BJP : బీసీలను ఘోరంగా మోసం చేసిన కాంగ్రెస్..

by Sumithra |
BJP : బీసీలను ఘోరంగా మోసం చేసిన కాంగ్రెస్..
X

దిశ, పెద్దపల్లి : అధికారంలోకి వచ్చిన ఆరు నెలల లోపే కులగణన చేసి బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని, ఇచ్చిన హామీని అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలం అయ్యిందని, భారతీయ జనతా పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల పట్ల చూపెడుతున్న వివక్షకు నిరసనగా సోమవారం పెద్దపల్లి తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మండల, పట్టణ అధ్యక్షులు మేకల శ్రీనివాస్, కావేటి రాజగోపాల్ ఇరువురు మాట్లాడుతూ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23 శాతం నుంచి 42 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్ కాంట్రాక్టుల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారన్నారు. అధికారంలో వచ్చిన వందరోజుల్లోనే రెండో దశ గొర్రెల పంపిణీకి సంబంధించి రూ.రెండు లక్షల రుణాన్ని లబ్ధిదారుని ఖాతాలో జమచేస్తామని ఇచ్చిన హామీ సైతం నెరవేరలేదని అభ్యంతరం తెలిపారు. బీసీ సబ్ ప్లాన్ కు తగిన నిధులు మంజూరు చేసేందుకు మొదటి అసెంబ్లీ సెషన్ లోనే చట్టబద్ధమైన హోదాతో జ్యోతిరావు పూలే బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి ఏడాదికి రూ.20వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి 8 నెలలు గడుస్తున్న నిధుల విషయం పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఎంబీసీ కులాలకు ప్రత్యేక సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు, అన్ని బీసీ కులాల సమగ్ర అభివృద్ధికి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీ యువతకు చిరు వ్యాపారాలు, ఉన్నత విద్య కోసం వడ్డీ లేకుండా, పూచీకత్తు లేకుండా రూ.పదిలక్షల రుణాలు ఇస్తామని చెప్పి మరిచిపోయారని దుయ్యబట్టారు.

బీసీ కుటుంబాల యువతకు ర్యాంకుతో సంబంధం లేకుండా మొత్తం ఫీజు రీఎంబర్సుమెంట్ 6 నెలల్లోగా ఇస్తామని ఇవ్వకుండా బీసీ యువతను ఉద్యోగాలకు అర్హత లేకుండా చేస్తున్నారన్నారు. మత్స్య సంఘాలకు చేప పిల్లల పంపిణీ చేయకుండా, బిడ్లు ఆహ్వానించి రూ.వందకోట్ల అవినీతికి తెరలేపారని ఆరోపించారు. ముదిరాజ్, గంగపుత్ర, గౌడ, మున్నూరుకాపు, పద్మశాలి, విశ్వకర్మ, రజక సామాజిక వర్గాలకు ఇచ్చిన హామీలన్నీ అలాగే ఉన్నాయని, కనీసం క్యాబినెట్లో నిర్ణయాలు తీసుకోలేదని పేర్కొన్నారు.

కామారెడ్డిలో ప్రకటించిన విధంగా ఓబీసీ డిక్లరేషన్ ప్రక్రియ ప్రభుత్వం వారం రోజుల్లో ప్రారంభించకపోతే లక్షల మంది బీసీలతో అన్ని కలెక్టరేట్లలో ధర్నాలు, నిరసనలు, దీక్షలు చేపడుతామని వారు హెచ్చరించారు. ఈ ధర్నాలో కార్యక్రమంలో నాయకులు పోల్సానీ సంపత్ రావు, కౌన్సిలర్ రాజ మహంతి కృష్ణ, జీవన్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీకాంత్, వేల్పుల రమేష్, సోడాబాబు, గాండ్ల రాజేశం, కుక్క వంశీ, పిట్ట వినయ్, గాదాసి సతీష్, ఉమేష్, తదితరులు పాల్గొన్నారు.



Next Story