Bridge construction : 30 ఏళ్లుగా అవే బాధలు

by Sridhar Babu |   ( Updated:2024-11-01 10:46:10.0  )

దిశ, కాల్వ శ్రీరాంపూర్ : ఎన్నో ప్రభుత్వాలు అధికారంలోకి వస్తున్నాయి పోతున్నాయి. కానీ వారి సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. ఎన్నికల సమయంలో మండలంలోని కిష్టంపేట, బోర్నపల్లి గ్రామాలను కలిపే బ్రిడ్జి నిర్మాణం (Bridge construction)చేపడతామని హామీ ఇచ్చి విస్మరిస్తున్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కిష్టంపేట, చిట్యాల మండలంలోని బోర్నపల్లి గ్రామాల మధ్య ఉన్న మానేరుపై బ్రిడ్జి (Bridge over Maneru)నిర్మాణం లేదు. దాంతో వర్షాలు కురిసినప్పుడు, అలాగే కరీంనగర్ లోని ఎల్ఎండీ డ్యాం గేట్లు తెరిచినప్పుడు వాగు ఉప్పొంగి రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. వాగు దాటాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడపాల్సి వస్తుంది.

వ్యవసాయ పనుల కోసం వాగు దాటాలంటే ఇబ్బందిగా మారింది. ఈ బ్రిడ్జి నిర్మాణంతో కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్ భూపాలపల్లి, ములుగు జిల్లాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది. పెద్దపల్లి జిల్లా ప్రజలు వరంగల్, భూపాలపల్లికి చేరుకోవాలంటే ఎన్నో కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. అలాగే రైతులు వరంగల్ లోని మార్కెట్ లో పత్తి, మిర్చి విక్రయించుకోవడం చాలా సులభం అవుతుంది. ఈ బ్రిడ్జి లేకపోవడంతో భూపాలపల్లి జిల్లాకు వెళ్లాలంటే మంథని, కాటారం గ్రామాల నుంచి పోవాల్సి వస్తుంది.

ఎంతమంది ఎమ్మెల్యేలు మారినా బ్రిడ్జి నిర్మాణం కరువు

పెద్దపల్లి నియోజకవర్గంలో 1994- 1999- నుంచి తెలుగుదేశం అభ్యర్థి బిరుదు రాజమల్లు, అలాగే 1999-2004 లో బీజేపీ అభ్యర్థి గుజ్జుల రామకృష్ణారెడ్డి చిన్న రాతుపల్లి, పెద్దరాత్ పల్లి గ్రామాల మధ్య ఉన్న వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేశారు. ఆ తర్వాత 2004 -2009 లో ఎమ్మెల్యేగా గెలిపిస్తే కిష్టంపేట, బోర్నపల్లి గ్రామాల మధ్య గల మానేరుపై బ్రిడ్జి నిర్మాణం చేపడతానని హామీ ఇచ్చారు. కానీ ఆయన ఎన్నికల్లో ఓడిపోవడంతో బ్రిడ్జి కోసం ఎవరూ ముందుకు రాలేదు. ఆ తర్వాత 2004-2009 లో ముకుందారెడ్డి గెలుపొందారు.

2009-2014 వరకు తెలుగుదేశం అభ్యర్థి చింతకుంట విజయరమణారావు గెలుపొందారు. అలాగే 2014- 2019లో బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి గెలుపొందారు. 2024లో చింతకుంట విజయరమణారావు తిరిగి గెలిచారు. ఇటీవల ఆయన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి బ్రిడ్జికి పునాది వేస్తానని హామీ ఇచ్చారు. కాగా కిష్టంపేట, బుర్నాపల్లి గ్రామాల ప్రజలు మానేరు వాగులో ప్రతి సంవత్సరానికి ఒక గ్రామం చొప్పున మట్టి పోసి కొంత మేర దూరాన్ని తగ్గించుకుంటున్నారు. దాంతో శాశ్వత బ్రిడ్జి నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

నిధులు మంజూరు చేయాలి : రాగుల రాజ్ కుమార్, కిష్టంపేట గ్రామస్తుడు




మానేరు వాగుపై బ్రిడ్జి కోసం నిధులు మంజూరు చేసి, నిర్మాణ పనులు త్వరగా చేపట్టాలి. దాంతో రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ఈ బ్రిడ్జి నిర్మిస్తే వరంగల్, భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లోని రహదారులను అనుసంధానం చేసుకోవచ్చు. ఈ మేరకు కేంద్రమంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గౌడ్ దృష్టిసారించాలని కోరారు.

Advertisement

Next Story