అన్నదాతలు అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం : మంత్రి గంగుల కమలాకర్

by Shiva |
అన్నదాతలు అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం : మంత్రి గంగుల కమలాకర్
X

దిశ, కరీంనగర్: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం కొనుగోలులో అలస్యానికి తావు లేకుండా వేగవంతంగా కొనుగోలు చేస్తామని బీసి సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా బొమ్మకల్, దుర్శేడ్ గ్రామల్లో అకాల వర్షాలతో నష్టపోయిన పంటలను, గోపాలపూర్ లో నష్టపోయిన ఉద్యాన పంటలను జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ తో కలిసి మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గడిచిన వంద సంవత్సరాల చరిత్రలో మొదటి సారి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ఊహించని విధంగా అకాల వర్షాలు కురిసి పండించిన పంటలు తీవ్రంగా నష్టపోవడం జరిగిందన్నారు. ఇప్పటికే అకాలవర్షాలతో పంటను నష్టపోయిన రైతులను ఆదుకునే దిశగా సీఎం కేసీఆర్ ఎకరానికి పదివేల పంటనష్టం పరిహరాన్ని ప్రకటించారని తెలిపారు. పౌర సరఫరాల శాఖ తరపున కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామన్నారు.

కొనుగోలు కేంద్రానికి రాక ముందే పంటను నష్టపోయినట్లయితే ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుందనే భరోసాను రైతులకు కల్పించారు. ధాన్యం ఆరబెట్టి తేమ వచ్చిన వెంటనే తిరిగి వర్షాలు పడి తేమ శాతం పడిపోతుండంతో ధాన్యం తేమను 17 శాతం నుండి 20 శాతానికి సడలించాలని ఎఫ్సీఐని కోరామని తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎక్కడా అలస్యం కాకుండా రైతులు, మిల్లర్లతో మాట్లాడుతున్నామని తెలిపారు. బాయిలర్ సౌకర్యం ఉన్నచోట ధాన్యాన్ని తరలించుకోవాలని సూచించడం జరుగుతుందని తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన సుమారు ఐదు వేల ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి సోమవారం సాయంత్రం వరకు దాదాపు రూ.1,350 కోట్ల విలువ గల 7.51 లక్షల వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. గతంలో మే నాటికి 3.30 లక్షల వేల మెట్రిక్ టన్నుల దాన్యం కొనుగోలు చేయగా, ఈసారి 7.51 లక్షల వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, ఆర్డీవో ఆనంద్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, సురేష్, అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story