బాల్యవివాహాలు చేస్తే చర్యలు తప్పవు : తహసీల్దార్ శ్రీనివాసరావు...

by Sumithra |   ( Updated:2023-04-13 12:12:48.0  )
బాల్యవివాహాలు చేస్తే చర్యలు తప్పవు : తహసీల్దార్ శ్రీనివాసరావు...
X

దిశ, శంకరపట్నం : బాల్య వివాహాలు, బాలలను చిత్రహింసలు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని శంకరపట్నం తహసీల్దార్ గూడూరు శ్రీనివాసరావు అన్నారు. గురువారం శంకరపట్నం మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమగ్ర బాలల పరిరక్షణ పథకం అవగాహన సదస్సును ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ అవగాహన సదస్సుకు హాజరైన తహసీల్దార్ శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 18 సంవత్సరాల లోపు బాలబాలికల హక్కుల రక్షణ కోసం, మెరుగైన సంరక్షణ కోసం, న్యాయ చట్టం 2000 ప్రకారం కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయ కర్తలుగా దేశమంతా బాలల పరిరక్షణ పథకాలను ప్రారంభించాయన్నారు.

బాలికలకు 18 సంవత్సరాల లోపు వివాహాలు చేయడం చట్ట ప్రకారం నేరం అన్నారు. బాల్య వివాహాలు చేస్తే అధికారులకు సమాచారం అందించాలని పురోహితులను, చర్చి పాస్టర్లను తహసిల్దార్ ఆదేశించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు బాలల పరిరక్షణ మండల కమిటీని ఏర్పాటు చేసినట్లు తహసిల్దార్ శ్రీనివాసరావు తెలిపారు. చైర్మన్ గా మండల పరిషత్ అధ్యక్షురాలు, సభ్యులుగా తాసిల్దార్, ఎంపీడీవో, ఎంఈఓ, వైద్య అధికారి, ఎస్సై, మండల సమైక్య, సాక్షర భారత్ ఎంసీఓ, స్వచ్ఛంద సంస్థలు కమిటీలో కొనసాగుతాయని, మండల పరిధిలో బాలలకు ఎలాంటి ఇబ్బందులు జరిగిన ఇబ్బందులకు గురిచేసిన నేరుగా సమాచారం అందిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎండీ ఖాజాబషీరోద్దీన్, మండల వైద్య అధికారి వేణుగోపాల్, ఐసీపీఎస్ మిషన్ వాత్సల్య అధికారి శాంతకుమారి, ప్రొహిబిషన్ అధికారి తిరుపతి, ఐసీడీఎస్ సూపర్వైజర్ స్రవంతి, పురోహితులు, చర్చి పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed