గోల్డ్ లోన్ లో గోల్ మాల్

by Sridhar Babu |
గోల్డ్ లోన్ లో గోల్ మాల్
X

దిశ, శంకరపట్నం : గోల్డ్ లోన్ లో గోల్ మాల్ జరిగినట్టు బాధితులు ఆరోపించారు. ఇండియన్ బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి రుణాన్ని తీసుకొని మొత్తం డబ్బులు చెల్లించాక ఆభరణాలను చూస్తే రెండు గాజులు తక్కువగా ఉండటంతో ఖాతాదారులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే శంకరపట్నం మండలంలోని మొలంగూరులోని ఇండియన్ బ్యాంకులో కందుల విజయ అనే మహిళ వ్యక్తిగత అవసరం కోసం తనకు ఉన్న బంగారు ఆభరణాలైన సాదా నక్లెస్, రెండు గాజులు, ముత్యాల నక్లెస్, జత కమ్మలు, గున్నాలు, మాటీలు, ఉంగరం, జత కమ్మలు మొత్తం 114.5 గ్రాములుగా బ్యాంకు సిబ్బంది తూకం వేసి రూ. 2 లక్షల 95 వేల రుణాన్ని ఇచ్చారు. మంగళవారం రుణం మొత్తం చెల్లించి ఆభరణాలను సరి చూసుకోగా 6 గ్రాముల రెండు గాజులు లేవని బాధితురాలు బ్యాంకు మేనేజర్ ను నిలదీసింది.

వాస్తవంగా ఆభరణాల బరువు 129 గ్రాములు కాగా అప్పటి బ్యాంకులో బంగారం కొలతలు వేసిన వ్యక్తి 114.5 గ్రాములుగా నమోదు చేశాడని, అది బ్యాంకులో జరిగిన పొరపాటు అని మేనేజర్ తెలిపాడు. కానీ బాధితురాలు ఇంకా రెండు గాజులు (ఆరు గ్రాముల బంగారం) లేవని లబోదిబోమంది. మేనేజర్ ను ఈ విషయంపై వివరణ అడగగా బ్యాంకులో కుదవపెట్టిన ఆభరణాలు ఇచ్చామని, కానీ వాటి కొలతల్లో మాత్రం తేడా వచ్చిందని తెలిపారు. మిగతా విషయాలకు బ్యాంకుకు సంబంధం లేదని పేర్కొన్నారు. కొసమెరుపు ఏంటంటే తాము 114.5 గ్రాముల బంగారమే బ్యాంకులో పెట్టాము అని ఖాతాదారులు చెబుతుండగా, మీరు 129 గ్రాముల బంగారం కుదవపెట్టారని మేనేజర్ శ్రావణ్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్ పున్నం చందర్ తెలపడంతో గందరగోళం నెలకొంది. దీనిపై బుధవారం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని మేనేజర్​ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed