రైతో.. వర్షార్పణం...

by Sumithra |
రైతో.. వర్షార్పణం...
X

దిశ, మల్లాపూర్ : భూమిని నమ్ముకుని, పట్టెడన్నం పెట్టే రైతు వాతావరణం అనుకూలించక దిగులు చెందుతున్నారు. రైతు కష్టం వెల కట్టలేనిది. రైతే రాజు, రైతు లేనిదే రాజ్యం లేదు అనే నినాదాలు సినిమాల్లోనే హిట్ అవుతాయి. నిజజీవితంలో అవి సాధ్యం కావు. గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడిపోతున్న సమయంలో వర్షం కురవడంతో కుదేలవుతున్నారు. ఈ సంవత్సరం రైతులకు గడ్డు కాలం నడుస్తుంది. అధిక వర్షాలతో వానాకాలం పంటల దిగుబడి లేకపోవడం, ఇప్పుడు యసంగి పంటలు చేతికి వచ్చే సమయంలో భారి వర్షం కురవడం వల్ల తీవ్ర నష్టం కలిగింది. గాలి అధికంగా వియడంతో మిర్చి రైతులకు తీవ్ర నష్టం కలిగింది. చేతికి వచ్చిన పంట నేలరాలడంతో రైతులకు దుఖం మిగిలింది. రైతులకు లాభాలు దేవుడెరుగు వరి సాగుకు పెట్టిన పెట్టుబడి కూడా రాదు. ఈ సారి వరి పంటకు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో రైతులు 3 నుంచి 4 సార్లు పురుగుమందు స్ప్రే చెయ్యవలసి వచ్చింది.

వరి పంట కాపాడుకోవడానికి అధిక పెట్టుబడి పెట్టి సాగు చేస్తే ఇలా వర్షార్పణం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ వడ్లు మాత్రం తూకం వేయడం లేదు చేతికి వచ్చిన పంట కళ్ళముందే వర్షానికి తడిసిపోతుంటే రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎండ్ల తరబడి రైతులు నష్టాలే వస్తున్న వ్యవసాయం మాత్రం వదలడం లేదు. విత్తనం నుండి మొదలుకొని సాగు, కూలీల, పురుగు మందుల ఖర్చు విపరీతంగా పెరిగింది. ఇవన్నీ దిగమింగి వ్యవసాయం చేస్తే చివరికి నష్టాలు మిగులుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం 2014లో రుణమాఫీ ప్రకటించిన తర్వాత కొంతమంది రైతులు తమ క్రాప్ లోన్ రెన్యువల్ చేసుకోవడం లేదు. అధిక వడ్డీ భారం పెరిగిపోగా సబ్సిడీ వర్తించక రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిలిస్తుంది. రుణమాఫీ హామీగానే మిగిలిపాయే.. రైతు కష్టం తీరకపాయే...నష్ట పరిహారాన్ని అందించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుంది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించి, రైతులను ఆదుకుంటామని, ఎకరానికి 10 వేల రూపాయల నష్టపరిహారాన్ని చెల్లిస్తామని తెలిపారు. ఇప్పటి ఎంత నష్టం వాటిల్లిందని కనీసం అంచనా కూడా ఏయ్యలేదు. విధివిధానాలు ఖరారు చేయలేదు.

పసుపు బైలింగ్ సమయం..

పసుపు పంట చేతికి వచ్చిన రైతులకు తిప్పలు తప్పడం లేదు. పసుపు ఇప్పుడు బైలింగ్ చేసిన రైతులకు అకాల వర్షాలు కురవడంతో పసుపు తడిసింది. మార్కెట్ లో రేటు తక్కువగా ఉంది. ఇప్పుడు ఇంకా రేటు తక్కువగా పలికే అవకాశం ఉంటుంది.

Advertisement

Next Story