కరువు విలయతాండవం చేసినా.. కోనేరులో మాత్రం నీరు ఎండిపోలేదని వివరించారు. గుట్ట మీదుగా వచ్చే ఊటతో పాటు పైన నీరు నిలువ ఉండడం వల్లే ఇక్కడ భూగర్భ జలాలు స్థిరంగా ఉంటున్నాయని చెబుతున్నారు.

దేవుడు లేని గుడి

మూడు జాముల కొదురుపాక గ్రామానికి మరో స్పెషాలిటీ కూడా ఉంది. రంగనాయకుల గుట్టకు దిగువన నిర్మించిన ఆలయంలో దేవుడు మాత్రం ఉండడు. ఏడాదికి ఒక సారి మాత్రమే ఈ ఆలయంలో దేవుడు దర్శనమిస్తాడు. దసరా పండగ సందర్భంగా జరిగే వేడుకకు మాత్రం దేవునిపల్లి నుంచి నంబులాద్రి నరసింహస్వామి ఇక్కడకు చేరుకుంటాడు. గ్రామస్థులు రథయాత్రతో స్వామిని తీసుకొచ్చి ఈ ఆలయంలో ఒకరోజు ఉత్సవాలు జరిపిన తర్వాత తిరిగి దేవునిపల్లికి చేరుకుంటాడు. విజయదశమి నాడు గ్రామస్థులు అంగరంగ వైభవంగా నంబులాద్రి స్వామికి పూజలు నిర్వహించి, వేడుకలు జరపడం తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ.

కొత్త వాళ్లు పరేషాన్

గ్రామానికి కొత్తగా వచ్చే వారు తప్పకుండా ఆశ్చర్యానికి గురవుతారు. ఇది మాకు కామన్ అయిపోయింది. సాయంత్రం వేళల్లో కొదురుపాకకు చేరుకునే వారిలో చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. మరో గ్రామం నుంచి సాయంత్రం వేళ బయలుదేరినవారు.. గంటలో కొదురుపాక చేరుకున్నా ఇక్కడ చీకట్లు అలుముకోవడాన్ని చూసి ప్రశ్నిస్తుంటారు. గ్రామం చుట్టూ ఉన్న గుట్టలు.. సూర్య కిరణాలు పడకుండా అడ్డుకోవడంతో రెండు గంటల ముందే చీకటి పడుతుంది. దీనివల్ల సాయంత్రం పూట ఊరికి వచ్చేవారు ఆశ్చర్యానికి గురవుతుంటారు- నరేష్, గ్రామస్థుడు

Advertisement

Next Story