రైతు భరోసా ఎగ్గొట్టి.. రుణమాఫీ చేశారు..

by Sumithra |   ( Updated:2024-07-20 14:09:40.0  )
రైతు భరోసా ఎగ్గొట్టి.. రుణమాఫీ చేశారు..
X

దిశ, జగిత్యాల టౌన్ : రబీ, ఖరీఫ్ సీజన్లో ఇవ్వాల్సిన రైతు భరోసా సొమ్మును ఎగ్గొట్టి రుణమాఫీ చేశారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ అదే తరహాలో పాలన చేస్తుందని దుయ్యబట్టారు. రుణమాఫీలో కోతలు పెట్టి అర్హుల సంఖ్యను కుదించి పంట నష్ట పరిహారం ఇవ్వకుండా రైతులను రేవంత్ సర్కార్ గోస పెడుతుంది మండిపడ్డారు. 40 లక్షల పైచిలుకు రైతులు రూ.లక్ష వరకు రుణాలు తీసుకుంటే కేవలం 11 లక్షల మందినే అర్హులుగా ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు.

ఈ ఏడాది జూన్ నెలలో ఇవ్వాల్సిన రైతుబంధు డబ్బులను దారి మళ్ళించి ఆ నిధుల నుంచి 7 వేల కోట్ల రూపాయలను రుణమాఫీకి వినియోగించారని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే రైతులందరికి రుణమాఫీ, రైతుబంధు లబ్ది చేకూరిందని తెలిపారు. పదేళ్లుగా రేషన్ కార్డుల జారీ ప్రక్రియ లేకపోవడం వల్ల కుటుంబాల నుండి వేరుగా ఉన్న రైతులు నష్టపోయే అవకాశం ఉందన్నారు. కాబట్టి రేషన్ కార్డుతో సంబంధం లేకుండా పట్టా పాస్ బుక్ ఉన్న ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story