కేసీఆర్ మాటలు నీటి మూటలు: సత్యం

by S Gopi |
కేసీఆర్ మాటలు నీటి మూటలు: సత్యం
X

దిశ, పెగడపల్లి: గత తొమ్మిది ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలు అరిగోస పడుతున్నారని, సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు అన్నీ నీటి మూటలు అయ్యాయని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మర్రిపల్లి సత్యం, బతికేపల్లి ఎంపీటీసీ, రాష్ట్ర మహిళ మోర్చా కార్యవర్గ సభ్యురాలు చింతకింది అనసూర్య అన్నారు. మండలంలోని దోమలకుంట, ఆరవెళ్లి గ్రామాల్లో శక్తి కేంద్రం ఇంచార్జీ కాకర్ల సతీష్ ఆధ్వర్యంలో ప్రజా గోస బీజేపీ భరోసా స్ట్రీట్ కార్న్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో నాయకులు మాట్లాడుతూ తొమ్మిదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో గోస పడుతున్న ప్రజలకు భరోసా కల్పించడానికె బీజేపీ బయల్దేరిందని, అందుకే ప్రతి శక్తి కేంద్రంలో వీధి సమావేశాలు నిర్వహిస్తున్నామని, కేసీఆర్ పాలనలో గత 70 సంవత్సరాలలో ఎన్నడూ జరగనంత అవినీతి జరిగిందని.. ప్రభుత్వం సంక్షేమ పథకాలు అంటూ రాష్ట్ర ప్రజలను అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టింది అన్నారు.

తొమ్మిదేళ్ల పాలనలో ఆచరణకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ తెలంగాణ ప్రజల దృష్టిని మళ్లించడానికి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అంటూ ప్రజల్లోకి వచ్చి మళ్లీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఉచిత విద్యుత్ అంటూ గృహ అవసరాలకు ఇచ్చే విద్యుత్ పై వివిధ ఛార్జీల పేరిట వేలాది రూపాయలు వసూలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించి రైతును రాజును చేస్తానని ప్రగల్భాలు పలికి రోజుకు సగటున ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఎందుకు స్పందించడం లేదన్నారు.

కాళేశ్వరం లింకు 2 ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన నష్టపరిహారం ఇప్పించడంలో ధర్మపురి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ విఫలం అయ్యారని విమర్శించారు. ఈ సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షుడు గంగుల కొమురెల్లి, ప్రధాన కార్యదర్శులు పల్లె మోహన్ రెడ్డి, పెంట నరేందర్, బీజేవైయమ్ నాయకులు మర్రిపెల్లి గంగాధర్, కొత్తూరి బాబు, చింతకింది కిషోర్, బూత్ అధ్యక్షులు కాకర్ల గంగయ్య, గాలిపెల్లి రమేష్, గుర్రం విష్ణు, పోతవేని తిరుపతి, ఉప్పులంచ రమేష్, బోగ లతీశ్, చింతల తిరుపతి, అనుపురం మహేందర్, మన్నే రమేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story