ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత

by Shiva |
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత
X

భజరంగ్ దళ్ ను నిషేధిస్తే.. హిందువులపై నిషేధం విధించినట్లే : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి

దిశ, జగిత్యాల ప్రతినిధి : పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో భజరంగ్ దళ్ సంస్థను నిషేధిస్తామని ప్రకటించడంపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో బీజేపే రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జీవన్ రెడ్డి ఇంటి ముందు ఈ పార్టీ నాయకులు హనుమాన్ చాలీసా పారాయణం చేపట్టారు.

అయితే, పారాయణం చేస్తున్న వారిని పట్టణ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. హిందూ సంస్కృతి, సంప్రదాయాలను యావత్ ప్రపంచానికి చాటి చెప్పే భజరంగ్ దళ్ లాంటి సంస్థను నిషేధించడం అంటే హిందువులను నిషేధించడమేనని అన్నారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నాయకులకు దేవుడు మంచి బుద్ధి ప్రకటించాలనే హనుమాన్ చాలీసా పారాయణం చేపట్టినట్లు తెలిపారు.

హిందువుల మనోభావాలను పరిగణలోకి తీసుకొని కర్ణాటక కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాంబారి ప్రభాకర్, సునీత, డా. శైలేందర్ రెడ్డి, సురభి నవీన్ ,పన్నాల తిరుపతి , వీరబత్తినీ అనిల్,నలువాల తిరుపతి,వరుణ్,ఆముధ రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story