ఓటరు జాబితా సవరణ పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ సంగీత సత్యనారాయణ

by Shiva |
ఓటరు జాబితా సవరణ పకడ్బందీగా నిర్వహించాలి :  కలెక్టర్ సంగీత సత్యనారాయణ
X

దిశ, పెద్దపల్లి కలెక్టరేట్ : జిల్లాలో 2వ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ఎలాంటి పొరపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ అన్నారు. ఆదివారం రాత్రి సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ తహసీల్దార్లతో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. 2వ ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో ఎలాంటి పొరపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో 1 అక్టోబర్ 2023 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తమ వివరాలు నమోదు చేసుకునే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఉన్న బూత్ స్థాయి అధికారులు జూన్ 23 వరకు ఇంటింటి సర్వే నిర్వహించి అక్టోబర్ 1,2023 నాటికి 18 ఏళ్లు నిండే ఓటర్ల వివరాలు నమోదు, చనిపోయిన, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వలస ఓట్ల తొలగింపు పకడ్బందీగా చేపట్టాలన్నారు.

జూన్ 24 నుంచి జూలై 24 వరకు పోలింగ్ కేంద్రాల పరిశీలన, ఓటరు జాబితాలో సవరణలు, మొదలగు పనులు పూర్తి చేసి ఆగస్టు 2న డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదల చేయాలని కలెక్టర్ తెలిపారు. ఆగస్టు 2 నుంచి ఆగస్టు 31 వరకు ఓటరు జాబితా పై అభ్యంతరాలు, నూతన ఓటరు దరఖాస్తులను స్వీకరించాలని, శని, ఆదివారాలు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో ఓటర్ల జాబితా పై వచ్చిన అభ్యంతరాలు, నూతన ఓటరు నమోదు దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి సెప్టెంబర్ 22 లోపు పరిష్కరించాలని తెలిపారు.

అక్టోబర్ 4న తుది ఓటరు జాబితా తయారు చేయాలని కలెక్టర్ తెలిపారు. ఓటరు నమోదు కార్యక్రమం పకడ్బందీగా జరగాలని, బూత్ స్థాయి అధికారులను పోలింగ్ కేంద్రాల వద్ద ఉంచి దరఖాస్తులు తీసుకునే విధంగా తహసీల్దార్లు పర్యవేక్షించాలని తెలిపారు. మరణించిన ఓటర్లు, గ్రామం వదిలి వెళ్లిపోయిన వారు, ఓకే ఓటు రెండుసార్లు వచ్చిన వారి పేర్లను గుర్తించి నిబంధనల మేరకు నోటీసులు జారీ చేసి వివరాలు తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎలాంటి పొరపాట్లు లేని స్పష్టమైన నాణ్యత ఓటరు జాబితా తయారు చేసేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.

జిల్లాలో ఒక ఇంట్లో, ఒకే అపార్ట్ మెంట్ లో ఉన్న ఓటర్లందరికీ ఓకే పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటింగ్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఓటరు జాబితా నుంచి పేరు తొలగించే సమయంలో నిర్దిష్ట నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి వెంకట మాధవ్ రావు, మంథని రెవెన్యూ డివిజన్ అధికారి కె.వీరబ్రహ్మ చారి, తహసీల్దార్లు, ఎన్నికల డీటీ ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story