ఉమ్మడి జిల్లాలో బల్దియా రాజకీయాలు..!

by Javid Pasha |   ( Updated:2023-02-04 12:53:18.0  )
ఉమ్మడి జిల్లాలో బల్దియా రాజకీయాలు..!
X

దిశ, కరీంనగర్ బ్యూరో: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మునిసిపాలిటీల్లో అసమ్మతి రాజుకుంటోంది. ఇంతకాలం గుట్టు చప్పుడు కాకుండా ఉన్న అధికార పార్టీ కౌన్సిలర్లు తమ వ్యతిరేకతను వ్యక్తీకరించేందుకు అవిశ్వాస పల్లవిని ఎత్తుకుంటున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో రెండు మునిసిపాలిటీల్లో అవిశ్వాసం అంశాలు తెరపైకి రాగా తాజాగా మరో రెండు చోట్ల కూడా అసమ్మతి గళం విప్పేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు.

జమ్మికుంటలో..

అధిష్టానం కోర్టుకు చేరిన హుజురాబాద్ మునిసిపల్ రాజకీయాలపై ప్రతిష్టంభన అలాగే కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నియోజకవర్గంలోని జమ్మికుంటలో కూడా అసమ్మతి గళం విప్పేందుకు రంగం సిద్దమైంది. 30 మంది కౌన్సిలర్లకు గాను 25 మంది జట్టు కట్టి తమ గళాన్ని వినిపించే పనిలో నిమగ్నం అయినట్టు సమాచారం. ఈ మేరకు రహస్యంగా మంతనాలు జరుపుతున్న కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ కు అవిశ్వాసం నోటీసు ఇచ్చేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. జమ్మికుంట మునిసిపల్ చైర్మన్, వైస్ ఛైర్ పర్సన్ ఇద్దిరిపైనా తమ వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. నిధుల విడుదలతో పాటు ఇతరత్రా అభివృద్ది పనుల్లో ప్రాధాన్యత లేకుండా పోవడం తదితర కారణాలపై కౌన్సిల్ సభ్యులు తమ వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది కౌన్సిలర్లు అవిశ్వాసం నోటీసుపై సంతకాలు చేయగా మిగతా వారంతా సంతకాలు చేసిన తరువాత కలెక్టరేట్ లో సమర్పించనున్నారు. గతంలో ఇక్కడి నుండి ఛైర్మన్ పదవిని ఆశించిన పొనుగంటి మల్లయ్యను అప్పుడు ఈటల రాజేందర్ పోటీ నుండి తప్పించడం, కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావుకు బాధ్యతలు అప్పగించడం వల్ల తనకు అన్యాయం జరిగిందని మల్లయ్య వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అసమ్మతి వాదులందరిని ఏకతాటిపైకి తీసుకొచ్చే పనిలో పొనుగంటి మల్లయ్య వర్గం పడ్డట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది.

వేములవాడలో..

ఇకపోతే వేములవాడ మునిసిపాలిటీలోనూ ముసలం మొదలైనట్టుగా ప్రచారం జరుగుతోంది. ఎన్నికలప్పుడు కొండ శ్రీలతను మునిసిపల్ ఛైర్ పర్సన్ చేయాల్సి ఉన్నప్పటికీ అనూహ్య పరిణామాల నేపథ్యంలో మాధవి పేరు తెరపైకి వచ్చింది. మంత్రి కేటీఆర్ కూడా మాధవి అభ్యర్థిత్వానికి అనుకూలంగా ఉండడంతో చివరి క్షణంలో స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు కొండ శ్రీలతను ఒప్పించాల్సి వచ్చింది. దీంతో మాధవికి వ్యతిరేకంగా సుమారు 21 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం నోటీసు ఇచ్చేందుకు రంగం సిద్దం చేసుకున్నట్టుగా సమాచారం. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు లేవనెత్తిన అసమ్మతి గళానికి కాంగ్రెస్, బీజేపీ నాయకులు జట్టు కట్టడంతో వేములవాడ మునిసిపాలిటీలో కూడా అవిశ్వాసం తప్పేలా లేకుండా పోయింది. అధికారపార్టీకి చెందిన మరికొంత మంది కౌన్సిలర్లు కూడా ఛైర్ పర్సన్ మాధవి వర్గంలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం. దీంతో వేములవాడలోనూ అసమ్మతి గళం వినిపించేందుకు రంగం సిద్దమైనట్టుగా స్పష్టం అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed