ప్రభుత్వ టీచర్ల ప్రైవేటు దందా

by Mahesh |   ( Updated:2023-06-26 03:21:15.0  )
ప్రభుత్వ టీచర్ల ప్రైవేటు దందా
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైంది. అటువంటి వృత్తిలో ఉన్న టీచర్లకు, లెక్చరర్లకు సమాజంలో గౌరవ మర్యాదలకు ఏ మాత్రం కొదవ లేదు. అందులోనూ ప్రభుత్వ ఉపాధ్యాయులు అంటే మరీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ టీచర్లు అంటే ప్రత్యేక గౌరవం తో పాటు స్థానికంగా నైనా.. వారు పని చేసే చోట అయినా అపార నమ్మకం, గౌరవ మర్యాదలు లభిస్తాయి. అటువంటి ఉన్నత ఉద్యోగంలో ఉన్న కొంతమంది ప్రభుత్వ టీచర్లు వృత్తి ధర్మాన్ని వీడి స్వయం ఎదుగుదలకే అధిక ప్రాధాన్యం ఇస్తూ ప్రైవేట్ దందాలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దారి తప్పిన విద్యార్థులను గాడిలో పెట్టె టీచర్లే ఇలా అక్రమ దందాలు చేస్తూ దారి తప్పుతున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. స్థానికంగా వారిపై ఉన్న నమ్మకాన్ని ఆసరాగా చేసుకున్న కొంతమంది టీచర్లు రూల్స్‌కు విరుద్ధంగా ప్రైవేట్ దందాలు చేస్తున్నారనేది బహిరంగ రహస్యమే అని చెప్పాలి. ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే ఇటువంటి కొంతమంది గవర్నమెంట్ టీచర్లు వ్యవహరిస్తున్న తీరు మాత్రం వివాదాస్పమవుతుంది.

ప్రైవేట్ దందాలే ఎక్కువగా..

జిల్లాలో ఉన్న కొందరు ప్రభుత్వ టీచర్లు కాసుల కక్కుర్తి కోసం ప్రైవేట్ వ్యాపారల బాట పడుతున్నారు. ఊరూరా జోరుగా సాగుతున్న చిట్టీల వ్యాపారంలో సగానికి పైగా నిర్వాహకులు ఈ టీచర్లే ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో చిట్టీలు వేసేందుకు జనం నమ్మకం తో ముందుకు వస్తున్నారు. వాస్తవానికి చిట్టీలు నిర్వహించానుకునే వారు ముందుగా చిట్‌ఫండ్స్‌ యాక్ట్ 1982 ప్రకారం జిల్లా చిట్స్‌ రిజిస్ట్రార్‌ శాఖ నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. కానీ, ఎటువంటి అనుమతులు లేకుండానే చిట్టీల వ్యాపారం నిర్వహిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా మరి కొందరు గవర్నమెంట్ ఉపాధ్యాయులు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దూసుకెళ్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు వారి బంధువులే టార్గెట్‌గా వ్యాపారాలు నిర్వహిస్తూ అనుమతులు లేని వెంచర్లలో ప్లాట్లు కొనిపిస్తున్నారు. ఇవి మాత్రమే కాకుండా వడ్డీ వ్యాపారాలు సైతం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రైవేట్ స్కూళ్లలో పెట్టుబడులు..?

జిల్లా కేంద్రంలో కొంతమంది ప్రభుత్వ టీచర్లు బినామీల పేరుతో ప్రైవేట్ స్కూల్స్ నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లను పెంచాల్సిన బాధ్యతను మరచి వారికున్న పలుకుబడితో సొంత స్కూళ్లలో అడ్మిషన్లు పెంచుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి వారికి కొంతమంది రాజకీయ నాయకుల అండదండలు కూడా తోడవడంతో మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా వీరి వ్యాపారం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటువంటి స్కూళ్లలో నిబంధనలకు విరుద్ధంగా నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్ వంటివి ప్యాకేజీ రూపంలో అమ్ముతున్నట్లుగా సమాచారం. అయితే ఇదంతా సంబంధిత అధికారులకు తెలిసినప్పటికీ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

యూనియన్ల ముసుగులో స్కూళ్లకు డుమ్మా..

ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారంలో యూనియన్ల పాత్ర అత్యంత కీలకమైంది. విద్యాశాఖలో యూనియన్లు ఎక్కువగానే ఉండగా ఈ సంఘాలు అన్ని ఎక్కువగా సమస్యల పరిష్కారానికి ఫైట్ చేస్తూ వస్తున్నాయి. అయితే కొంతమంది టీచర్లు ఈ సంఘాల ముసుగులో స్కూళ్లకు డుమ్మా కొడుతున్నట్లు తెలుస్తోంది. యూనియన్ల పేరు చెప్పి కనీసం పాఠశాలల వైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు ఉన్నాయి. ఒకవేళ వచ్చినా థంబ్ వేసి వెళ్లిపోతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇలా సంఘాల ముసుగులో చదువులు చెప్పడం మానేసి సొంత వ్యాపారాల్లో బిజీ అవుతున్నారు. మరికొందరు టీచర్లు అయితే ఏకంగా సెలవు పెట్టకుండానే పొలిటికల్ ప్రోగ్రామ్స్‌లో ప్రత్యక్షమవుతున్నారు.

మామూళ్ల మత్తే కారణమా..?

జగిత్యాల జిల్లాలో ఓ ప్రభుత్వ టీచర్ లాంగ్ లీవ్ పెట్టిమరి ప్రైవేట్ స్కూళ్లు రన్ చేస్తున్నాడనే ఆరోపణలు ఉండగా మరొక ఉపాధ్యాయుడు పొలిటికల్ పార్టీలో తిరుగుతుండడం పలు వివాదాలకు తావిస్తోంది. గతంలో కోరుట్ల నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో హెడ్ మాస్టర్ రూ.2500 కు ప్రైవేట్ బుక్స్ అమ్మడం వంటి ఘటనలు చర్చనీయంశంగా మారాయి. ఇటువంటి ప్రైవేట్ దందాలు చేసే టీచర్లు నెల నెలా మామూళ్లు ఇవ్వడంతో వారి వైపు కన్నెత్తి చూడరనే విమర్శలు ఉన్నాయి. అయితే వెలుగులోకి వచ్చిన ఘటనలలో కూడా అధికారులు చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటువంటి సంఘటనలపై విద్యార్థి సంఘాల నాయకులు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed