పని చేతకాకపోతే ఇక్కడి నుంచి వెళ్లిపో...

by Sridhar Babu |
పని చేతకాకపోతే ఇక్కడి నుంచి వెళ్లిపో...
X

దిశ, వెల్గటూర్ : కార్తీక పౌర్ణమి సందర్భంగా కోటిలింగాలలో భక్తుల కోసం చేసిన ఏర్పాట్లు సరిగా లేవని ఈఓ కాంతా రెడ్డి పై ప్రభుత్వ విప్​ లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు. పని ఒత్తిడి ఎక్కువైతే ఈ టెంపుల్ వదిలి మరో టెంపుల్ చూసుకోవాలని హెచ్చరించారు. ఈ విషయాన్ని అక్కడి నుంచే దేవాదాయ కమిషనర్ కు ఫోన్ ద్వారా తెలియజేశారు.

త్వరలో ఆలయాన్ని సందర్శించి ఇక్కడ చేయాల్సిన ఏర్పాట్లపై ప్రణాళిక సిద్ధం చేసి ఇవ్వాలని కమిషనర్​కు సూచించారు. పెద్ద సంఖ్యలో వచ్చే భక్తుల కోసం చేయాల్సిన ఏర్పాట్లపై ఇంతగా నిర్లక్ష్యం వహించడం సరైంది కాదన్నారు. కనీస వసతులు కూడా కల్పించడంలో శ్రద్ధ పెట్టకపోవడం ఏంటని ప్రశ్నించారు. మహిళలు బట్టలు మార్చుకోవడానికి సరైన ఏర్పాట్లు చేయకపోవడం, ఎండ నుండి భక్తులు సేద తీరేందుకు టెంట్లు వేయక కపోవడం, పారిశుద్ధ్యం సరిగా లేకపోవడం లాంటి వాటిపై ఆలయ అధికారిపై మండిపడ్డారు.

ఆదాయం ఉన్నా అభివృద్ధి ఎందుకు చేయటం లేదు

టెంపుల్ కు వచ్చే భక్తులతో పాటు కోటిలింగాలకు వచ్చే పర్యాటకుల నుంచి పార్కింగ్ పేరుతో నెలనెలా లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని, అయినా అభివృద్ధి ఎందుకు చేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టెంపుల్ కు కూడా భక్తుల నుంచి ఆదాయం వస్తుందని, ఈ ఆదాయం అంతా ఎక్కడికి పోతుందని ఈఓ కాంతారెడ్డిని ప్రశ్నించారు.

దాంతో పార్కింగ్ ఆదాయానికి తమకు సంబంధం లేదని, అది గ్రామపంచాయతీ చూసుకుంటుందని ఈఓ చెప్పగా అక్కడి నుండే డీపీఓ కు ఫోన్ చేసి గత ఐదు సంవత్సరాలలో ఎన్ని లక్షల రూపాయలు పార్కింగ్ పేరుతో వసూలు చేశారని, ఆ నిధులను ఎలాంటి అభివృద్ధి పనులకు వినియోగించారో తక్షణమే తనకు వివరాలు తెలియజేయాలని ఆదేశించారు. అలాగే టెంపుల్ ఆదాయ వివరాలు ఈఓను కనుక్కొని మరి కొంతమంది స్కావెంజర్స్ ను నియమించి పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఇక్కడికి వచ్చే భక్తులకు కావలసిన వసతుల కల్పనపై మరోసారి ఇలాంటి నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కోటిలింగాలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా

శాతవాహనుల తొలి రాజధానిగా మహా శైవ క్షేత్రంగా చరిత్ర పుటల్లో నిలిచిన కోటిలింగాలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని విప్​ అన్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని శుక్రవారం కోటిలింగాల కోటేశ్వరస్వామి ఆలయానికి రాగా ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలుకారు. ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిధులు విడుదలకు కృషి చేసి కోటిలింగాలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. స్థానిక నాయకులు, భక్తులతో కలిసి ఆలయ పరిసరాలలో గోదావరి తీరం వెంట పర్యటించి అనంతరం స్థానిక నాయకులతో కలిసి బోటింగ్ చేశారు.

గత ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉండి కోటిలింగాల చారిత్రక ప్రదేశాన్ని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. అప్పటి నాయకులు పర్యాటక కేంద్రం చేస్తానని మాట ఇచ్చి మరిచిపోయారని అన్నారు. గతంలో జరిపిన పురావస్తు తవ్వకాల్లో వెలువడిన అవశేషాలతో కూడిన మ్యూజియంను ఇక్కడ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని, ఈ ప్రదేశం గొప్పతనాన్ని శాతవాహనుల వారసత్వ సంపదను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్తానన్నారు. అలాగే కోటేశ్వర స్వామి శైవ క్షేత్ర మహత్యంను మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకువెళ్లి ఆలయ అభివృద్ధి కోసం నిధులు విడుదలకు కృషి చేస్తామన్నారు. త్వరలో సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చే భక్తుల కోసం వసతుల కల్పనకు చర్యలు చేపడతామన్నారు. ఆయన వెంట శైలేందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, శ్రీకాంత్ రావు, మురళి, సందీప్ రెడ్డి, రమేష్, నరేష్, సాయి ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed