నేతన్నల బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

by Disha Web Desk 23 |
నేతన్నల బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
X

దిశ,రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : నేత కార్మికులకు చెల్లించాల్సిన బకాయిల్లో రూ.50 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెండింగ్ లో ఉన్న మిగతా బకాయిలను కూడా వీలైనంత తొందరలోనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గత ఏడాది బతుకమ్మ చీరలకు సంబంధించి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు రూ.351 కోట్ల బిల్లులు చెల్లించకుండా బకాయి పెట్టిన విషయం తెలిసిందే. దీంతో వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి కూరుకుపోయి వేలాది కార్మిక కుటుంబాలు ఆందోళనకు గురయ్యారు. సిరిసిల్లలో నేత కార్మికులు వరుసగా ఆందోళనలు చేయడంతో పాటు బకాయిలను చెల్లించి తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

మంత్రి పొన్నం ప్రభాకర్, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి పలుమార్లు సిరిసిల్ల కార్మికులు, ఆసాములతో చర్చలు జరిపారు. కార్మికుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని బకాయిలు విడుదల చేయాలని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే బకాయిలను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్థిక వెసులుబాటును దృష్టిలో పెట్టుకొని బకాయిలను క్లియర్ చేయాలని సూచించారు. నేతన్నలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని, ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించేలా ఏర్పాట్లు చేస్తుందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం గడిచిన మూడు నెలల్లో సమగ్ర శిక్షా అభయాన్ యూనిఫామ్ల తయారీకి సుమారు రూ. 47 కోట్లు అడ్వాన్సుగా చెల్లించింది. నూలు కొనుగోలు, సైజింగ్ కు రూ. 14 కోట్లు విడుదల చేసింది. వీటితో పాటు గతంలో ఉన్న బకాయిలకు సంబంధించి రూ.50 కోట్లు చెల్లింపునకు సీఎం తీసుకున్న నిర్ణయం నేత పరిశ్రమకు ఊరటనిచ్చినట్లయింది. దీంతో నేత కార్మికులు, ఆసాములు హార్షం వ్యక్తం చేస్తున్నారు. మిగతా బకాయిలను కూడా దఫ వారీగా వెంటనే చెల్లించాలని కోరుతున్నారు.

Next Story

Most Viewed