మున్సిపల్ చైర్ పర్సన్ పదవి కోసం బీఆర్ఎస్‌ ‘మహిళా కౌన్సిలర్ల పోరు’..

by Hamsa |
మున్సిపల్ చైర్ పర్సన్ పదవి కోసం బీఆర్ఎస్‌ ‘మహిళా కౌన్సిలర్ల పోరు’..
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కవిత మహిళలకు పెద్దపీట వేయాలంటూ 33 శాతం రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తుంటే కిందిస్థాయి పార్టీ వర్గాల్లో మాత్రం అందుకు పూర్తి వ్యతిరేకంగా కొనసాగుతుంది. జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ పదవి బీసీ మహిళకు కేటాయించినప్పటికీ గత రెండు నెలలుగా ఓసీకి చెందిన వైస్ చైర్మన్ గోల్ శ్రీనుకు పట్టం కట్టడం విమర్శలకు తావిస్తోంది. దీంతోపాటు మహిళా కౌన్సిలర్లపై పాలక వర్గానికి చెందిన కీలక నేతలు కామెంట్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇంత జరుగుతున్న అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోక పోవడం పట్ల విమర్శలు వెలువెత్తుతున్నాయి.

శ్రావణి రాజీనామా అనంతరం..

మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి భోగ శ్రావణి రాజీనామా చేసిన తర్వాత తాత్కాలిక చైర్మన్ గా గోలి శ్రీనివాస్ కి బాధ్యతలు అప్పగించారు. కొత్త చైర్మన్ గా బీసీ మహిళను నియమించాల్సి ఉన్నప్పటికీ ఇప్పటికి ఆ దిశగా అడుగులు ముందుకు పడటం లేదు. కొత్త చైర్ పర్సన్ ను ఎందుకు ఎన్నుకోవడం లేదనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. మహిళా బిల్లు కోసం ఢిల్లీ వెళ్లి మద్దతు తెలపడం కాదు ముందు మున్సిపల్ చైర్ పర్సన్ ను నియమించండి అంటూ ప్రతిపక్ష నాయకులు నిలదీస్తున్నారు. ఇందులో రాజకీయ కోణం ఉందని కావాలనే చైర్ పర్సన్ నియామకం చేపట్టడం లేదని ప్రతిపక్ష కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు.

మహిళా కౌన్సిలర్ల అసంతృప్తి..

చైర్ పర్సన్ ను నియమించకపోవడంపై మహిళా కౌన్సిలర్లు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై అధికార పార్టీ కౌన్సిలర్లు రెండు వర్గాలుగా చీలిపోయినట్లు సమాచారం. నియామకం చేపట్టాలని కొంతమంది అధిష్టానం దగ్గర మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందన్న భావనలో ఉన్నట్లుగా చర్చలు నడుస్తున్నాయి. మరోవైపు ఇటీవల మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకలకు చైర్ పర్సన్ సీటు ఆశిస్తున్న వారు మినహా మిగతా కౌన్సిలర్లు గైర్హాజరు అయినట్టు స్పష్టమవుతుంది. అయితే వీరందరు ఓ రెస్టారెంట్ లో సమావేశం ఏర్పాటు చేసుకొని తమ అసంతృప్తిని వెళ్లగక్కినట్లు తెలిసింది.

సోఫా చుట్టూ రాజకీయం..!

మున్సిపల్ కార్యాలయంలో మేల్ డామినేషన్ ఎక్కువైందనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. చైర్మన్ గదిలోకి కొంతమంది మహిళా కౌన్సిలర్ల భర్తలు వచ్చి ఆధిపత్యం చలాయిస్తున్నారనే విమర్శలున్నాయి. సోఫాలలో కౌన్సిలర్ల భర్తలు వచ్చి కూర్చుండటంతో మహిళా కౌన్సిలర్లు ఇబ్బందిగా ఫీలై అసంతృప్తి వ్యక్తం చేయగా సోఫాలను తొలగించినట్లు సమాచారం.

Advertisement

Next Story